రైల్వేకోడూరు రూరల్ : కాసేపట్లో ఇల్లు చేరుకుంటామనుకుంటుండగా మృత్యు రూపంలో దూసుకొచ్చిన లారీ ముగ్గురి ప్రాణాలు కబలించింది. తిరుపతి నుంచి కోడూరు వస్తున్న కారు (ఏపీ 04 ఏటీ 1511)ను తాడిపత్రి నుంచి చెన్నైకి ఉల్లిగడ్డలు తీసుకెళుతున్న లారీ (ఏపీ 02 టీబీ 0558) ఢీకొంది. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట రైల్వేస్టేషను సమీపంలో కడప - తిరుపతి జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో కోడూరు మండలం గంగురాజుపోడుకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు దాది యల్లయ్య(65) ఆయన కుమార్తె మావిళ్ల నాగమణి (45), నాగమణి చిన్న కుమారుడు సందీప్ కుమార్(26) అక్కడికక్కడే మృతి చెందారు. యల్లయ్య భార్య చెంగమ్మకు తలకు గాయమైంది. వారి బంధువులు మావిళ్ల సుబ్రమణ్యం (డ్రైవింగ్), ఆయన కుమార్తె మావిళ్ల బిందుకు స్వల్ప గాయాలైనట్లు బంధువులు తెలిపారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం 108 ద్వారా తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. దాది యల్లయ్య కోడూరులో నివాసం ఉండేవారు. ఆయన కుమార్తె నాగమణిని కోడూరు మండలం బొజ్జవారిపల్లెకు చెందిన మావిళ్ల సుబ్బరాయుడుతో వివాహం చేశారు.
ఆయన పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేస్తూ చనిపోయారు. ఆమె పెద్దకుమారుడు ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, చిన్న కుమారుడు టీవీ మెకానిక్‌గా పనిచేసేవాడు. వారి సమీప బంధువైన మావిళ్ల సుబ్రమణ్యం, ఆయన కుమార్తె బిందులతో కలిసి తిరుపతికి ఓ పనిమీద వెళ్లి వస్తుండగా వేగంగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొంది.
శోకసంద్రంలో రెండుగ్రామాలు
మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న దాది యల్లయ్య మృతితో అటు గంగురాజుపోడు, ఇటు కోడూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. యల్లయ్య కుమారుడు నాగ తిరుమలరావు ఓ టీచరు యూనియన్ నేత. నాగమణి, ఆమె కుమారుడు ఒకే సారి మృతి చెందడంతో వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో కుమారుడు ఒంటరి వాడయ్యాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్సీ బత్యాల చంగల్రాయులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు.
నెత్తురోడిన రహదారి
Published Sat, Jul 4 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM
Advertisement
Advertisement