highway killers
-
హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ అరాచకాలు అంతం
-
ఒంగోలు కోర్టు సంచలన తీర్పు; 12 మందికి ఉరి శిక్ష
ఒంగోలు: హైవే కిల్లర్ మున్నా గ్యాంగ్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 12 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు 8వ అదనపు జిల్లా జడ్జి జి.మనోహర్‌రెడ్డి సోమవారం తీర్పు చెప్పారు. నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒకరికి పదేళ్లు, మరొకరికి ఏడేళ్ల జైలుశిక్ష విధించారు. 2008లో అప్పటి 5వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన దారుణ హత్యలపై ఒకేసారి 12 మందికి ఉరిశిక్ష విధించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ గ్యాంగ్ దారుణాలకు సంబంధించి 4 కేసుల్లో మొత్తం 20 మందిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్లు దాఖలు చేశారు. వీటిలో ఒక కేసును సీఐడీ దర్యాప్తు చేయగా 3 కేసుల్ని పోలీసులు దర్యాప్తు చేశారు. సీఐడీ దర్యాప్తు చేసిన కేసులో 17 మంది నిందితులకుగాను బెంగళూరుకు చెందిన హలీంసేట్, షౌకత్ పరారీలో ఉన్నారు. మొత్తం 4 కేసుల్లో 20 మంది నిందితులకుగాను ఇద్దరు పరారీలో ఉండగా మిగిలిన 18 మందికి శిక్షలు విధించారు. జరిగింది ఇదీ.. ఈ ముఠా సభ్యులు పోలీసులమని చెప్పుకొంటూ హైవేపై ఇనుముతో వెళుతున్న పెద్ద లారీలను ఆపి తనిఖీల పేరుతో డ్రైవర్, క్లీనర్లతో మాట్లాడుతున్నట్లు నటించి వారి గొంతులకు తాళ్లు బిగించి దారుణంగా హత్య చేసేవారు. మృతదేహాలను గోతాలలో కుక్కి కాలువలు, వాగుల వెంబడి కట్టల్లో పూడ్చిపెట్టేవారు. లారీలోని ఇనుముతోపాటు, లారీలను సైతం ముక్కలు చేసి పాత ఇనుముకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. 2008లో జరిగిన ఈ సంఘటనలు తీవ్ర సంచలనం కలిగించాయి. తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ రామశేఖర్, క్లీనర్ పెరుమాల్ సుబ్రమణి అదృశ్యం అయ్యారు. వారు ఒంగోలు వరకు యజమాని వీరప్పన్ కుప్పుస్వామికి ఫోన్ టచ్‌లో ఉన్నారు. రోజులు గడుస్తున్నా వారి ఆచూకీ లేకపోవడంతో ఆయన ఒంగోలు తాలూకా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ట్రైనీ డీఎస్పీ, ప్రస్తుత పీటీసీ ప్రిన్సిపాల్ ఏఆర్ దామోదర్ ప్రాథమిక విచారణలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. డ్రైవర్, క్లీనర్లను ప్రకాశం జిల్లా ఉలవపాడు వద్ద హత్యచేసి మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గుండ్లకమ్మ కాలువకట్టలో పూడ్చిపెట్టినట్లు తేలింది. ఛత్తీస్‌ఘడ్ నుంచి కాంచీపురం వెళుతున్న మరో లారీని తెట్టు వద్ద ఆపి డ్రైవర్ భూషణ్‌యాదవ్, క్లీనర్ చందన్‌కుమార్ మెహతోలను చంపేసి మన్నేరు వాగులో పూడ్చిపెట్టారు. తమిళనాడులోని గుమ్మడిపూడి నుంచి కాకినాడ వెళుతున్న మరో లారీని ఏడుగుండ్లపాడు వద్ద ఆపి డ్రైవర్ గూడూరి శ్యాంబాబు, క్లీనర్ గుత్తుల వినోద్‌కుమార్ (పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల వాసులు)లను చంపి నాగులుప్పలపాడు మండలం చదలవాడ గుండ్లకమ్మ ఒడ్డున పూడ్చివేశారు. నాగాలాండ్‌కు చెందిన మరో లారీ డ్రైవర్‌ను దారుణంగా హత్యచేసి మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు చప్టా వద్ద పూడ్చిపెట్టారు. ఇక మున్నా వద్ద ఉన్న కార్బన్ మెషీన్గన్కు