విపక్షం లేక సభ వెలవెల
- వైఎస్సార్‌సీపీ సభ్యుల గైర్హాజరీతో కళతప్పిన అసెంబ్లీ
- విపక్ష నేత జగన్‌పై విమర్శలే లక్ష్యంగా ప్రసంగాలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో పోటీ లేని ఆట సాగింది. సభ్యుల హడావుడి లేదు. విపక్షాల వాయిదా తీర్మానాలు లేవు. సభలో లేని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలే లక్ష్యంగా అధికార పక్ష సభ్యుల ప్రసంగాలు... అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం కనిపించిన పరిస్థితిదీ.సభలో విపక్ష నేత, ప్రతిపక్ష సభ్యులు లేకపోవడంతో కొందరు అధికార పార్టీ సభ్యులు తమ ప్రభుభక్తిని ఘనంగా చాటుకున్నారు. సీఎం చంద్రబాబును పొగడ్తల్లో ముంచెత్తారు.
ప్రశ్నోత్తరాలు ముగిసే సమయానికి మంత్రులు కాక పట్టుమని పాతికమంది కూడా లేకుండాపోయారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమయ్యే సమయానికైతే శాసనసభ సిబ్బంది, కెమెరామెన్లు, సహాయక సిబ్బంది మినహా 24 మందే సభలో ఉన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డితోపాటు ఆ పార్టీ సభ్యులను మాట్లాడకుండా గొంతు నొక్కినందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ శుక్రవారం బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరైంది. ప్రశ్నోత్తరాల సమయంలో జవాబులు చెప్పాల్సిన మంత్రులు తప్ప మరెవ్వరూ సభలో కనిపించలేదు.
విపక్షం లేకపోవడమే మంచిది: రావెల
చెంచులకు ఎస్టీ హోదాపై మాట్లాడిన మంత్రి రావెల కిషోర్‌బాబు విపక్ష నేత జగన్‌పై అక్కసు వెళ్లబోసుకున్నారు. అరాచక ప్రతిపక్షం లేకపోవడం వల్ల సభ సజావుగా సాగుతోందని, సభ్యులు చర్చలో పాల్గొంటూ చక్కని ఆలోచనలు, విశ్లేషణలు చేశారని చెప్పుకొచ్చారు.
అర్థవంతమైన ప్రతిపక్షం అవసరమే: స్పీకర్
మంత్రి రావెల కిషోర్‌బాబు వ్యాఖ్యల అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు జోక్యం చేసుకుంటూ ప్రతిపక్షం లేకపోవడం అదృష్టమంటున్నారుగానీ తాను మాత్రం అర్థవంతమైన, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
జగన్ సభకు రావాలి: బీజేపీ
సభలో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం లోటుగా ఉందని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు.ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచైనా దయచేసి సభకు రావాలని విజ్ఞప్తి చేశారు.