విజయవాడ, న్యూస్‌లైన్ : నగర శివార్లలో రియల్ మాఫియా పడగ విప్పింది. ‘కాదేదీ కబ్జాకనర్హం’ అన్న చందాన అసైన్డ్ భూములు, ఇతర ప్రాంతాల్లో ఉండేవారి రిజిస్టర్డు ఖాళీ స్థలాలే లక్ష్యంగా విజంభిస్తుంది. తాము నిర్మించే అపార్టుమెంట్లకు అడ్డంకిగా ఉన్న పేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చేస్తున్నారు. ఈ మాఫియాకు పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలుంటున్నాయి.
భవానీపురం, విద్యాధరపురం, ఊర్మిళానగర్, జోజినగర్, గొల్లపూడి వంటి శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు నటిస్తున్న అసాంఘిక శక్తులు కనిపించిన ఖాళీస్థలాలను కాజేస్తున్నాయి. ఖాళీ స్థలాల యజమానులు ఎవరో తెలుసుకోవడం, వారిలో ఒంటరి మహిళలు, విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని గుర్తించడం మొదటి పనిగా చేస్తున్నారు. ఆ స్థలాలను ఆక్రమించి సర్వేరాళ్లు, సిమెంట్ స్తంభాలు, ఫెన్సింగ్ తొలగిస్తున్నారు. ముఖ్యంగా వెనకా ముందూ ఎవరూ లేని మహిళల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది.
రెండు నెలల్లో మూడు ఘటనలు
డిసెంబర్, జనవరి రెండు నెలల్లోనే గట్టు వెనుక మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసులుకూడా నమోదయ్యాయి. డిసెంబర్‌లో విద్యాధరపురం సితార జంక్షన్ సమీపంలో బైపాస్ రోడ్డు పక్కన ఒక స్థలం విషయంలో రెండు వర్గాలు కొట్లాటకు దిగాయి. ఒక వ్యక్తికి అమ్మిన ఇంటిని అతను రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడంతో సుమారు పదేళ్ల తరువాత మరొక వ్యక్తికి అమ్మి రిజస్ట్రేషన్ చేశాడు.
సుమారు 20 రోజుల క్రితం ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి వచ్చి ఆ ఇంటిని పడగొట్టేందుకు ప్రయత్నించటంతో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది.ఇటీవల జోజినగర్ చర్చి సమీపంలో ఉన్న ఒక ఖాళీ స్ధలం చుట్టూ వేసిన ఫెన్సింగ్, సిమెంట్ స్తంభాలను కొందరు వ్యక్తులు తొలగించి ఎత్తుకెళ్లిపోయారు. 5వ తేదీన ఊర్మిళానగర్ ఏకలవ్యనగర్ ఒకటవ లైన్‌లో నివసిస్తున్న గోవిందు, శివకుమారిల మూడు గదుల రేకులషెడ్‌ను కొందరు వ్యక్తులు ఉదయం 11గంటల సమయంలో జేసీబీతో కూల్చేశారు.
పడగ విప్పుతున్న రియల్ మాఫియా
Published Tue, Jan 14 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement