వసతికి మంగళం
► వచ్చే విద్యా సంవత్సరంలో 18 హాస్టళ్ల మూత
► వాటిల్లోని విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం
► జిల్లా నుంచి నివేదికలు కోరిన ప్రభుత్వం
► ఆఘమేఘాల మీద సిద్ధం చేస్తున్న అధికారులు
మూతపడనున్న హాస్టళ్లు ఇవే
బీసీ నంబర్-1 అనంతపురం, మరూరు, పామిడి, వజ్రకరూరు, గుంతకల్లు, యాడికి, చిగిచెర్ల, ఎనుములవారిపల్లి, తగరకుంట, బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం, కల్లుమర్రి, బాలుర వసతి గృహం కదిరి, పట్నం, కొండకమర్ల, లేపాక్షి, పరిగి, డి. హీరేహాల్, రాయదుర్గం.
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో 50 మందిలోపు విద్యార్థులున్న సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఇప్పటికే మూసివేశారు. ఈ క్రమంలో జిల్లాలో గతేడాది 26 ఎస్సీ హాస్టళ్లు మూతపడ్డాయి. ఈ ఏడాది మరో 25 హాస్టళ్లు ఈజాబితాలో చేరనున్నాయి. ప్రభుత్వం ఇంతటితో ఆగకుండా బీసీ హాస్టళ్లపైనా దృష్టి సారించింది.50 మందిలోపు విద్యార్థులున్న బీసీ హాస్టళ్లనూ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 18 బీసీ వసతి గృహాలను గుర్తించారు. ఏళ్ల కింద స్థాపించిన ఈ హాస్టళ్లలో వేలాదిమంది విద్యార్థులు చదువుకున్నారు. అలాంటి హాస్టళ్లు ఇక శాశ్వతంగా కనుమరుగవుతున్నాయి. విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారనే సాకు చూపి వాటికి మంగళం పాడేందుకు కంకణం కట్టుకుంది. 50 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్లను రద్దుచేసి, అందులో చదువుతున్న విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం చేసేలా అడుగులేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లా
అనంతపురం హౌసింగ్‌బోర్డులోని బీసీ నంబర్-1 వసతి గృహంలో
3 నుంచి 10వ తరగతి విద్యార్థులు 34 మంది ఉన్నారు. వచ్చేవిద్యా సంవత్సరం నుంచి ఈ హాస్టల్‌ను మూసివేస్తున్నారు. వీరిని సుమారు50 కిలోమీటర్ల దూరంలో ఉన్నఉరవకొండలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించారు. ఇలా ఈ ఒక్క హాస్టలే కాదు జిల్లాలో 18బీసీ హాస్టళ్లు కనుమరుగుకానున్నాయి. వీటిన్నింటినీ మూసి వేసేందుకు రంగం సిద్ధమవుతోంది.అధికారులకు నివేదికలు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం
మూతపడనున్న హాస్టళ్లలోని విద్యార్థులను బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం ఎంతమాత్రం విజయవంతమవుతుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతమున్న హాస్టళ్లకు 50 నుంచి వంద కిలోమీటర్ల దూరం ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆసక్తి చూపుతారనే ప్రశ్న ఉదయిస్తోంది. డ్రాపౌట్స్ మారే ప్రమాదమూ లేకపోలేదు. హాస్టళ్లలో సహజంగానే చుట్టుపక్కల గ్రామాల పిల్లలే ఎక్కువగా చేరుతుంటారు. మరి అలాంటిది ఒక్కసారిగా అంతదూరం వెళ్తారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు కదిరి రూరల్ మండలంలోని పట్నం బీసీ హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థులను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షి రెసిడెన్షియల్ స్కూల్‌లో విలీనం చేసేందుకు జిల్లా అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇలా 18 హాస్టళ్లలోని విద్యార్థులను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విలీనం చేయనున్నారు.
నివేదికలు అడిగారు
50 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్ల వివరాలను అడిగారు. ఆయా హాస్టళ్లలోని విద్యార్థులను విలీనం చేసేందుకు అనుకూలమైన బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల వివరాలను అడిగారు. ఈ క్రమంలో నివేదిక సిద్ధం చేశాం. ప్రభుత్వానికి నివేదించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-రమాభార్గవి, బీసీ సంక్షేమశాఖ డీడీ