సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ఖరీదైన లోడుతో రోడ్డెక్కాలంటే లారీడ్రైవర్లు హడలిపోతున్నారు. ఎప్పుడు? ఎక్కడ? ఎవరు లారీని హైజాక్ చేసి హత్య చేస్తారోనని భయపడుతున్నారు. అందుకు వరస సంఘటనలే నిదర్శనం. జిల్లాలో ఇటీవలి కాలంలో వరుసగా లారీలు హైజాక్‌కు గురవుతున్నాయి. దొంగలముఠా చేతిలో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోతున్నారు. సినీపక్కీలో జరుగుతున్న లారీల హైజాక్ ముఠాలోని కొందరిని గురువారం తడ పోలీసులు అరెస్టు చేశారు. అయితే లారీ హైజాక్ చేసే ముఠాలు మరికొన్ని ఉన్నట్లు తెలుస్తోంది.
ఏడు రోజుల క్రితం చెన్నై నుంచి హైదరాబాద్‌కు స్టీలు సామాన్లు తరలించే లారీ దొరవారిసత్రం వద్ద హైజాక్ గురైంది. లారీ డ్రైవర్‌ను దొంగలముఠా నమ్మించి మద్యం తాపించి హత్య చేసి క్యాబిన్‌లో దాచారు. వీరిని కావలి పోలీసులు పట్టుకున్నారు. అదేవిధంగా గతంలో మరో లారీని హైజాక్ చేసి లారీ డ్రైవర్, క్లీనర్‌ను చంపి గూడూరు వద్ద పాతిపెట్టిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇకపోతే నెల్లూరు నవలాకులతోట వద్ద సోమవారం వేణుగోపాల్‌రావు లారీ కనిపించకుండా పోయింది.
ఆ లారీ రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా వద్ద కనిపించింది. అయితే అందులో సామాన్లు, టైర్లు పట్టుకెళ్లారు. వారెవరనేది తెలియరాలేదు. ఏడాది క్రితం తడ పరిధిలోని సరిహద్దు పంచాయతీలు, పెరియవట్టు, పన్నంగాడు వద్ద అర్ధరాత్రి సమయంలో రెండు లారీలు అపహరణకు గురయ్యాయి. ఇందులో కలకత్తా నుంచి చాక్లెట్ల లోడుతో ఓ మినీ లారీ, ఇండోర్ నుంచి ఇనుప కడ్డీల లోడుతో వెళుతున్న మరో లారీని అపహరించుకు వెళ్లారు.
ఇందులో ఇనుప కడ్డీల లారీ సరుకు లేకుండా చిత్తూరు జిల్లా పరిధిలో రోడ్డు పక్కన ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ల లోడు లారీకి సంబంధించి పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ చేపట్టి ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటివరకు రెండు లారీలను ఒకే ముఠా అపహరించిందని భావించిన పోలీసులు ఈ ముఠా అరెస్టు తర్వాత ఇది రెండు వేర్వేరు ముఠాల పనిగా గుర్తించారు. కానీ ఇనుపలోడ్డు లారీకి సంబంధించిన దొంగల ఆచూకీ మాత్రం లభించలేదు.
హైజాక్ ముఠాలు...
లారీలను హైజాక్ చేసే ముఠాలు విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. చెన్నై, ఒంగోలు, పలమనేరుకు చెందిన ముఠాలు ఇటువంటి పనుల్లో ఆరితేరిన వారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. వీరు స్టీలు సామాన్లు, ఐరన్ ఓర్, ఇనుప సామగ్రితో దూర ప్రాంతాలకు తరలివెళ్తున్న లారీలే టార్గెట్ చేస్తారని వెల్లడించారు. ఈ ముఠాలు లోడు చేస్తున్న వివిధ పరిశ్రమల వద్ద రెక్కీ నిర్వహిస్తారు. డ్రైవర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని అతడిని ట్రాప్ చేస్తారు.
అలా కుదరని పక్షంలో కిడ్నాప్‌చేసి హత్యచేసి లారీని అపహరించుకెళ్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చిత్తూరు జిల్లా పలమనేరు ముఠా లారీలను అపహరించుకెళ్లేవారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠాకు శ్రీరాములు లీడర్‌గా వ్యవహరించేవాడు. పలమనేరు ముఠాను గతంలో తమిళనాడు ప్రాంతంలోని తూతుకూడి పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా ఒంగోలుకు చెందిన మున్నా ముఠా కూడా లారీలను హైజాక్ చేసే వారని తెలిసింది.
ఒక్కో ముఠాలో సుమారు 10 మంది సభ్యులు ఉంటారని తెలిసింది. వీరిలో కొందరు రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో కాపుకాచి ఉంటారు. లారీ లోడుతో బయలుదేరుతూనే ముఠా సభ్యులకు సమాచారం ఇస్తారు. పథకం ప్రకారం లారీని హైజాక్ చేస్తారు. మాట వినని లారీ డ్రైవర్, క్లీనర్‌ను కత్తితోనో.. ప్లాస్టిక్ వైర్లతో హత్యచేసి రహస్య ప్రాంతాల్లో పాతిపెట్టి లారీతో ఉడాయిస్తారని నిఘావర్గాలు వెల్లడించాయి. తాజా గా తడ వద్ద పట్టుబడ్డ హైజాక్ ముఠా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో జరిగిన వివిధ లారీల చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు తెలిసింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని తదితర ప్రాంతాలలో జరిగిన ఇలాంటి నేరాలతో వీరికి ఉన్న సంబందాలు ఉన్నాయా? లేదా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
హైవే కిల్లర్స్..
Published Fri, Jun 12 2015 4:27 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement