మున్నా, ఇతర నిందితులు (కుడి నుంచి ఎడమకు) ఫైల్
ఒంగోలు: హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు 8వ అదనపు జిల్లా జడ్జి జి.మనోహర్‌రెడ్డి సోమవారం తీర్పు చెప్పారు. నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి పదేళ్లు, మరొకరికి ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. 2008లో అప్పటి 5వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన దారుణ హత్యలపై ఒకేసారి 12 మందికి ఉరిశిక్ష విధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఈ గ్యాంగ్ దారుణాలకు సంబంధించి 4 కేసుల్లో మొత్తం 20 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్లు దాఖలు చేశారు. వీటిలో ఒక కేసును సీఐడీ దర్యాప్తు చేయగా 3 కేసుల్ని పోలీసులు దర్యాప్తు చేశారు. సీఐడీ దర్యాప్తు చేసిన కేసులో 17 మంది నిందితులకుగాను బెంగళూరుకు చెందిన హలీంసేట్, షౌకత్ పరారీలో ఉన్నారు. మొత్తం 4 కేసుల్లో 20 మంది నిందితులకుగాను ఇద్దరు పరారీలో ఉండగా మిగిలిన 18 మందికి శిక్షలు విధించారు.
జరిగింది ఇదీ..
ఈ ముఠా సభ్యులు పోలీసులమని చెప్పుకొంటూ హైవేపై ఇనుముతో వెళుతున్న పెద్ద లారీలను ఆపి తనిఖీల పేరుతో డ్రైవర్, క్లీనర్లతో మాట్లాడుతున్నట్లు నటించి వారి గొంతులకు తాళ్లు బిగించి దారుణంగా హత్య చేసేవారు. మృతదేహాలను గోతాలలో కుక్కి కాలువలు, వాగుల వెంబడి కట్టల్లో పూడ్చిపెట్టేవారు. లారీలోని ఇనుముతోపాటు, లారీలను సైతం ముక్కలు చేసి పాత ఇనుముకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. 2008లో జరిగిన ఈ సంఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ రామశేఖర్, క్లీనర్ పెరుమాల్ సుబ్రమణి అదృశ్యం అయ్యారు. వారు ఒంగోలు వరకు యజమాని వీరప్పన్ కుప్పుస్వామికి ఫోన్ టచ్‌లో ఉన్నారు. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లేకపోవడంతో ఆయన ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అప్పటి ట్రైనీ డీఎస్పీ, ప్రస్తుత పీటీసీ ప్రిన్సిపాల్ ఏఆర్ దామోదర్ ప్రాథమిక విచారణలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డ్రైవర్, క్లీనర్‌లను ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద హత్యచేసి మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గుండ్లకమ్మ కాలువకట్టలో పూడ్చిపెట్టినట్లు తేలింది. ఛత్తీస్‌ఘడ్ నుంచి కాంచీపురం వెళుతున్న మరో లారీని తెట్టు వద్ద ఆపి డ్రైవర్ భూషణ్‌యాదవ్, క్లీనర్ చందన్‌కుమార్ మెహతోలను చంపేసి మన్నేరు వాగులో పూడ్చిపెట్టారు.
తమిళనాడులోని గుమ్మడిపూడి నుంచి కాకినాడ వెళుతున్న మరో లారీని ఏడుగుండ్లపాడు వద్ద ఆపి డ్రైవర్ గూడూరి శ్యాంబాబు, క్లీనర్ గుత్తుల వినోద్‌కుమార్ (పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల వాసులు)లను చంపి నాగులుప్పలపాడు మండలం చదలవాడ గుండ్లకమ్మ ఒడ్డున పూడ్చివేశారు. నాగాలాండ్‌కు చెందిన మరో లారీ డ్రైవర్‌ను దారుణంగా హత్యచేసి మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు చప్టా వద్ద పూడ్చిపెట్టారు. ఇక మున్నా వద్ద ఉన్న కార్బన్ మెషీన్‌గన్‌కు సంబంధించి నలుగురిపై ఆయుధాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు.
ఉరిశిక్షతోపాటు మరికొన్ని శిక్షలు పడినవారు
మొహమ్మద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా, షేక్ రియాజ్ (ఒంగోలు), సయ్యద్ హిదయతుల్లా అలియాస్ బాబు (దొనకొండ మండలం వీరవెంకటాపురం), మొహమ్మద్ జమాలుద్దీన్ అలియాస్ జమాల్ (బెంగళూరు), బత్తల సాల్మన్ (మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు), యేపూరి చినవీరాస్వామి, యేపూరి పెదవీరాస్వామి (గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం రెడ్డిపాలెం), గుండు భానుప్రకాష్ అలియాస్ గజని, రాచమళ్ల సంపత్, గుండెబోయిన శ్రీధర్ (తెలంగాణలోని వరంగల్ జిల్లా హనుమకొండ మండలం కొత్తసాయంపేట), షేక్ హఫీజ్ (ఒంగోలు జయరాం థియేటర్ ప్రాంతం), షేక్ దాదాపీర్ అలియాస్ ఘని (అనంతపురం జిల్లా హిందూపూరం మోడరన్ కాలనీ).
యావజ్జీవశిక్షతోపాటు మరికొన్ని శిక్షలు పడినవారు
ఆర్ల గంగాధర్ (వై.పాలెం మాజీ ఇన్‌చార్జి ఎంపీడీవో, ఒంగోలు సుజాతానగర్ నివాసి), షేక్ కమాల్‌సాహెబ్ అలియాస్ కమాల్ (తులసీరాం థియేటర్ ఎదురు ప్రాంతవాసి), షేక్ రహంతుల్లా (ఒంగోలు ఇస్లాంపేట), షేక్ ఇర్ఫాన్ (ఒంగోలు గానుగపాలెం).
మిగిలిన శిక్షలు: ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన షేక్ రఫీకి ఒక కేసులో ఏడు సంవత్సరాల జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా, గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు వాసి పట్రా గాలెయ్యకు ఆయుధాల చట్టం ప్రకారం నమోదైన కేసులో పదేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా.
రివార్డులకు సిఫారసు
జాతీయ రహదారిపై దోపిడీ, హత్యలకు సంబంధించి ఒంగోలు తాలూకా పోలీసులు నమోదు చేసిన ఒక కేసును సీఐడీ దర్యాప్తు చేసిందని సీఐడీ ప్రాంతీయ కార్యాలయ అదనపు ఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో మున్నాతో పాటు 10 మందికి ఉరిశిక్ష, ఐదుగురికి జీవిత ఖైదు పడినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 2010లో సీఐడీ డీఎస్పీ రఘు చార్జిషీటును దాఖలు చేయగా ప్రాసిక్యూషన్ తరఫున శివరామకృష్ణప్రసాద్ వాదనలు వినిపించారని తెలిపారు. కేసు విజయవంతంగా పరిష్కారమయ్యేందుకు కృషిచేసిన అందరికి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
టేకప్ చేసిన తొలికేసులోనే మంచి తీర్పువచ్చింది
ట్రైనీ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈ లారీ మిస్సింగ్ కేసు వచ్చింది. తొలుత అనేక అనుమానాలు వెన్నాడాయి. లారీ బయలుదేరిన ప్రాంతం నుంచి టోల్‌గేట్ల వద్ద సమాచారం సేకరించాం. చివరగా లారీ యజమానితో మాట్లాడిన వివరాలు, లారీ డ్రైవర్ , క్లీనర్‌లకు సంబంధించిన సమాచారం సేకరించాం. ఈ దశలోనే మాకు పాత ఇనుపకొట్ల వారిపై అనుమానం ఏర్పడింది. అదే కేసు ఛేదించేందుకు అనువుగా మారింది.
– ఏఆర్ దామోదర్, అప్పటి ట్రైనీ డీఎస్పీ, ప్రస్తుతం ఒంగోలు పీటీసీ ప్రిన్సిపాల్
దర్యాప్తులో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం
దర్యాప్తు సందర్భంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సిమ్ కార్డులను ఇష్టం వచ్చినట్లు మారుస్తుండడంతో వారిని అరెస్టు చేసేందుకు వెళ్లినవారు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. చివరకు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే బయటపడిన విషయాలతో విస్తుపోవాల్సి వచ్చింది. ఎక్కడెక్కడ చంపారు, శవాలను ఎక్కడ పూడ్చారనే వివరాలను వెల్లడించారు. కానీ ఆ శవాలను వారు బయటకు తీస్తున్నపుడు శవాలకు బదులుగా అస్తిపంజరాలను చూడడంతో తీవ్రంగా కలత చెందాం.
– టి.శంకరరెడ్డి, అప్పటి టౌన్ డీఎస్పీ, రిటైర్డ్ అదనపు ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment