
అతివేగానికి ఇద్దరు బలి
యడ్లపాడు
అతివేగం ఇద్దరి ప్రాణాలను బలిగొంది. మరో ఏడుగురిని తీవ్రగాయాల పాల్జేసింది. వేగంగా వెళుతున్న టాటా ఏస్ వాహనం టైర్ పంక్చరై అదుపుతప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన శనివారం యడ్లపాడు వద్ద జాతీయ రహదారి అండర్‌పాస్ వంతెనపై చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పొన్నూరు మండలం వెల్లలూరుకు చెందిన 11 మంది టాటా ఏస్ వాహనంలో చిలకలూరిపేట శారద జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద సమీప బంధువు దశదిన కర్మకు హాజరయ్యేందుకు బయలుదేరారు.
మార్గంమధ్యలో ఉదయం 10.30 గంటల సమయంలో యడ్లపాడు సెంటర్‌లోని అండర్‌పాస్ వంతెనపైకి వచ్చేప్పటికి వేగంగా వస్తున్న వాహనం వెనుక టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కి పక్కకు ఒరిగిపోయింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందితోపాటు డ్రైవర్ కూడా రోడ్డుపై చెల్లాచెదురుగా పడి తీవ్రగాయాలపాలయ్యారు. బాధితుల హాహాకారాలు, రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది.
వంతెనకు ఇరువైపులా ఉన్న గ్రామస్తులు పరుగున వంతెన పైకి వెళ్లేసరికి రక్తపు మడుగుల్లో కన్నీరుమున్నీరుగా రోదిస్తూ బాధితులు కనిపించారు. వెంటనే పోలీసులకు, 108 సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సహకారంతో క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో ఆస్పత్రులకు తరలించారు. చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించిన ముగ్గురిలో కోట సాంబశివరావు (50) చికిత్సపొందుతూ మృతి చెందాడు.
కూలిపనులు చేసుకునే సాంబశివరావుకు భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వాహన డ్రైవర్ వెలిశెట్టి బాజి, పుప్పాల రోశయ్యలను ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు తరలించారు. కాటూరి మెడికల్ కళాశాల వైద్యశాలలో క్షతగాత్రులు బండి రత్తయ్య, వెలిశెట్టి వెంకటేశ్వరమ్మ చికిత్సపొందుతున్నారు. గుంటూరు జీజీహెచ్‌కు తరలించిన వారిలో కోట శ్రీరాములు (60) చికిత్సపొందుతూ మృతిచెందగా, వెలిశెట్టి లక్ష్మి, వెలిశెట్టి అన్నపూర్ణమ్మ, సూరిశెట్టి రమాదేవి చికిత్స పొందుతున్నారు.
ఆస్పత్రుల వద్ద బంధువుల రోదనలు..
చిలకలూరిపేట, కాటూరు మెడికల్ కళాశాల వైద్యశాల, గుంటూరు జీజీహెచ్‌లకు తరలించిన క్షతగాత్రుల హాహాకారాలు, వారి తాలూకు బంధువుల రోదనలు ఆయా ఆస్పుత్రుల వద్ద మిన్నంటాయి. ఫోన్‌ల ద్వారా సమాచారం అందుకున్న బాధితుల బంధువులు ఎవరెక్కడ ఉన్నారో తెలుసుకుని వారి పరిస్థితిని గమనించేసరికి సాయంత్రమైంది.