- ఆరేళ్లుగా భార్యకోసం,ఐదునెలలుగా కూతురి కోసం వెదుకులాట..
- తిరుపతిలో కర్ణాటకవాసి ఆవేదన
సాక్షి, తిరుపతి: తాళికట్టిన భర్తను, పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కాదనుకుని ఆమె వెళ్లిపోయింది. ఐదు నెలల బిడ్డకోసం భార్య తప్పక తిరిగి వస్తుందని భావించాడు. ఆమె తిరిగి వచ్చేలా చూడమని వేంకటేశ్వరుని వేడుకున్నాడు. ఏడాదిలో కనీసం మూడుసార్లు తిరుమలకు బిడ్డతో పాటు వచ్చి వెంకన్నకు తనగోడు మొరపెట్టుకునేవాడు. భార్యను ఎలాగైనా రప్పించమని, తన బిడ్డకు తల్లి దగ్గరుండేలా చూడమని వేడుకునేవాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఆరేళ్లు గడిచాయి.
భార్య ఆచూకీ దొరకకపోగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆరేళ్ల కూతు రు తిరుపతిలో తప్పిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డకోసం ఐదునెలలుగా తిరుపతిలో వెదుకులాడుతూనే ఉన్నాడు. బస్టాండ్, రైల్వేస్టేషన్ ఇతర రద్దీ కూడళ్లలో ఉన్నవారికి తన కూతురి ఫొటో చూపించి ఆచూకీ తెలి సిందా అని అడుగుతున్నాడు. భార్యపోయిన బాధకు, కూతురు కనిపిం చని దుఃఖం తోడుకావడంతో తల్లడిల్లిపోతున్నాడు.
వివరాలిలా..
కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్‌లోని బాపూజీనగర్‌కు చెందిన పీ. వెంకటేష్ ఫ్లవర్ డెకరేటర్‌గా పనిచేసేవాడు. ఇతనికి ఏడేళ్ల కిందట సమీప బంధువుల అమ్మాయి ఆశతో వివాహం జరిగింది. వివాహమైన ఏడాదికి వారికి ఓ పాప పుట్టింది. ఆ పాపకు వరలక్ష్మి అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుకోవడం మొదలుపెట్టారు. పాపకు ఐదు నెలల వయసు ఉన్నప్పుడు ఆశ ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచీ వెంకటేష్ కూతురికి తల్లిలేని లోటు లేకుండా చూసుకుంటూనే, భార్యకోసం వెతుకులాడ్డం మొదలు పెట్టాడు. ఇతనికి వెంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. వెంకటేష్ తరచూ తిరుమలకు వచ్చి స్వామిరిని దర్శించుకునేవాడు. బిడ్డకు తల్లిని దగ్గర చేయమని స్వామిని వేడుకునే వాడు.
ఈ క్రమంలో గత ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో ఆరేళ్ల కూతురు వరలక్ష్మిని తీసుకుని తిరుమల వచ్చాడు. నాలుగు రోజులు తిరుమలలోనే ఉండి స్వామని దర్శించుకున్నాడు. అక్టోబర్ ఒకటో తేదీన చిక్‌బళ్లాపూర్ తిరుగు ప్రయాణమయ్యాడు. తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుని మైసూరు ప్యాసింజర్ రైలుకు టిక్కెట్ తీసుకున్నాడు. రైలు వచ్చేందుకు మూడు గంటల సమయం ఉండటంతో బిడ్డకు ఇడ్లీ తినిపించి, తానూ తిన్నాడు.
ఇద్దరూ స్టేషన్ ఆవరణలో నిద్రపోయారు. కాసేపటి తర్వాత ఊడ్చేందుకోసం స్వీపర్ వెంకటేష్‌ను నిద్ర లేపాడు. లేచి చూడగా పక్కన బిడ్డ లేదు. ఆందోళనకు గురైన వెంకటేష్ రైల్వేస్టేషన్‌తో పాటు చుట్టుపక్కలా గాలించాడు. బిడ్డ ఆచూకీ లభించలేదు. ఈ మేరకు తిరుపతి రైల్వే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి బిడ్డకోసం కోసం తిరుపతిలో వెదుకులాడుతూనే ఉన్నాడు. తన కూతురి ఫొటో చూపించి వచ్చీరాని తెలుగులో ‘మా వరలక్ష్మి ఎక్కడైనా కనిపించిందా?’ అని అడుగుతున్నాడు.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ బిడ్డ కనిపిస్తుందన్న ఆశతో వెంకటేష్ తిరుపతి నగరంలోనే ఉంటున్నాడు. చేతిలో డబ్బు లేక నానా అవస్థలు పడుతున్నాడు. తిరుచానూరు దేవాలయంలో అన్నదానంలో భో జనం చేయడం అదీ లేదంటే నగరంలోని దేవాలయాల్లో ప్రసాదాలతో కడుపు నింపుకుంటున్నాడు. మిగిలిన సమయాల్లో బిడ్డను వెతుక్కుం టూ తిరుగుతున్నాడు. రాత్రివేళ ప్లాట్‌ఫాంపై నిద్రిస్తున్నాడు. ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య ‘ఆశ’కోసం వచ్చి, బిడ్డ వరలక్ష్మిని పోగొట్టుకున్న వెంకటేష్ ఆవేదన అంతా ఇంతా కాదు. వెంకటేశ్వర స్వామి ఏ రోజుకైనా భార్యబిడ్డను తన దగ్గరకు చేరుస్తాడనే నమ్మకంతో ఉన్నాడు.