లోక్ అదాలత్ మెగా హిట్ | Hit Mega Lok Adalat | Sakshi
Sakshi News home page

లోక్ అదాలత్ మెగా హిట్

Published Sun, Dec 7 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

Hit Mega Lok Adalat

కడప లీగల్: జిల్లాలో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్ మెగా హిట్ అయిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాఘవరావు పేర్కొన్నారు. కోర్టు హాలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెగా లోక్ అదాలత్ ద్వారా 2988 కేసులు పరిష్కార మయ్యాయన్నారు. ఈ కేసులు పరిష్కారం కావడం ద్వారా కక్షిదారులకు 7కోట్ల 07 లక్షల 62 వేల 601 రూపాయలు నష్టపరిహారంగా వచ్చిందన్నారు. కేసుల పరిష్కారానికి కక్షిదారులు లోక్ అదాలత్‌కు స్వచ్ఛందంగా రావడంతో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో జిల్లా అంతటా కేసులు పరిష్కారమయ్యాయన్నారు.
 
 లోక్ అదాలత్ విజయవంతమయ్యేందుకు సహకరించిన జిల్లా కలెక్టర్ కేవీ రమణ, జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ, తోటి న్యాయమూర్తులు సూర్యనారాయణగౌడ్, లోక్ అదాలత్ న్యాయమూర్తి మాలతి, సీనియర్ సివిల్ జడ్జి రఘురాం, జూనియర్ సివిల్ జడ్జిలు దీన, శైలజ, లావణ్య, భారతి, అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులకు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగరాజుకు, సభ్యులకు, లోక్ అదాలత్ సిబ్బందికి, న్యాయమూర్తులకు, సహాయకులుగాపని చేసిన న్యాయవాదులకు, వాలంటీర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
 
 లోక్ అదాలత్ అన్ని రకాలుగా ప్రయోజనమే...
 కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ కేవీ రమణ అభిప్రాయపడ్డారు.   శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కోర్టు ప్రాంగణంలోని  లోక్ అదాలత్ భవనంలో  నేషనల్ మెగా లోక్ అదాలత్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ రాజీ మార్గమే రాజ మార్గమన్నారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం వలన డబ్బు, శ్రమ, కాలం వృథా కాదని, కక్షిదారుల మధ్య భేదాభిప్రాయాలు తొలుగుతాయన్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ మాట్లాడుతూ రాజీ కాదగిన అన్ని రకాల  కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement