వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి! | Born Baby Died For Hospital Negligence In Krishna | Sakshi
Sakshi News home page

వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి!

Published Mon, Jul 29 2019 1:26 PM | Last Updated on Mon, Jul 29 2019 1:26 PM

Born Baby Died For Hospital Negligence In Krishna - Sakshi

మృతి చెందిన పసికందుతో ఆస్పత్రి ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్న తండ్రి, కుటుంబ సభ్యులు

పేగు తడి ఆరకముందే తల్లి పొత్తిళ్లకు దూరమైంది ఓ పసికందు. కనురెప్పలు తెరవకముందే కానరాని లోకాలకు వెళ్లింది ఆ చిట్టితల్లి. బిడ్డ భవిష్యత్‌పై బంగారు కలలుకన్న ఆ తల్లి ఆశలు పొత్తిళ్లలోనే అడియాశలయ్యాయి. కన్న ప్రేమను పంచక ముందే.. కనులారా కన్నబిడ్డను చూడకముందే.. ఊసులు చెప్పకుండానే కళ్ల ముందే ఊపిరి వదిలేయడంతో ఆ తల్లి గుండె కన్నీటి చెరువై బరువెక్కింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం ఘటన చోటుచేసుకుంది. 
–ఉయ్యూరు(పెనమలూరు)

సాక్షి, కృష్ణా : ఉంగుటూరు మండల చాగంటిపాడు గ్రామానికి చెందిన నీరజకు గుంటూరు నగరంలోని పట్టాభిపురానికి చెందిన వాసా వాసుతో వివాహమైంది. నీరజకు తల్లిలేకపోవడంతో నెలలు నిండిన ఆమెను ఉయ్యూరులో బంధువులు తమ ఇంటి వద్ద ఉంచుకుని ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. నెలలు నిండి ప్రసవ సమయం సమీపించడంతో నీరజను ఈ నెల 23న ఆస్పత్రిలో చేర్పించారు. 24వ తేదీ సాయంత్రం ప్రసవవేదన ఎక్కువై నొప్పులు తీవ్రమయ్యాయి. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జనరల్‌ వార్డులోనే నీరజ ప్రసవ నొప్పులతో తల్లడిల్లిపోయింది. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో బెడ్డుపైనే కాన్పు జరిగే పరిస్థితులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన నర్సులు చేసేది లేక అక్కడే కాన్పు చేసి బిడ్డను తల్లి ఒడికి చేర్చారు.

పసికందు మృతితో ఆందోళన..
కన్నతల్లి పొత్తిళ్లలో పాలుతాగుతూ బిడ్డ మృతి చెందింది. పసికందు మృతితో బంధువులు వైద్యులపై ఆగ్రహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ దూరమైందని ఆస్పత్రి ఎదురుగా రహదారిపై మృతి చెందిన పసికందుతో బంధువులు బైఠాయించి న్యాయం చేయాలంటూ, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న డీసీహెచ్‌ఎస్‌ జ్యోతిర్మణి, సీఐ నాగప్రసాద్, ఎస్‌ఐ గురుప్రకాష్‌ బాధితులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నీరజ బంధువులు మాట్లాడుతూ, ఆస్పత్రిలో సరిగ్గా కాన్పు చేయకపోవడం వలనే బిడ్డ దూరమైందన్నారు. కాన్పు జరిగాక రెండు రోజుల వరకు తల్లిబిడ్డ ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీసీహెచ్‌ఎస్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే  నిర్లక్ష్యం వలన పసికందు మృతి చెందలేదని వైద్యులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement