సాక్షి, అనంతపురం: జిల్లాలో ఎండలు తారస్థాయికి చేరాయి. భగ్గుమంటున్న సూర్యుని ప్రతాపంతో ప్రజానీకం తల్లడిల్లుతోంది. జిల్లాలో సరాసరి 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. జిల్లాలో అడపాదడపా అక్కడడక్కడా వర్షాలు కురుస్తున్నా.. అదే స్థాయిలో వారం రోజులుగా ఎండలు తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. బుక్కరాయసముద్రం వాతావరణ కేంద్రం తెలిపిన సమాచారం మేరకు మూడురోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే మే 28న 41.2 డిగ్రీలు, 29న 41.1, 30న 40.3, 31న 41.5 డిగ్రీలు నమోదయ్యాయి.
బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షపు జల్లులు కురుస్తున్నా అవి తాత్కాలిక ఉపశమనాన్నే కల్గిస్తున్నాయి. భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. పరిసరాలు, ఇళ్లగోడలు, పైకప్పూ వేడెక్కి రాత్రిళ్లూ అదే ఉష్ణాన్ని వెలువరిస్తుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలు దాటితే ప్రజలు రోడ్లమీదకు రావటానికి భయపడిపోతున్నారు. చిన్నారులు,వ ృద్ధులు సాయంత్రం 7 గంటల తరువాత పార్కులకు చేరి సేద తీరుతున్నారు.
విద్యుత్ కోతలు
పవర్‌గ్రిడ్‌లలో ఉత్పత్తి తగ్గిన కారణంగా జిల్లాలో విద్యుత్ అధికారులు ఎడాపెడా కోతలు విధిస్తున్నారు. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నా అధికారులు ఏమాత్రం కనికరం చూపడం లేదు. ఫ్యాన్లు తిరుగుతుంటేనే గాలి ఆడక ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. చెప్పాపెట్టకుండా విధించే విద్యుత్ కోతలతో ప్రజలు ఉడికిపోతున్నారు. మొన్నటి వరకు పగటి పూటకే పరిమితమైన కోతలు ఇప్పుడు రాత్రిళ్లూ కొనసాగుతున్నాయి.
అధికారిక కరెంటు కోతల మేరకు కార్పొరేషన్‌లో ఉదయం 8 నుంచి 10 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కోతలు విధిస్తున్నారు. మునిసిపాలిటీ పరిధిలో రోజుకు ఆరుగంటలు కోతలు ఉన్నాయి. ఉదయం 9 నుంచి 11గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి ఆరు గంటల వరకు, మండల కేంద్రాల్లో ఎనిమిది గంటలు అధికారిక కోతలు ఉన్నాయి. అనధికారిక కోతలకు లెక్కలేదు. గ్రామాల్లో కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. ఇక వ్యవసాయానికి ఏడు గంటలు నిరంత కరెంటు ఇవ్వాల్సి ఉన్నా రోజుకు మూడు గంటల పాటు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి.
ఈ విషయమై ట్రాన్స్‌కో ఎస్‌ఈని సంప్రదించగా.. విద్యుత్ ఉత్పాదనలో ఏర్పడిన కొరత వల్ల జిల్లాలో కోతలు తప్పడం లేదన్నారు. జిల్లాకు రోజుకు 14 మిలియన్ యూనిట్లు కరెంటు అవసరం ఉండగా.. 11 మిలియన్ యూనిట్లు మాత్రమే కేటాయింపులు ఇస్తున్నారన్నారు. మూడు మిలియన్ యూనిట్లు షార్టేజ్ ఉండడంతోనే కోతలు తప్పడం లేదని స్పష్టం చేశారు.
కోత.. వాత
Published Sun, Jun 1 2014 2:04 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement