రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను అభివృద్ధి చేయాలి
అసెంబ్లీలో ప్రస్తావించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు(అగ్రికల్చర్): చాలామంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్నారని, ముఖ్యంగా నాలుగో తరగతి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి తక్షణం ఇళ్ల స్థలాలను కేటాయించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా నెల్లూరు నగర శివారు ప్రాంతంలో జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో కొత్తూరులో ఇళ్ల స్థలాలు కేటాయించారని, ఈ ప్రాంతంలో రోడ్లు, విద్యుత్, మంచినీటి వసతులు కల్పించేందుకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంకా చాలా మంది విలేకరులు ఇళ్ల స్థలాలు లేక బాడుగ ఇళ్లలో నానా ఇబ్బందులు పడుతున్నారని, వారికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.