పేదల భూములపై పెద్దల పాగా!
అక్రమాలకు అడ్డగా పీర్లపల్లి రియల్ వెంచర్
►అసైన్డ్ భూములను ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్న ఇంక్రిడబుల్ ఇండియా ప్రాజెక్టు లిమిటెడ్
►లబోదిబోమంటున్నదళిత కుటుంబాలు దళితుల గోడును ప్రచురించిన ‘సాక్షి’కి లాయర్ నోటీసులు పంపిన యాజమాన్యం
► క్షేత్రస్థాయిలో పరిశీనలలో బయటపడ్డ అసలు నిజం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : పేదల భూములపై పెద్దల కన్నుపడింది.. వెంటనే దళారులను ఉసిగొల్పారు.. డబ్బును ఆశ చూపించారు. దళితుల అవసరం మీద దెబ్బకొట్టారు. ఏకంగా ఎస్సీ కార్పొరేషన్ పంచిన భూములనే తీసుకున్నారు. కొల్లగొట్టిన భూమిని ప్లాట్లుగా మార్చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫాం హౌస్‌ను ... గజ్వేల్ ఔటర్ రింగు రోడ్డును ఆశ చూపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని పీర్లపల్లి వద్ద జరుగుతున్న రియల్ దందాను తెలుసుకున్న దళితులు రోడ్డెక్కారు.అన్యాయమని నినదించారు.
అయితే ‘రియల్’ ధనబలం ముందు దళితులగోడు ఎవరికీ వినిపించలేదు. దీంతో ‘సాక్షి’ దళితుల పక్షాన నిలబడింది. వారి కన్నీటిని అక్షరబద్ధం చేసి కథనం ప్రచురించింది. ‘రియల్’ మాఫియా దందాను బయటపెట్టింది. ఇది జీర్ణించుకోలేని రియల్ మాఫియా ‘సాక్షి’కి లాయర్ నుంచి నోటీసులు పంపింది. ఆ నోటీసులకు బదులిచ్చే క్రమంలో క్షేత్రస్థాయిలో వాస్తవాలను శోధిస్తే రియల్టర్లు అసలు బాగోతం బయట పడింది.
జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లి గ్రామానికి చెందిన ఎండవల్లి యాదగిరి నర్సింహారెడ్డి అనే వ్యక్తి తన పట్టా భూమిని 1994 జూన్ 24న ఎస్సీ కార్పొరేషన్‌కు విక్రయించారు. సర్వే నంబర్లు 24, 28, 52, 54,40,401లలోని 33.28 ఎకరాల భూమికి అప్పుడున్న మార్కెట్ ధర కట్టించి ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. ఈ మొత్తం భూమిని ఎస్సీ కార్పొరేషన్ 40 మంది దళిత కుటుంబాలకు పంపిణీ చేసింది. ఈ 40 మంది లబ్ధిదారులకు అదే ఎడాది అప్పటి మంత్రి గీతారెడ్డి పట్టాలు అందించారు.
ఈ భూముల్లో దళితులు చాలా ఏళ్ల పాటు పంటలు పండించారు. తర్వాత కాలంలో నీటి వసతి సరిగా లేకపోవడంతో కొంత కాలం ఆ భూములు బీడుగా మారాయి. సరిగ్గా ఇదే సమయంలో బడాబాబులు దళితులపై వల విసిరారు. గ్రామానికి చెందిన వారిని దళారులుగా వాడుకొని చౌకగా భూములు కొనుగోలు చేశారు. 2008 నుంచి ఈ భూ కొనుగోలు తంతు మొదలైంది. హైదరాబాద్‌కు చెందిన వ్యక్తులు గడీల ప్రభాకర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డిలు దశల వారీగా భూమిని కొనుగోలు చేసినట్లుగా రెవెన్యూ రికార్డులను బట్టి తెలుస్తోంది.
అప్పట్లో ఎకరాకు రూ.1.20 లక్షలు ఇస్తామని చెప్పి ధర మాట్లాడుకోవడంతో పాటు ఈ డబ్బును రెండు వాయిదాల్లో చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు బాధితుల మాటలను బట్టి తెలుస్తోంది. అయితే మొదటి వాయిదా కింద రూ. 50 వేలు ఇచ్చిన రియల్ వ్యాపారులు మిగతా సొమ్మును మాత్రం ఎగ్గొట్టారని, ఇదేమని అడిగితే ఎస్సీ కార్పొరేషన్‌లో లోన్లు ఉన్నాయని కట్ చేసుకున్నామని చెప్పారని బాధితులు చెప్తున్నారు.
అవినీతికి ‘అడ్డా’..
2011లో హైదరాబాద్‌కే చెందిన రియల్టర్.. పీర్లపల్లి గ్రామ శివారులో ఎక్కువ మొత్తంలో భూమి కొనుగోలు చేశారు. ఆ పక్కనే ఉన్న దళితుల భూములు కూడా కలుపుకొని దాదాపు 200 ఎకరాల్లో ఇంక్రిడబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో సంస్థ నెలకొల్పి ‘అవెసొం అడా’్డ పేరుతో వెంచర్ చేశారు. దళిత భూములు కొన్నవారికి గజ్వేల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కాకుండా తూప్రాన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు.
ఈ వెంచర్‌కు పూర్తి స్థాయి అనుమతులు లేవు. వేర్వేరు పరిమాణాల్లో ప్లాట్లుగా చేసి 150 గజాల ప్లాట్‌ను రూ .3 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. అవసరమైనప్పుడు ఈ భూములను ప్రజా ప్రయోజనాల కోసం తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వీటిని మ్మినా.. కొన్నా నేరమే. దళితులను అమ్మకానికి ప్రేరేపించినా నేరమే అవుతుంది. అసైన్డ్ భూములపై రెవెన్యూ చట్టంలో బలమైన నిబంధనలు ఉన్నాయి.
కానీ ఇవేమీ పట్టించుకోకుండా అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చినా, అధికారులు స్పందించకపోవడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, పైగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ గజ్వేల్ డెవలప్‌మెంటు అథారిటీ (గడా) ఉన్నప్పటికీ దళితుల హక్కులను కాపాడలేక పోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.