ఒంగోలు క్రైం : పోలీస్ విభాగంతో పాటు పలు విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డుల సేవలు మరువలేనివని ఏఆర్ ఏఎస్పీ జె.కృష్ణయ్య అన్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 52వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై తొలుత హోంగార్డుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. కృష్ణయ్య మాట్లాడతూ జిల్లాలో మొత్తం 838 మంది హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారని, వీరిలో 108 మంది డిప్యూటేషన్‌పై శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్, మైన్స్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి విభాగాల్లో పని చేస్తున్నారని చెప్పారు.
1946లో బ్రిటీష్ పాలన సమయంలో హోంగార్డుల వ్యవస్థ ఏర్పడిందన్నారు. 1962లో చైనా యుద్ధం సమయంలోనూ హోంగార్డుల పాత్ర కీలకమన్నారు. హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవాన్ని 1963లోప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న చిరువోలు శ్రీకాంత్ వారాంతపు సెలవు ప్రకటించి హోంగార్డులకు ఊరట కలిగించారన్నారు. రాష్ట్రస్థాయిలో జనత, జీవిత బీమా వంటి పాలసీలను అమలు చేయనున్నట్లు కృష్ణయ్య తెలిపారు.
అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు పురస్కారాలు అందజేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో జి.హనుమంతురావు, ఎస్‌కే సుభాని, పి.నాగరాజు, బి.గోపి, ఎం.వెంకటేశ్వర్లు, కె.సురేంద్రబాబు, సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్‌కే సలాం, పి.మద్దిలేటి, ఎస్.లక్ష్మీనారాయణలు ఉన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ జల్దారెడ్డి, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు చంద్రమోహన్, మురళీ, రిజర్వు సబ్ ఇన్‌స్పెక్టర్ మద్దార్ తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డ్డుల సేవలు మరువలేనివి
Published Sun, Dec 7 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement
Advertisement