Hospital negligence
-
Kamareddy: శిశువుల తారుమారు
సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాంరోడ్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇద్దరు శిశువులు తారుమారు అయ్యారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒకరికి ఇవ్వాల్సిన శిశువును మరోకరికి ఇచ్చారు. వారు ఆ శిశువులను తమ ఇంటికి తీసుకెళ్లారు. మరో శిశువు బంధువులు గుర్తించి తారు మారు అయ్యారని గుర్తించి ఆసుపత్రి నిర్లక్ష్యంపై ఆందోళనకు దిగారు. సుమారు నాలుగు గంటలకు పైగా ఆసుపత్రిలో ఆందోళన కోనసాగింది. చివరికి పోలీసులు వచ్చి ఇంటికి తీసుకెళ్లిన శిశువును రప్పించి విచారణ జరిపి ఇద్దరు శిశువులను వారి తల్లి వద్ద అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న చరణ్‌దాస్, నిఖిత దంపతులు. నిఖిత జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఈనెల 8 వ తేదిన సీజెరియన్ అయి మగ శిశువుకు జన్మనిచ్చింది. బాబు ఆరోగ్యం బాగాలేకపోవడంతో గోదాంరోడ్‌లోని జననీ పిల్లల దావాఖానలో ఐసీయూలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. గాంధారి మండలం కడక్‌వాడి గ్రామానికి చెందిన శ్రీకాంత్, నిఖిత దంపతులు. నిఖిత ఈనెల 11వ తేదిన కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సాధారణ కాన్పుతో మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు తక్కువ బరువుతో అనారోగ్యంగా ఉండటంతో అదే ప్రైవేట్ పిల్లల ఆసుపత్రిలో ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఇద్దరు శిశువులను మంగళవారం రోజున డిశ్చార్జీ చేయాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం కామారెడ్డి పట్టణానికి చెందిన శిశువును కడక్‌వాడి గ్రామానికి చెందిన బంధువులకు అప్పగించారు. ఈ క్రమంలో.. శిశువు అమ్మమ్మ గారి ఇల్లు రాజంపేట్ మండలం ఆర్గోండ గ్రామానికి తల్లి, శిశువును తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటలకు కామారెడ్డి పట్టణానికి చెందిన వారికి మరో శిశువును అప్పగించారు. శిశువుల ఫైళ్లు కూడా తారుమారు అయ్యాయి. దీంతో గమనించిన కామారెడ్డికి చెందిన బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. దీంతో గంట పాటు ఆందోళన చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆర్గోండకు తీసుకెళ్లిన శిశువును ఆసుపత్రికి రప్పించి విచారణ జరిపారు. రాత్రి ఏడున్నర గంటలకు ఇద్దరు శిశువులను వారి బంధువులకు అప్పగించారు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. రూరల్ సీఐ చంద్రశేకర్, పట్టణ పోలీసులు విచారణల జరిపి ఇరువర్గాల వారిని, ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి శాంతింప చేశారు. నిర్లక్ష్యగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బందిపై ఇరువర్గాల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దారుణం: కన్నతల్లిని చూడకుండానే కవలల మృతి
కరీంనగర్‌టౌన్: నిండు గర్భిణీ.. కాన్పు కోసం వస్తే ‘మీది ఈ జిల్లా కాదు.. ఎవరి జిల్లాలో వారే ప్రసూతి చేయించుకోవాలి..’ అని వెనక్కి పంపించారు కరీంనగర్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం వైద్యులు. దీంతో బాధితురాలు సొంత జిల్లాకు వెళ్లగా.. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. ఇలా రెండుమూడు చోట్లకు తిరగడంతో ప్రసవానికి ముందే ఓ బిడ్డ కన్నుమూయగా.. చికిత్స పొందుతూ మరో బిడ్డ చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరుబేగంపేటకు చెందిన బెజ్జంకి కమల రెండో కాన్పు కోసం ఈనెల 18న కరీంనగర్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అయితే అక్కడి వైద్యులు ఎవరి జిల్లాలో వారే వైద్యం చేయించుకోవాలని వెనక్కి పంపించారు. దీంతో బంధువులు ఆమెను సిద్దిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు.. ఇక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అయితే అక్కడి వైద్యులు సైతం ఆమెను చేర్చుకోకుండానే హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో అయోమయానికి గురైన కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లలేక తిరిగి కరీంనగర్‌కే చేరారు. ఇక్కడి వైద్యులను బతిమిలాడుకున్నారు. దీంతో వైద్యులు ఈనెల 20న ఆపరేషన్ చేసి కవలలకు పురుడు పోశారు. అయితే అప్పటికే ఆడ శిశువు చనిపోయింది. మగ శిశువు బరువు తక్కువగా ఉండటంతో ఐసీయూలో పెట్టారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ ఆ శిశువు కూడా శనివారం మృతిచెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, ముందే ఆపరేషన్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొంటూ బంధువులు మాతాశిశు ఆరోగ్యం కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. కరోనా కారణం చెబుతూ వైద్యులు గర్భిణుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారని, ఆపదలో ఉన్న వారికి వైద్యం చేయకుండా సొంత జిల్లాలకు వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. కరోనాతో తండ్రి, కొడుకు మృతి మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో కరోనాతో తండ్రీకొడుకులు గంటల వ్యవధిలో మృతిచెందారు. గ్రామానికి చెందిన మూల తిరుమల్ (52), అతడి కొడుకు మూల గిరి (30) గీత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరిద్దరూ నాలుగు రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. కాగా, తిరుమల్ పరిస్థితి విషమించి శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. అతడికి రాత్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. అదేరోజు రాత్రి 11 గంటలకు గిరి కూడా మృతిచెందాడు. శనివారం ఉదయం గిరి అంత్యక్రియలు పూర్తిచేశారు. చదవండి: Black Fungus: బ్లాక్‌ఫంగస్‌కు ‘ఆయుర్వేదం’ -
వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి!
పేగు తడి ఆరకముందే తల్లి పొత్తిళ్లకు దూరమైంది ఓ పసికందు. కనురెప్పలు తెరవకముందే కానరాని లోకాలకు వెళ్లింది ఆ చిట్టితల్లి. బిడ్డ భవిష్యత్‌పై బంగారు కలలుకన్న ఆ తల్లి ఆశలు పొత్తిళ్లలోనే అడియాశలయ్యాయి. కన్న ప్రేమను పంచక ముందే.. కనులారా కన్నబిడ్డను చూడకముందే.. ఊసులు చెప్పకుండానే కళ్ల ముందే ఊపిరి వదిలేయడంతో ఆ తల్లి గుండె కన్నీటి చెరువై బరువెక్కింది. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం ఘటన చోటుచేసుకుంది. –ఉయ్యూరు(పెనమలూరు) సాక్షి, కృష్ణా : ఉంగుటూరు మండల చాగంటిపాడు గ్రామానికి చెందిన నీరజకు గుంటూరు నగరంలోని పట్టాభిపురానికి చెందిన వాసా వాసుతో వివాహమైంది. నీరజకు తల్లిలేకపోవడంతో నెలలు నిండిన ఆమెను ఉయ్యూరులో బంధువులు తమ ఇంటి వద్ద ఉంచుకుని ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయిస్తున్నారు. నెలలు నిండి ప్రసవ సమయం సమీపించడంతో నీరజను ఈ నెల 23న ఆస్పత్రిలో చేర్పించారు. 24వ తేదీ సాయంత్రం ప్రసవవేదన ఎక్కువై నొప్పులు తీవ్రమయ్యాయి. ఆ సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో జనరల్ వార్డులోనే నీరజ ప్రసవ నొప్పులతో తల్లడిల్లిపోయింది. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో బెడ్డుపైనే కాన్పు జరిగే పరిస్థితులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన నర్సులు చేసేది లేక అక్కడే కాన్పు చేసి బిడ్డను తల్లి ఒడికి చేర్చారు. పసికందు మృతితో ఆందోళన.. కన్నతల్లి పొత్తిళ్లలో పాలుతాగుతూ బిడ్డ మృతి చెందింది. పసికందు మృతితో బంధువులు వైద్యులపై ఆగ్రహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ దూరమైందని ఆస్పత్రి ఎదురుగా రహదారిపై మృతి చెందిన పసికందుతో బంధువులు బైఠాయించి న్యాయం చేయాలంటూ, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న డీసీహెచ్ఎస్ జ్యోతిర్మణి, సీఐ నాగప్రసాద్, ఎస్ఐ గురుప్రకాష్ బాధితులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నీరజ బంధువులు మాట్లాడుతూ, ఆస్పత్రిలో సరిగ్గా కాన్పు చేయకపోవడం వలనే బిడ్డ దూరమైందన్నారు. కాన్పు జరిగాక రెండు రోజుల వరకు తల్లిబిడ్డ ఆరోగ్యాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని డీసీహెచ్ఎస్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే నిర్లక్ష్యం వలన పసికందు మృతి చెందలేదని వైద్యులు చెబుతున్నారు. -
వైద్యం అందక చిన్నారి మృతి
సాక్షి, మంచిర్యాల : వైద్యుడి నిర్లక్ష్యంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు నెలల చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ అంబేద్కర్‌కాలనీకి చెందిన ఎల్కపెల్లి మల్లేష్, తరుణి దంపతుల తొలి సంతానం సాయి మనస్విని (నాలుగు నెలలు). పుట్టినప్పటి నుంచి జిల్లాకేంద్రంలోని హర్షిత పిల్లల ఆసుపత్రిలో చూపిస్తున్నారు. మనస్వినికి శ్వాస రాకపోవడంతో మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు పాప ముక్కులో రెండుచుక్కలు మందు వేశారు. మరో ఇద్దరు సీనియర్ వైద్యులు కూడా పరిశీలించారు. అప్పటికే ఆలస్యం కావడంతో మనస్విని మృతి చెందింది. అయితే చిన్నారి మృతికి ఆసుపత్రి వైద్యుడు గోలి పూర్ణచందర్ నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు బంధువులతో కలిసి ఆస్పత్రి ఎందుట ఆందోళన దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. అప్పటికే రాత్రికావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఏసీపీ గౌస్‌బాబ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 20మంది సిబ్బంది బందోబస్తు చేపట్టారు. కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ పాప మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పేర్కొంటూ బంధువులు ఆందోళన కొనసాగించారు. సంఘటన స్థలానికి ఐఎంఏ, ఎమ్మార్పీఎస్ నాయకులు చేరుకొని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. బంధువులు రూ.10 లక్షలు డిమాండ్ చేయగా.. చివరకు రూ.2.50లక్షలు ఇచ్చేందుకు వైద్యుడు అంగీకరించారు. బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. తప్పు లేకున్నా.. ఆందోళన పాపను ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే జలుబు, జ్వరంతో బాధపడుతోంది. మంగళవారం రాత్రి శ్వాస ఆడడం లేదని మళ్లీ వచ్చారు. అప్పటికే బేబీ కండిషన్ సీరియస్‌గా ఉందని చెప్పిన. అయినా వైద్యం చేయాలన్నారు. ఏర్పాట్లు చేసేలోపే మృతి చెందింది. పిల్లలకు పాలు పట్టిన తరువాత భుజంపై ఎత్తుకోవాలి. లేకుంటే పాలు లంగ్స్‌లోకి వెళ్లి శ్వాస ఆగిపోయే ప్రమాదముంది. మనస్విని విషయంలో ఇదే జరిగింది. – గోలి పూర్ణ చందర్, హర్షిత్ పిల్లల ఆసుపత్రి వైద్యుడు, మంచిర్యాల -
బతికేవున్నా.. చచ్చాడంటూ..
మధ్యప్రదేశ్: డెబ్బై ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించి రాత్రంతా మార్చురీలో ఉంచిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాశీరాం(72) అనే వృద్ధుడు గురువారం రోజు రోడ్డుపై స్పృహ తప్పిపడిపోయాడు. స్థానికులు అతన్ని సాగర్ జిల్లాలోని బినా సివిల్ ఆస్పత్రికి తరలించగా డ్యూటీలో ఉన్న డాక్టర్ అతడు మృతి చెందినట్లు నిర్ధారించాడు. బాడీని రాత్రంతా మార్చురీలో (మృతదేహాలను ఉంచే గది) ఉంచారు. ఆ వృద్ధుడి మృత దేహాన్ని మర్చురీ ఉంచినట్లు పోలీసులకు తెలిపారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పోలీసులు శుక్రవారం ఉదయం అస్పత్రిలోని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని పరిశీలించగా.. అతడు బతికే ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో కంగుతిన్న డ్యూటీ డాక్టర్ బతికున్న ఆ వృద్ధుడికి చికిత్స అందించారు. అయినప్పటికినీ అతను కొంత సమయం పాటు చికిత్స పొంది..మృతి చెందాడు. విచారణలో భాగంగా ..ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ నెల 14న ఆస్పత్రికి వచ్చాడని తేలిసింది. ‘వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వృద్ధుడు మరణించాడని, ఈ విషయాన్ని జిల్లా పాలనా యంత్రాంగానికి చేరవేస్తూ.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి మాట్లాడుతూ.. ‘ఈ విషయంపై ఎంక్వైరీ నిర్వహించి, డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను వెంటనే గుర్తించి మోమో జారీ చేస్తామన్నారు. -
కుక్క మృతికి కారణమైన ఆస్పత్రిపై ఫిర్యాదు
బంజారాహిల్స్: ఆస్పత్రి నిర్లక్ష్యంతో తన పెంపు డు కుక్క చనిపోయిందని తప్పుడు ప్రకటనలతో తమను మోసం చేసిన ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ ఓ సినీ గేయరచయిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మణికొండ సెక్రటేరియెట్ కాలనీకి చెందిన గౌరీవందన సినిమాల్లో పాటలు రాస్తుంటారు. కొద్దిరోజులుగా ఆమె ఓ వీధికుక్కను పెంచుకుంటోంది. ఆ శునకానికి ముద్దుగా షైనీ అని పేరు పెట్టుకుంది. గత నెల 21న తన పెంపుడు కుక్క చొంగ కారుస్తుండటంతో వెబ్సైట్లో 24/7 వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటన చూసిన ఆమె కుక్కను చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌రోడ్ నెం. 12, ఎమ్మెల్యే కాలనీలోని డాక్టర్ డాగ్ క్లినిక్‌కు తీసుకెళ్లింది. అదే రోజు రాత్రి డాక్టర్ కుక్కను పరీక్షించి మూడు ఇంజక్షన్లు చేశాడు. మరుసటి రోజు కుక్క ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆమె మరోసారి ఆస్పత్రికి రాగా అక్కడ అందుబాటులో వైద్యులు లేరు. సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రి నిర్వాహకులను నిలదీసింది. అయినా వారినుంచి స్పందన కనిపించలేదు. ఆ మరుసటి రోజే కుక్క చనిపోయింది. మెరుగైన వైద్యం అందించి ఉంటే తన కుక్క బతికి ఉండేదని ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్లినిక్ నిర్వాహకులపై శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టేది లేదని ఎనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్, స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు, వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
సాక్షి, సిద్దిపేటటౌన్: సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పురిట్లోనే పాప మృతిచెందిన ఘటన బుధవారం సిద్దిపేటలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన లక్ష్మి, లింగయ్యల కుమార్తె రజిత అలియాస్ లక్ష్మిప్రియ (23)కి సికింద్రాబాద్ ఈస్ట్‌మారెడ్‌పల్లికి చెందిన మధుతో ఏడాది క్రితం వివాహం జరిగింది. డెలివరీ కోసం తల్లిగారింటికి వచ్చిన లక్ష్మిప్రియకు మంగళవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు రావడంతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యులు నొప్పులు ఎక్కువ రావడం లేదని అబ్జర్వేషన్లో ఉంచారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కొద్దికొద్దిగా పురిటి నొప్పులు రావడంతో మరోసారి పరీక్షించి సాయంత్రం వరకు చూడాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈలోగా పురిటినొప్పులు తగ్గడంతో అనుమానం వచ్చిన డాక్టర్లు పరీక్షించి శిశువు ఉమ్మ నీరు తాగిందని, కుటుంబ సభ్యులు సంతకాలు చేస్తేనే ఆపరేషన్ చేస్తామని డ్యూటీ డాక్టర్ స్పష్టం చేయడంతో కుటుంబ సభ్యులు సంతకాలు పెట్టారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆపరేషన్ చేసి పాప కడుపులోనే మృతి చెందిందని డాక్టర్ చెప్పినట్లు బంధువులు ఆరోపించారు. పాప మృతికి డాక్టర్ నిర్లక్ష్యమే కారణమని, పాప మృతికి కారణమైన డాక్టర్‌ను సస్పెండ్ చేయాలని పాప తండ్రి మధు డిమాండ్ చేశారు. పాప మృతిచెందిన విషయం డాక్టర్లు చెప్పగానే సిద్దిపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసామని, అయినా పోలీసులు డాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మధు ఆరోపించారు. ఈ విషయంపై వన్ టౌన్ ఎస్సై శ్రీనివాస్‌ను వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కోమా పేషెంట్ కన్ను కొరికిన ఎలుకలు..
ముంబై : బాల్ థాక్రే ట్రామా కేర్ ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న పేషెంట్‌ని ఎలుకలు కొరికి గాయపరిచిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 23న చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితుడి తండ్రి గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో ఆయన కుమారుడు పరమిందర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అందుకు సంబంధించిన శస్త్ర చికిత్స చేసినా కుమారుడి పరిస్థితిలో మార్పు రాలేదని చెప్పారు. 40 రోజులు గడిచిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఏప్రిల్ 21న వైద్యులు కోమాలో ఉన్న తన కుమారుడిని జనరల్ వార్డుకు తరలించారని పేర్కొన్నారు. జనరల్ వార్డులో ఎలుకలు సంచరించడం తాను చూశానని తెలిపారు. తన కుమారుడి కంటి నుంచి ఒక్కసారిగా రక్తం రావడంతో దగ్గరికి వెళ్లి చూస్తే ఎలుకలు కొరికిన గుర్తులు కనిపించాయని ఆయన ఆరోపించారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇది చోటు చేసుకుందని పేషెంట్ బంధువులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై అస్పత్రి వర్గాలు స్పందిస్తూ.. పేషెంట్ బంధువుల ఆరోపణలను తోసిపుచ్చారు. ఆస్పత్రిలో ఎలాంటి ఎలుకలు సంచరించడం లేదని.. తమ ఆస్పత్రి పేరును పాడుచేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పేషెంట్‌ని కంటికి ఎటువంటి గాయం కాలేదని తెలిపారు. -
ప్రాణం పోస్తారా.. తీస్తారా?
జి.సిగడాం: ‘ఈ ఆస్పత్రి వైద్యసిబ్బంది చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రతి ఏటా పాము కాటులతో ఆస్పత్రికి చాలామంది వస్తుంటారు. ఆ సమయంలో సిబ్బంది ఎవరూ ఉండరు. దీంతో చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అభంశుభం తెలియని చిన్నారి మృతి చెందాడ’ని పాముకాటుతో ఆదివారం మృతి చెందిన బాలుడు కార్తీక్ కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు. మండల కేంద్రంలోని 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్దకు వారంతా సోమవారం చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రజలకు సకాలంలో వైద్యసేవలు అందించవలసిన సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు.. ఉన్నవారు సైతం సమాధానం సక్రమంగా ఇవ్వడం లేదని వాపోయారు. పాముకాటుతో జి.సిగడాం మండల కేంద్రానికి చెందిన కార్తీక్(7) ఈ నెల 18న మృత్యువాత పడిన విషయం విదితమే. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని కార్తీక్ బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆరోగ్య కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. ఇది ఆరోగ్య కేంద్రమా శవాల కేంద్రమా.. ప్రాణం పోయడానికి ఉన్నారా, తీయడానికా? సకాలంలో ప్రజలకు వైద్యసేవలు అందించని సిబ్బంది ఎందుకంటూ నినాదాలు చేశారు. నాలుగు సంవత్సరాలుగా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారులు మృతి చెందుతున్నారని ఆవేదన చెందారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరోగ్యకేంద్రం వద్ద ఆందోళన కొనసాగించారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ తిరుపతి నరసయ్య, ఎంపీడీఓ పీవీవీఎం మోహన్‌కూమార్, ఎస్సై నర్సింహమూర్తి, ఇన్చార్జి వైద్యాధికారి ఎం.కోటేశ్వరరావు, స్థానిక సర్పంచ్ వెలది సాయిరాం, ఎంపీటీసీ సభ్యురాలు కీర్తి తవుడమ్మ తదితరులు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిపై ఆరా తీశారు. పేద కుటుంబాన్ని ఆదుకోండి.. పాము కాటుతో మృతి చెందిన కార్తీక్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే అదుకోవాలని గ్రామస్తులు, బంధువులు డిమాండ్ చేశారు. తల్లిదండ్రులకు ఈ చిన్నారి ఒక్కడే సంతానమని, ఇలా పాము కాటుతో మృత్యువాత పడ్డాడని వాపోయారు. దీనిపై తహసీల్దార్ తిరుపతి నరసయ్య ఎంపీపీ బాలబొమ్మ మహాలక్ష్మి, మాజీ సర్పంచ్ నాయిని సింహాచలం స్పందిస్తూ.. రాష్ట్రమంత్రి కళా వెంకటరావు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
బాలింత మృతిపై బంధువుల ఆందోళన
ప్రైవేటు ఆస్పత్రిపై దాడి..రాస్తారోకో కరీంనగర్: కరీంనగర్ జిల్లా మెట్‌పల్లిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు రోజుల బాలింత గురువారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత మృతిచెందిందని ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆస్పత్రిపై దాడి చేయడంతో పాటు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వివరాలు..మెట్‌పల్లికి చెందిన ఆకుల లాస్య ప్రసవం నిమిత్తం ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. నాలుగు రోజుల కింద కాన్పు కావడంతో ఆమె ఆస్పత్రిలోనే ఉంటోంది. అయితే ఆమె గురువారం మధ్యాహ్నం హఠాత్తుగా మృతిచెందింది. దాంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు లాస్య మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని భావించి ఆస్పత్రిపై దాడిచేశారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారాకో చేశారు. పోలీసులు వచ్చి ఆందోళకారులను శాంతింపజేశారు. -
ఆస్పత్రిలో తల్లీ , బిడ్డ మృతి
తూర్పుగోదావరి : వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి, అప్పుడే పుట్టిన మగ శిశువు మృతిచెందారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. రంగంపేట గ్రామానికి చెందిన గర్భిణి.. కోశెట్టి నాగమణి సోమవారం ఆస్పత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. ఆమె పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను 108లో పెద్దాపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారిని పరీక్షించిన వైద్యులు తల్లీ, బిడ్డ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు మంగళవారం ఉదయం ఆస్పత్రి ముందు ధర్నాకు దిగారు. పుట్టిన బిడ్డకు సరైన వైద్యం అందకపోవడంతోనే చనిపోయాడని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే తల్లీ, బిడ్డ మృతి చెందారని వారు ఆరోపించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
కాళ్ల నొప్పులని వెళ్తే కాటికి పంపారు
ఏలూరు (వన్ టౌన్) : కాళ్లు నొప్పులుగా ఉన్నాయని వైద్యం కోసం వస్తే ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని ఆరోపిస్తూ మృతుడి బంధువుల ఆందోళనలతో ఏలూరు జిల్లా ఆసుపత్రి ప్రాంగణం శనివారం దద్దరిల్లింది. మృతుడి బంధువులు డాక్టర్ వల్లూరి హేమసుందర్ పై చేయి చేసుకోవడంతో పాటు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రాణీనగర్‌కు చెందిన గురువెల్లి దుర్గారావు(23) తాపీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి దేవిశ్రీతో మూడు నెలలు క్రితం వివాహమైంది. వినాయక చవితి నిమజ్జనోత్సవాల్లో పాల్గొనడంతో నడుంపట్టిందని, కాళ్లు గుంజుతున్నాయని చెప్పడంతో బంధువులు శనివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో ఆసుపత్రిలో చేర్చిన గంట అనంతరం దుర్గారావు మృతిచెందినట్టు అతడి బంధువులు తెలిపారు వైద్యుడిపై దాడి వైద్యుడు వల్లూరి హేమసుందర్ నిర్లక్ష్యం వల్లే దుర్గారావు మృతిచెందాడని అతడి బంధువులు ఒక్కసారిగా డాక్టర్‌పై దాడికి దిగి చితకబాదారు. అనంతరం ఆసుపత్రిలోని అత్యవసర సేవల విభాగం అద్దాలు ధ్వంసం చేసి భీభత్సం సృష్టించారు. ఓ రోడ్డు ప్రమాదం విషయమై అక్కడికి వచ్చిన పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితి చేయిదాటకుండా జాగ్రత్త పడ్డారు. వారి సమాచారంతో డీఎస్పీ కె.సత్తిబాబు, సీఐలు, ఎస్సై అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. దుర్గారావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలిస్తుండగా మళ్లీ ఒక్కసారిగా బంధువులు చుట్టుముట్టి తరలించడానికి వీల్లేదంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఆందోళనకారులను గేటు బయటకు చెదరగొట్టి ఆసుపత్రి ప్రాంగణం అన్ని వైపులా పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనకారుల డిమాండ్ మేరకు వైద్యుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామని కేసు నమోదు చేస్తామని చెప్పినా వినలేదు. చివరకు పోలీసుల రక్షణ మధ్య మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితుల ఫిర్యాదు మేరకు డాక్టర్ హేమసుందర్, నర్సు పద్మజలపై కేసు నమోదు చేసినట్టు టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ తెలిపారు. దుర్గారావు మృతదేహానికి ఇద్దరు వైద్యులు ఎ.హరికృష్ణ, పి.హిమబిందుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కన్నీరుమున్నీరైన దుర్గారావు కుటుంబ సభ్యులు వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే తన భర్త తనకు దక్కేవాడని దుర్గారావు భార్య గుండెలవిసెలా విలపించింది. తమ కుటుంబానికి ఆధారమైన దుర్గారావును పొట్టనబెట్టుకున్న వైద్యుడిపై చర్య తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.