
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : బాల్ థాక్రే ట్రామా కేర్ ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్న పేషెంట్‌ని ఎలుకలు కొరికి గాయపరిచిన ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 23న చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితుడి తండ్రి గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. మార్చిలో ఆయన కుమారుడు పరమిందర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో అందుకు సంబంధించిన శస్త్ర చికిత్స చేసినా కుమారుడి పరిస్థితిలో మార్పు రాలేదని చెప్పారు.
40 రోజులు గడిచిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఏప్రిల్ 21న వైద్యులు కోమాలో ఉన్న తన కుమారుడిని జనరల్ వార్డుకు తరలించారని పేర్కొన్నారు. జనరల్ వార్డులో ఎలుకలు సంచరించడం తాను చూశానని తెలిపారు. తన కుమారుడి కంటి నుంచి ఒక్కసారిగా రక్తం రావడంతో దగ్గరికి వెళ్లి చూస్తే ఎలుకలు కొరికిన గుర్తులు కనిపించాయని ఆయన ఆరోపించారు.
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇది చోటు చేసుకుందని పేషెంట్ బంధువులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై అస్పత్రి వర్గాలు స్పందిస్తూ.. పేషెంట్ బంధువుల ఆరోపణలను తోసిపుచ్చారు. ఆస్పత్రిలో ఎలాంటి ఎలుకలు సంచరించడం లేదని.. తమ ఆస్పత్రి పేరును పాడుచేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పేషెంట్‌ని కంటికి ఎటువంటి గాయం కాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment