
సాక్షి, కృష్ణా జిల్లా: చాట్రాయి తహసీల్దారు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ నేతల సిఫారసులు ఉన్న వారికే ఇళ్ళపట్టాలు పంపిణీ చేస్తుండటం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలమేరకు.. స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వకుండా తహశీల్దార్ బాలకృష్ణారెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. అధికార పార్టీ నేతలు సిఫారసు చేసిన వారికే ఇళ్ళపట్టాలు పంపిణీ చేస్తున్న విషయం బయటకు తెలియడంతో లబ్ధిదారులతో కలిసి నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు తహసీల్దారు కార్యాలయం వద్దకు వచ్చారు.
దీంతో ఆయనకు సమాధానం చెప్పకుండా అధికారులు మొకం చాటేశారు. ఇందుకు నిరసనగా తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే బైటాయించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు సైతం భారీగా తహసీల్దారు కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
స్పందించిన కలెక్టర్ లక్ష్మీకాంతం
ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆందోళన నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీకాంతం స్పందించారు. మేకా ప్రతాప్ అప్పారావుతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ప్రోటోకాల్ పాటించకపోవడం పొరపాటేనని తహసీల్దారు లిఖితపూర్వకంగా ఎమ్మెల్యే వద్ద విచారం వ్యక్తం చేశారు. తహసీల్దారు వివరణతో ఎమ్మెల్యే ఆందోళన విరమించారు. అనంతరం అర్హులైన వారికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పట్టాల పంపిణీ చేపడతామని తహసీల్దార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment