కాళ్ల నొప్పులని వెళ్తే కాటికి పంపారు
ఏలూరు (వన్ టౌన్) : కాళ్లు నొప్పులుగా ఉన్నాయని వైద్యం కోసం వస్తే ఆసుపత్రి వైద్యుడి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని ఆరోపిస్తూ మృతుడి బంధువుల ఆందోళనలతో ఏలూరు జిల్లా ఆసుపత్రి ప్రాంగణం శనివారం దద్దరిల్లింది. మృతుడి బంధువులు డాక్టర్ వల్లూరి హేమసుందర్ పై చేయి చేసుకోవడంతో పాటు ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రాణీనగర్‌కు చెందిన గురువెల్లి దుర్గారావు(23) తాపీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి దేవిశ్రీతో మూడు నెలలు క్రితం వివాహమైంది. వినాయక చవితి నిమజ్జనోత్సవాల్లో పాల్గొనడంతో నడుంపట్టిందని, కాళ్లు గుంజుతున్నాయని చెప్పడంతో బంధువులు శనివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. అయితే వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో ఆసుపత్రిలో చేర్చిన గంట అనంతరం దుర్గారావు మృతిచెందినట్టు అతడి బంధువులు తెలిపారు
వైద్యుడిపై దాడి
వైద్యుడు వల్లూరి హేమసుందర్ నిర్లక్ష్యం వల్లే దుర్గారావు మృతిచెందాడని అతడి బంధువులు ఒక్కసారిగా డాక్టర్‌పై దాడికి దిగి చితకబాదారు. అనంతరం ఆసుపత్రిలోని అత్యవసర సేవల విభాగం అద్దాలు ధ్వంసం చేసి భీభత్సం సృష్టించారు. ఓ రోడ్డు ప్రమాదం విషయమై అక్కడికి వచ్చిన పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితి చేయిదాటకుండా జాగ్రత్త పడ్డారు. వారి సమాచారంతో డీఎస్పీ కె.సత్తిబాబు, సీఐలు, ఎస్సై అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. దుర్గారావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలిస్తుండగా మళ్లీ ఒక్కసారిగా బంధువులు చుట్టుముట్టి తరలించడానికి వీల్లేదంటూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
దీంతో ఆందోళనకారులను గేటు బయటకు చెదరగొట్టి ఆసుపత్రి ప్రాంగణం అన్ని వైపులా పోలీసు బలగాలను మోహరించారు. ఆందోళనకారుల డిమాండ్ మేరకు వైద్యుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామని కేసు నమోదు చేస్తామని చెప్పినా వినలేదు. చివరకు పోలీసుల రక్షణ మధ్య మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఆసుపత్రి ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాధితుల ఫిర్యాదు మేరకు డాక్టర్ హేమసుందర్, నర్సు పద్మజలపై కేసు నమోదు చేసినట్టు టూటౌన్ సీఐ వై.సత్యకిషోర్ తెలిపారు. దుర్గారావు మృతదేహానికి ఇద్దరు వైద్యులు ఎ.హరికృష్ణ, పి.హిమబిందుల బృందం పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
కన్నీరుమున్నీరైన దుర్గారావు కుటుంబ సభ్యులు
వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే తన భర్త తనకు దక్కేవాడని దుర్గారావు భార్య గుండెలవిసెలా విలపించింది. తమ కుటుంబానికి ఆధారమైన దుర్గారావును పొట్టనబెట్టుకున్న వైద్యుడిపై చర్య తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.