సంబంధించి నలుగురిపై ఆయుధాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ఉరిశిక్షతోపాటు మరికొన్ని శిక్షలు పడినవారు మొహమ్మద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నా, షేక్ రియాజ్ (ఒంగోలు), సయ్యద్ హిదయతుల్లా అలియాస్ బాబు (దొనకొండ మండలం వీరవెంకటాపురం), మొహమ్మద్ జమాలుద్దీన్ అలియాస్ జమాల్ (బెంగళూరు), బత్తల సాల్మన్ (మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు), యేపూరి చినవీరాస్వామి, యేపూరి పెదవీరాస్వామి (గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం రెడ్డిపాలెం), గుండు భానుప్రకాష్ అలియాస్ గజని, రాచమళ్ల సంపత్, గుండెబోయిన శ్రీధర్ (తెలంగాణలోని వరంగల్ జిల్లా హనుమకొండ మండలం కొత్తసాయంపేట), షేక్ హఫీజ్ (ఒంగోలు జయరాం థియేటర్ ప్రాంతం), షేక్ దాదాపీర్ అలియాస్ ఘని (అనంతపురం జిల్లా హిందూపూరం మోడరన్ కాలనీ). యావజ్జీవశిక్షతోపాటు మరికొన్ని శిక్షలు పడినవారు ఆర్ల గంగాధర్ (వై.పాలెం మాజీ ఇన్చార్జి ఎంపీడీవో, ఒంగోలు సుజాతానగర్ నివాసి), షేక్ కమాల్‌సాహెబ్ అలియాస్ కమాల్ (తులసీరాం థియేటర్ ఎదురు ప్రాంతవాసి), షేక్ రహంతుల్లా (ఒంగోలు ఇస్లాంపేట), షేక్ ఇర్ఫాన్ (ఒంగోలు గానుగపాలెం). మిగిలిన శిక్షలు: ఒంగోలు ఇస్లాంపేటకు చెందిన షేక్ రఫీకి ఒక కేసులో ఏడు సంవత్సరాల జైలుశిక్ష, రూ.5వేలు జరిమానా, గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు వాసి పట్రా గాలెయ్యకు ఆయుధాల చట్టం ప్రకారం నమోదైన కేసులో పదేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా. రివార్డులకు సిఫారసు జాతీయ రహదారిపై దోపిడీ, హత్యలకు సంబంధించి ఒంగోలు తాలూకా పోలీసులు నమోదు చేసిన ఒక కేసును సీఐడీ దర్యాప్తు చేసిందని సీఐడీ ప్రాంతీయ కార్యాలయ అదనపు ఎస్పీ పీఆర్ రాజేంద్రకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కేసులో మున్నాతో పాటు 10 మందికి ఉరిశిక్ష, ఐదుగురికి జీవిత ఖైదు పడినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 2010లో సీఐడీ డీఎస్పీ రఘు చార్జిషీటును దాఖలు చేయగా ప్రాసిక్యూషన్ తరఫున శివరామకృష్ణప్రసాద్ వాదనలు వినిపించారని తెలిపారు. కేసు విజయవంతంగా పరిష్కారమయ్యేందుకు కృషిచేసిన అందరికి రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టేకప్ చేసిన తొలికేసులోనే మంచి తీర్పువచ్చింది ట్రైనీ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఈ లారీ మిస్సింగ్ కేసు వచ్చింది. తొలుత అనేక అనుమానాలు వెన్నాడాయి. లారీ బయలుదేరిన ప్రాంతం నుంచి టోల్గేట్ల వద్ద సమాచారం సేకరించాం. చివరగా లారీ యజమానితో మాట్లాడిన వివరాలు, లారీ డ్రైవర్ , క్లీనర్లకు సంబంధించిన సమాచారం సేకరించాం. ఈ దశలోనే మాకు పాత ఇనుపకొట్ల వారిపై అనుమానం ఏర్పడింది. అదే కేసు ఛేదించేందుకు అనువుగా మారింది. – ఏఆర్ దామోదర్, అప్పటి ట్రైనీ డీఎస్పీ, ప్రస్తుతం ఒంగోలు పీటీసీ ప్రిన్సిపాల్ దర్యాప్తులో అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం దర్యాప్తు సందర్భంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సిమ్ కార్డులను ఇష్టం వచ్చినట్లు మారుస్తుండడంతో వారిని అరెస్టు చేసేందుకు వెళ్లినవారు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. చివరకు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే బయటపడిన విషయాలతో విస్తుపోవాల్సి వచ్చింది. ఎక్కడెక్కడ చంపారు, శవాలను ఎక్కడ పూడ్చారనే వివరాలను వెల్లడించారు. కానీ ఆ శవాలను వారు బయటకు తీస్తున్నపుడు శవాలకు బదులుగా అస్తిపంజరాలను చూడడంతో తీవ్రంగా కలత చెందాం. – టి.శంకరరెడ్డి, అప్పటి టౌన్ డీఎస్పీ, రిటైర్డ్ అదనపు ఎస్పీ -
