జి.సిగడాం: ‘ఈ ఆస్పత్రి వైద్యసిబ్బంది చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రతి ఏటా పాము కాటులతో ఆస్పత్రికి చాలామంది వస్తుంటారు. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ ఉండరు. దీంతో చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అభంశుభం తెలియని చిన్నారి మృతి చెందాడ’ని పాముకాటుతో ఆదివారం మృతి చెందిన బాలుడు కార్తీక్ కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు.
మండల కేంద్రంలోని 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వారంతా సోమవారం చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రజలకు సకాలంలో వైద్యసేవలు అందించవలసిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు.. ఉన్నవారు సైతం సమాధానం సక్రమంగా ఇవ్వడం లేదని వాపోయారు. పాముకాటుతో జి.సిగడాం మండల కేంద్రానికి చెందిన కార్తీక్(7) ఈ నెల 18న మృత్యువాత పడిన విషయం విదితమే. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని కార్తీక్ బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.
ఇది ఆరోగ్య కేంద్రమా శవాల కేంద్రమా.. ప్రాణం పోయడానికి ఉన్నారా, తీయడానికా? సకాలంలో ప్రజలకు వైద్యసేవలు అందించని సిబ్బంది ఎందుకంటూ నినాదాలు చేశారు. నాలుగు సంవత్సరాలుగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారులు మృతి చెందుతున్నారని ఆవేదన చెందారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరోగ్యకేంద్రం వద్ద ఆందోళన కొనసాగించారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ తిరుపతి నరసయ్య, ఎంపీడీఓ పీవీవీఎం మోహన్‌కూమార్, ఎస్సై నర్సింహమూర్తి, ఇన్‌చార్జి వైద్యాధికారి ఎం.కోటేశ్వరరావు, స్థానిక సర్పంచ్ వెలది సాయిరాం, ఎంపీటీసీ సభ్యురాలు కీర్తి తవుడమ్మ తదితరులు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిపై ఆరా తీశారు.
పేద కుటుంబాన్ని ఆదుకోండి..
పాము కాటుతో మృతి చెందిన కార్తీక్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే అదుకోవాలని గ్రామస్తులు, బంధువులు డిమాండ్ చేశారు. తల్లిదండ్రులకు ఈ చిన్నారి ఒక్కడే సంతానమని, ఇలా పాము కాటుతో మృత్యువాత పడ్డాడని వాపోయారు. దీనిపై తహసీల్దార్ తిరుపతి నరసయ్య ఎంపీపీ బాలబొమ్మ మహాలక్ష్మి, మాజీ సర్పంచ్ నాయిని సింహాచలం స్పందిస్తూ.. రాష్ట్రమంత్రి కళా వెంకటరావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రాణం పోస్తారా.. తీస్తారా?
Published Tue, Jun 20 2017 4:11 AM | Last Updated on Tue, Sep 5 2017 1:59 PM
Advertisement