హాట్ టాపిక్..! నీ పెత్తనమేంటి?
కడప రాజ్యసభ సభ్యుడిపై జిల్లా ముఖ్యనేత సోదరుడు ఫైర్
ఇసుక, మైనింగ్ వాటాల నుంచి కోరిన రాయలసీమ ఇంచార్జి
నయాపైసా ఇచ్చేది లేదని ముఖ్యనేత సోదరుడు స్పష్టీకరణ
ముఖ్యనేతపై కన్నెర్ర చేసిన అధికార పార్టీ అధిష్టానం!
కర్నూలు : అధికార పార్టీ జిల్లా ముఖ్యనేత పరిధి కేవలం నియోజకవర్గానికే పరిమితం కానుందా? అంతకు మించి పనులు చేసేందుకు అటు పార్టీ అధిష్టానం, ఇటు అధికార యంత్రాంగం సిద్ధంగా లేదా? ఇందుకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. అయితే, ఇందుకు కారణం ఏమిటనే విషయం ఆరా తీస్తే.. పార్టీ రాయలసీమ ఇంచార్జితో ముఖ్యనేత సోదరుడు పెట్టుకున్న వైరమే కారణమని తెలుస్తోంది. జిల్లాలో జరుగుతున్న వివిధ అక్రమ వ్యాపారాల్లో ‘పార్టీ ఫండ్’ పేరిట వాటా ఇవ్వాలని ముఖ్యనేత సోదరుడిని సదరు ఇంచార్జి కోరినట్టు సమాచారం. అయితే, జిల్లాలో నీ పెత్తనమేమిటని.. నయాపైసా ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగిందని ఈ వర్గాలు వివరించాయి. ఈ గొడవ కాస్తా చినికి చినికి గాలివానగా మారి.. ముఖ్యనేత అధికార పరిధికే ఎసరు తెచ్చిందనే ప్రచారం సాగుతోంది.
నీకు రూ. 100... నాకు రూ. 150
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు.. జిల్లాలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతోంది. అసైన్డు భూములు, దేవాదాయ భూములతో పాటు వక్ఫ్ భూములనూ వదల్లేదు. ప్రధానంగా డోన్, బేతంచర్ల నియోజకవర్గాల్లోనైతే.. ఎక్కడ చూసినా భూములను జేసీబీలతో భారీగా తవ్విపెట్టారు. ఈ అక్రమ మైనింగ్ మొ త్తం ఆయా నియోజకవర్గాల పరిధిలోని తెలుగు తమ్ముళ్లు చూసుకుంటుండగా.. పర్యవేక్షణ మా్ర తం ముఖ్యనేత సోదరుడిదే. ఈ విధంగా అక్రమ మైనింగ్ చేసుకుంటున్న ప్రతీ సంస్థ ఈ సోదరుడికి టన్ను ఇనుప ఖనిజానికి రూ. 250 ముట్టచెప్పాల్సిందే. అయితే, రాయలసీమ ప్రాంతం ‘మొత్తం వ్యవహారాలను’ పర్యవేక్షించేందుకు పార్టీ కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడిని నియమించిందన్న ప్రచారం ఉంది. ఈ నేత కన్ను కాస్తా జిల్లా అక్రమ మైనింగ్‌పై పడింది. ఇందుకు అనుగుణంగా టన్నుకు వసూ లు చేస్తున్న రూ. 250లో ‘పార్టీ ఫండ్’గా రూ. 150 ఇవ్వాలని జిల్లా ముఖ్యనేత సోదరుడిని సదరు నేత కోరినట్టు సమాచారం. అంతేకాకుండా ఇసుక మాఫియాలోనూ వాటా కోరారనే ప్రచారం ఉంది. అయితే, దీనిని జిల్లా ముఖ్యనేత సోదరుడు ఏమాత్రమూ లెక్కపెట్టలేద ని తెలుస్తోంది. దీంతో లాభం లేదనుకున్న సదరు ఇంచార్జి నేరుగా ముఖ్యనేత సోదరుడితోనే భేటీ అయ్యారని సమాచారం. ఈ సమావేశంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జిల్లాలో నీ పెత్తనమేమిటని? నయాపైసా కూడా ఇచ్చేది లేదని ఇంచార్జికి ముఖ్యనేత సోదరుడు తేల్చిచెప్పినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి.. తీవ్రస్థాయిలో వాగ్వా దం జరిగిందనే ప్రచారమూ ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీలోని వ్యతిరేక వర్గం కూడా సదరు ఇంచార్జితో చేతులు కలిపినట్టు సమాచారం.
వాళ్ల సంగతి చూడాల్సిందే..: మొత్తంగా ముఖ్యనేత పట్టును జిల్లాలో సడలించేందుకు ఆయన వ్యతిరేకులందరూ ఏకమయ్యారు. ఇందుకు అనుగుణంగా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. పార్టీ అధిష్టానం కూడా ముఖ్యనేతతో పాటు ఆయన సోదరుల వ్యవహారాలపై కన్నెర్ర చేసినట్టు సమాచారం. దీనితో పాటు అక్రమ ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో ముఖ్యనేత సోదరుల ప్రమేయానికి అడ్డు అదుపు లేకుండా పోతోందని, ఉద్యోగుల బదిలీల్లోనూ చేతి వాటం ప్రదర్శిస్తున్నారంటూ.. జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) నుంచి అందిన నివేదికల నేపథ్యంలో కట్టడి చేసేం దుకే అధిష్టానం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా కేవలం నియోజకవర్గానికే పెద్దన్నను పరిమితం చేసేలా యాక్షన్ ప్లాన్‌ను అధిష్టానమే దగ్గరుండి నడిపించాలని నిర్ణయిం చింది. ఇందులో భాగంగానే అధికారులెవ్వరూ ముఖ్యనేత సోదరుడు చెప్పిన పనులు చేయకూడదని పార్టీ అధిష్టానమే ఆదేశించిందని సమాచారం. తాజాగా సీఐల పోస్టింగుల్లోనూ సదరు ముఖ్యనేత మాట చెల్లలేదనే ఫ్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. మొత్తం మీద అధికార పార్టీలో ఇద్దరి నేతల మధ్య చెలరేగిన గొడవ కాస్తా జిల్లాలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.