ప్రకాశం: హైవే కిల్లర్ మున్నాకు ఉరిశిక్ష
-
హైవే కిల్లర్స్..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఖరీదైన లోడుతో రోడ్డెక్కాలంటే లారీడ్రైవర్లు హడలిపోతున్నారు. ఎప్పుడు? ఎక్కడ? ఎవరు లారీని హైజాక్ చేసి హత్య చేస్తారోనని భయపడుతున్నారు. అందుకు వరస సంఘటనలే నిదర్శనం. జిల్లాలో ఇటీవలి కాలంలో వరుసగా లారీలు హైజాక్‌కు గురవుతున్నాయి. దొంగలముఠా చేతిలో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. సినీపక్కీలో జరుగుతున్న లారీల హైజాక్ ముఠాలోని కొందరిని గురువారం తడ పోలీసులు అరెస్టు చేశారు. అయితే లారీ హైజాక్ చేసే ముఠాలు మరికొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. ఏడు రోజుల క్రితం చెన్నై నుంచి హైదరాబాద్‌కు స్టీలు సామాన్లు తరలించే లారీ దొరవారిసత్రం వద్ద హైజాక్ గురైంది. లారీ డ్రైవర్‌ను దొంగలముఠా నమ్మించి మద్యం తాపించి హత్య చేసి క్యాబిన్లో దాచారు. వీరిని కావలి పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా గతంలో మరో లారీని హైజాక్ చేసి లారీ డ్రైవర్, క్లీనర్‌ను చంపి గూడూరు వద్ద పాతిపెట్టిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇకపోతే నెల్లూరు నవలాకులతోట వద్ద సోమవారం వేణుగోపాల్‌రావు లారీ కనిపించకుండా పోయింది. ఆ లారీ రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా వద్ద కనిపించింది. అయితే అందులో సామాన్లు, టైర్లు పట్టుకెళ్లారు. వారెవరనేది తెలియరాలేదు. ఏడాది క్రితం తడ పరిధిలోని సరిహద్దు పంచాయతీలు, పెరియవట్టు, పన్నంగాడు వద్ద అర్ధరాత్రి సమయంలో రెండు లారీలు అపహరణకు గురయ్యాయి. ఇందులో కలకత్తా నుంచి చాక్లెట్ల లోడుతో ఓ మినీ లారీ, ఇండోర్ నుంచి ఇనుప కడ్డీల లోడుతో వెళుతున్న మరో లారీని అపహరించుకు వెళ్లారు. ఇందులో ఇనుప కడ్డీల లారీ సరుకు లేకుండా చిత్తూరు జిల్లా పరిధిలో రోడ్డు పక్కన ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ల లోడు లారీకి సంబంధించి పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ చేపట్టి ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటివరకు రెండు లారీలను ఒకే ముఠా అపహరించిందని భావించిన పోలీసులు ఈ ముఠా అరెస్టు తర్వాత ఇది రెండు వేర్వేరు ముఠాల పనిగా గుర్తించారు. కానీ ఇనుపలోడ్డు లారీకి సంబంధించిన దొంగల ఆచూకీ మాత్రం లభించలేదు. హైజాక్ ముఠాలు... లారీలను హైజాక్ చేసే ముఠాలు విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. చెన్నై, ఒంగోలు, పలమనేరుకు చెందిన ముఠాలు ఇటువంటి పనుల్లో ఆరితేరిన వారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీరు స్టీలు సామాన్లు, ఐరన్ ఓర్, ఇనుప సామగ్రితో దూర ప్రాంతాలకు తరలివెళ్తున్న లారీలే టార్గెట్ చేస్తారని వెల్లడించారు. ఈ ముఠాలు లోడు చేస్తున్న వివిధ పరిశ్రమల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. డ్రైవర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని అతడిని ట్రాప్ చేస్తారు. అలా కుదరని పక్షంలో కిడ్నాప్‌చేసి హత్యచేసి లారీని అపహరించుకెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చిత్తూరు జిల్లా పలమనేరు ముఠా లారీలను అపహరించుకెళ్లేవారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠాకు శ్రీరాములు లీడర్‌గా వ్యవహరించేవాడు. పలమనేరు ముఠాను గతంలో తమిళనాడు ప్రాంతంలోని తూతుకూడి పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఒంగోలుకు చెందిన మున్నా ముఠా కూడా లారీలను హైజాక్ చేసే వారని తెలిసింది. ఒక్కో ముఠాలో సుమారు 10 మంది సభ్యులు ఉంటారని తెలిసింది. వీరిలో కొందరు రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో కాపుకాచి ఉంటారు. లారీ లోడుతో బయలుదేరుతూనే ముఠా సభ్యులకు సమాచారం ఇస్తారు. పథకం ప్రకారం లారీని హైజాక్ చేస్తారు. మాట వినని లారీ డ్రైవర్, క్లీనర్‌ను కత్తితోనో.. ప్లాస్టిక్ వైర్లతో హత్యచేసి రహస్య ప్రాంతాల్లో పాతిపెట్టి లారీతో ఉడాయిస్తారని నిఘావర్గాలు వెల్లడించాయి. తాజా గా తడ వద్ద పట్టుబడ్డ హైజాక్ ముఠా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో జరిగిన వివిధ లారీల చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు తెలిసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని తదితర ప్రాంతాలలో జరిగిన ఇలాంటి నేరాలతో వీరికి ఉన్న సంబందాలు ఉన్నాయా? లేదా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. -
హైవే కిల్లర్స్ ఘాతుకం
కావలి : చెన్నై నుంచి హైదరాబాద్‌కు స్టీల్ సామాన్లతో వెళ్తున్న లారీని కొందరు దుండగులు హైజాక్ చేశారు. ఆ లారీ డ్రైవర్‌ను గొంతు కోసి హత్య చేసి క్యాబిన్‌లోనే పడేశారు. హైజాక్‌కు గురైన లారీని, దుండగులను పోలీ సులు శనివారం గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.పోలీసుల సమాచారం మేరకు.. కావలి, ప్రకాశం జిల్లా పోలీసుల కథనం మేరకు.. చెన్నె నుంచి హైదరాబాద్‌కు స్టీల్ సామానులతో లారీ లోడ్లు ప్రతి రోజూ బయలు దేరుతాయి. శరవణన్ ట్రావెల్స్‌కు చెందిన ఓ లారీ 4వ తేదీ రాత్రి సామానులతో బయలుదేరింది. ఆ లారీకి దొరవారిసత్రం మండలం ఏకొల్లుకు చెందిన బండిళ్ల దయాసాగర్ (48) డ్రైవర్‌గా వెళుతున్నాడు. మార్గమధ్యలో దయాసాగర్ ఇంటికి వెళ్లి కొద్దిసేపు గడిపి హైదరాబాద్‌కు బయలు దేరాడు. 5వ తేదీ రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరాల్సి ఉంది. కానీ లారీ చేరలేదు. ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద చెన్నై వైపు అదే కంపెనీకి చెందిన మరో లారీ శనివారం ఉదయం వెళుతుంది. అదే సమయంలో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన లారీ తన లారీని క్రాస్చేసిపోవడంతో అనుమానం వచ్చిన ఆ లారీ డ్రైవర్ దయాసాగర్‌కు ఫోన్ చేశాడు. అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ ట్రావెల్స్ మేనేజర్ గురువేంద్రకు ఫోన్ చేసి చెప్పాడు. అతను ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు జాతీయ రహదారిపై గాలింపు చర్యలు చేపట్టారు. హైజాక్‌కు గురైన లారీ కావలి వరకు వెళ్లి తిరిగి చాగల్లు వద్ద ఉన్న ఓ డాబా వద్ద ఆగి ఉంది. కావలి ఒకటో పట్టణ సీఐ వెంకట్రావు, ఇతర సిబ్బంది ఆ లారీని గుర్తించారు. లారీలో పరిశీలించగా క్యాబిన్లో డ్రైవర్ దయాసాగర్‌ను గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించా రు. క్యాబిన్లో రక్త గాయాలు, రక్తం అంటిన బ్లేడ్లు కనిపించాయి. ఆ లారీని ఎవరు ఆపారని స్థానికంగా విచారించగా పక్కనే ఉన్న ఓ మద్యం దుకాణం పక్కన ఖాళీ స్థలంలో మద్యం సేవిస్తున్న ముగ్గురిని స్థానికులు చూపించినట్లు తెలుస్తుంది. దీంతో వారిని సీఐ వెంకట్రావు అదుపులోకి తీసుకుని కందుకూరు పోలీసులకు అప్పగించారు. ముగ్గురిని ప్రకాశం జిల్లా ఉలవపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే లారీ ట్రావెల్స్ మేనేజర్ గురువేంద్ర సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏడాది క్రితమే కుమార్తెకు వివాహం చేశాడు. కందుకూరు, కావలి సీఐలు లక్ష్మణ్, వెంకటరావు, కందుకూరు ఎస్సై రమణయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ లారీలు వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణవిగా తెలుస్తుంది. తమిళనాడు ముఠా పనే ఈ సంఘటకు పాల్పడింది తమిళనాడుకు చెందిన ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులో తీసుకున్న వారిలో కళవరమూర్తి, మణివన్నన్, మణిగా పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో వీరు ఇలాగే లారీలను హైజాక్ చేసినట్లు పోలీసులు అనుమానంతో విచారిస్తున్నట్లు తెలుస్తుంది. -
పోలీసుల అదుపులో హైవే కిల్లర్స్ గ్యాంగ్
నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: హైవేలో లారీ డ్రైవర్లు, క్లీనర్లను హతమార్చి, లారీ నెంబర్లు మార్చి విక్రయించే మున్నా గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎన్జీఓ కాలనీలో ఉన్న ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఆదివారం సాయంత్రం పోలీసులు సోదాలు నిర్వహించగా గ్యాంగ్ లీడర్ మున్నా సహా 8 మంది పట్టుబడ్డారు. వీరి నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకొని నిందితులను జిల్లా కేంద్రానికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. విద్య, వ్యాపార సంస్థలు, నివాస గృహాలతో ప్రశాంతంగా ఉండే ఎన్జీఓ కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌ను కర్నూలు నుండి రెండు వాహనాల్లో వచ్చిన పోలీసుల బృందం తమ అదుపులోకి తీసుకుంది. 3వ అంతస్తులోని ఓ ఫ్లాట్ ఉన్న మున్నాతో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసి స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి నుండి కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న ఇన్నోవా, స్కోడా కార్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో స్థానిక దేవనగర్, ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరినీ జిల్లా కేంద్రానికి తరలించారు. ఇదిలాఉండగా మున్నా గ్యాంగ్‌పై ప్రకాశం జిల్లాలో పలు కేసులు నమోదైనట్లు సమాచారం. బ్రోకర్ల ద్వారా లారీలను అద్దెకు తీసుకోవడం, మార్గమధ్యంలో డ్రైవర్, క్లీనర్‌ను అంతమొందించి లారీలను విక్రయించి సొమ్ము చేసుకోవడం ఈ ముఠా ప్రత్యేకత. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు అర్బన్, రూరల్, టంగుటూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో ముఠాపై పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.