గొల్లప్రోలులో చోరీ
గొల్లప్రోలు : స్థానిక శివాలయం వీధిలో ఉన్న చక్రవర్తుల సత్యనారాయణ ఇంటిలో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న 82 గ్రాముల బంగారు అభరణాలు, రూ.లక్ష అపహరణకు గురైంది. సంఘటనపై పోలీసులు, యజమాని సత్యనారాయణ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక మెయిన్‌రోడ్డులోని సాయిబాబాగుడిలో సత్యనారాయణ అర్చకునిగా పనిచేస్తున్నారు. ఈనెల 19న కుటుంబసమేతంగా షిర్డీ తీర్థయాత్రకు వెళ్లి బుధవారం రాత్రి 10 గంటలకు తిరిగి ఇంటికి వచ్చారు. ఇంటి గది తలపులు తెరిచి, బీరువాలోని బట్టలు, సామాన్లు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని వారు గుర్తించా రు. బీరువాలో భద్రపరచిన రెండు బంగారు చైన్లు, రెండు నల్లపూసల గొలుసులు,
నాలుగు గాజులు, మేటీలు, చెంపసవరాలు, చెవిదిద్దులతోపాటు సుమారు రూ.లక్ష నగదు చోరీ జరిగిందని సత్యనారాయణ తెలిపారు. సుమారు 82 గ్రాముల బంగారు చోరీకి గురైనట్టు ఆయన అన్నారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు గురువారం ఉదయం ఎస్సై పి. బుజ్జిబాబు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. క్లూస్‌టీం సిబ్బంది వేలిముద్రలను, నమూనాలను సేకరించారు. స్థానికంగా తెలిసిన వ్యక్తులే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగారు ఆభరణాలు, నగదు చోరీ చేసి వెండి వస్తువుల జోలికి వెళ్లకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొల్లప్రోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.