నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: హైవేలో లారీ డ్రైవర్లు, క్లీనర్లను హతమార్చి, లారీ నెంబర్లు మార్చి విక్రయించే మున్నా గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎన్‌జీఓ కాలనీలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో ఆదివారం సాయంత్రం పోలీసులు సోదాలు నిర్వహించగా గ్యాంగ్ లీడర్ మున్నా సహా 8 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకొని నిందితులను జిల్లా కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. విద్య, వ్యాపార సంస్థలు, నివాస గృహాలతో ప్రశాంతంగా ఉండే ఎన్‌జీఓ కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌ను కర్నూలు నుండి రెండు వాహనాల్లో వచ్చిన పోలీసుల బృందం తమ అదుపులోకి తీసుకుంది. 3వ అంతస్తులోని ఓ ఫ్లాట్ ఉన్న మున్నాతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసి స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వీరి నుండి కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్నోవా, స్కోడా కార్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో స్థానిక దేవనగర్, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ జిల్లా కేంద్రానికి తరలించారు. ఇదిలాఉండగా మున్నా గ్యాంగ్‌పై ప్రకాశం జిల్లాలో పలు కేసులు నమోదైనట్లు సమాచారం. బ్రోకర్ల ద్వారా లారీలను అద్దెకు తీసుకోవడం, మార్గమధ్యంలో డ్రైవర్, క్లీనర్‌ను అంతమొందించి లారీలను విక్రయించి సొమ్ము చేసుకోవడం ఈ ముఠా ప్రత్యేకత. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అర్బన్, రూరల్, టంగుటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఠాపై పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.
పోలీసుల అదుపులో హైవే కిల్లర్స్ గ్యాంగ్
Published Mon, Jan 13 2014 4:21 AM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM
Advertisement
Advertisement