తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో డివైడర్‌ను ఢీకొన్న కారు.. నలుగురు మృతి
కృష్ణా జిల్లాలో డివైడర్ మీదుగా దూసుకువెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న కారు..
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత
చంద్రగిరి/హనుమాన్‌జంక్షన్ రూరల్: రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన ఆడిగోపుల శ్రీనివాసులు తన భార్య నీరజకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స కోసం తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కళాశాల(సీఎంసీ)కు తీసుకువెళ్లేందుకు తమ గ్రామానికే చెందిన డ్రైవర్ సమీర్(26)తో కలిసి ఆదివారం రాత్రి కారులో బయలుదేరారు. వారితోపాటు శ్రీనివాసులు అన్న శేషయ్య(49), ఆయన భార్య జయంతి(43) కూడా ఉన్నారు.
మార్గమధ్యంలో మనుబోలు వద్ద నీరజ తల్లి పద్మావతమ్మ(56)ను సైతం వీరు కారులో ఎక్కించుకున్నారు. సోమవారం తెల్లవారుజామున 5.40గంటల సమయంలో తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం, ఎం.కొంగరవారిపల్లి సమీపంలో పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవరు సమీర్, పద్మావతమ్మ, జయంతి, శేషయ్య అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాసులు, నీరజలకు తీవ్ర గాయాలపాలయ్యారు. చంద్రగిరి సీఐ రామయ్య తన సిబ్బందితో కలసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని వారిద్దరినీ 108 అంబులెన్స్‌లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను క్రేన్ సాయంతో బయటకు తీశారు. ఘటనాస్థలంలోనే నలుగురి మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
కృష్ణా జిల్లా కోడూరుపాడు వద్ద...
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లా వేదసంతూర్‌కు చెందిన స్వామినాథన్ తన కుటుంబంతో కలిసి పదేళ్లుగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులోని అడ్వొకేట్ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న స్వామినాథన్ తమిళనాడులోని సొంతూరులో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు కుటుంబంతో కలిసి కారులో బయలుదేరారు. ఆయన కారును మితిమీరిన వేగంతో నడపటంతో కోడూరుపాడు సమీపంలోని పెట్రోలు బంకు వద్ద అదుపు తప్పి రహదారి మధ్యలోని డివైడర్‌ను దాటుకుని అవతల వైపు రోడ్డులో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కావడంతో డ్రైవింగ్ చేస్తున్న స్వామినాథన్(40), ఆయన కుమార్తె రాధాప్రియ(14), కుమారుడు రాకే‹Ù(12), సోదరుడి కుమారుడు గోపి(23) అక్కడికక్కడే మృతిచెందారు. స్వామినాథన్ భార్య సత్య(38)కు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానికులు అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హనుమాన్‌జంక్షన్ సీఐ అల్లు నవీన్ నరసింహామూర్తి, వీరవల్లి ఎస్‌ఐ ఎం.చిరంజీవి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, గన్నవరం డీఎస్పీ ఆర్.జయసూర్య, ట్రైనీ డీఎస్పీ వేదశ్రీ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment