members of the opposition
-
పార్లమెంట్లో ప్రతిపక్షాల రగడ
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్యే లోక్‌సభలో బుధవారం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదించారు. పెగసస్ స్పైవేర్, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళన కొనసాగించారు. శాంతించాలంటూ సభాపతి పదేపదే చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా నినాదాలతో హోరెత్తించారు. దీంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల మరణించిన 8 మంది లోక్‌సభ మాజీ సభ్యులకు బుధవారం సభలో నివాళులర్పించారు. తర్వాత పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలియజేసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత వ్యవసాయ మంత్రి తోమర్ ‘కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే కొబ్బరి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తోమర్ చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందింది. కొబ్బరి బోర్డులో ఇకపై ఆరుగురు సభ్యులను నియమిస్తారు. నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎక్స్–అఫీషియో జాయింట్ సెక్రటరీని నియమిస్తారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎగువ సభలో.. పార్లమెంట్ ఎగువ సభలో ప్రతిపక్షాల ఆందోళనల పర్వం కొనసాగుతోంది. పెగసస్ నిఘా, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగుదలపై విపక్ష సభ్యుల వెల్‌లోకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభలో ‘ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ఆమోదించారు. అంతకు ముందు దీనిపై స్వల్పంగా చర్చ జరిగింది. ఈ బిల్లు లోక్‌సభలో జూలై 29న ఆమోదం పొందింది. రాజ్యసభలో బుధవారం లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (అమెండ్మెంట్) బిల్లు–2021, డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(అమెండ్మెంట్) బిల్లు–2021ను కూడా ఆమోదించారు. రాజ్యసభ వ్యవహారాలను కొందరు సభ్యులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరిస్తుండడాన్ని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తప్పుపట్టారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ప్రతిపక్షాలు ఆందోళనను ఎంతకీ ఆపకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. ఆరుగురు టీఎంసీ ఎంపీల సస్పెన్షన్ సభలో అనుచిత ప్రవర్తనకు గాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య బుధవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి(టీఎంసీ) చెందిన ఆరుగురు ఎంపీలను సభ నుంచి బహిష్కరించారు. తమను రోజంతా బహిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు రాజ్యసభ లాబీ ఎదుట ఆందోళనకు దిగారు. రాజ్యసభ చాంబర్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఘటనపై రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నివేదిక అందజేస్తామని అధికారులు చెప్పారు. డోలా సేన్, మహమ్మద్ నదీముల్ హక్, అబీర్ రంజన్ బిశ్వాస్, శాంతా ఛెత్రీ, అర్పితా ఘోస్, మౌసమ్ నూర్‌ను రాజ్యసభ నుంచి రూల్ 255 కింద సస్పెండ్ చేసినట్లు పార్లమెంటరీ బులెటిన్‌లో పేర్కొన్నారు. సస్పెండ్‌కు నిరసనగా సమావేశాల్లో మిగిలిన రోజుల్లో సభకు హాజరు కాబోమని ఆ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రతిష్టంభనకు కేంద్రమే కారణం 14 విపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటన పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు కేంద్ర ప్రభుత్వమే కారణమని 14 ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు. పెగసస్ స్పైవేర్, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చించాలన్న తమ డిమాండ్‌ను ఆమోదించాలని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేంద్రానికి హితవు పలికారు. ఈ మేరకు 14 విపక్ష పార్టీలకు చెందిన 18 మంది నేతలు బుధవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్లో విపక్షాలు కలిసికట్టుగా వ్యవహరిస్తుండడంపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. విపక్షాల డిమాండ్‌ను అంగీకరించేందుకు సర్కారు అంగీకరించకపోవడం దారుణమన్నారు. పెగసస్ అనేది జాతి భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలని ఉద్ఘాటించారు. కొత్త సాగు చట్టాలతోపాటు రైతు సమస్యలపైనా చర్చించాలని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోపాటు కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఎల్జేడీ తదితర పార్టీల నాయకులు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు. -
ఆందోళన ఆగలేదు.. సభ సాగలేదు
న్యూఢిల్లీ: పెగసస్, రైతు చట్టాలపై చర్చకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలు దిగిరాకపోవడంతో శుక్రవారం కూడా పార్లమెంట్ ఎలాంటి చర్చలు జరగకుండా సోమవారానికి వాయిదా పడింది. లోక్‌సభ ఆరంభమైనప్పటి నుంచి విపక్ష సభ్యులు యథాత«థంగా నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగించాలని సభాపతి ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ప్రతిపక్షాల ఆందోళనపై సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అసహనం వ్యక్తం చేశారు. పెగసస్‌పై వివాదం అనవసర రగడని, ప్రజా సంబంధ విషయాలపై చర్చకు ప్రభుత్వం రెడీగా ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై ఐటీ మంత్రి అశ్విన్ వైష్ణవ్ వివరణ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. కానీ విపక్షాలు తమకు మరింత వివరణ కావాలని పట్టుబట్టాయి. ప్రతిపక్షాల ప్రవర్తన దురదృష్టకరమని జోషి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలు బిల్లులు చర్చలేకుండా ఆమోదం పొందాయని, ఇకనైనా విపక్షాలు కీలక అంశాలపై చర్చకు రావాలని విజ్ఞప్తి చేశారు. కానీ విపక్షాలు వినకపోవడంతో మధ్యాహ్నానికి సభ వాయిదా పడింది. తిరిగి సభ ఆరంభమవగానే ప్రభుత్వం రెండు బిల్లుల(కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ ఇన్ ఎన్సీఆర్ బిల్ 2021, జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ అమెండ్మెంట్ బిల్)ను సభలో ప్రవేశపెట్టింది. వీటిపై చర్చించాలని ప్రభుత్వం, సభాపతి విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. కానీ స్లోగన్లతో సభ సాగకపోవడంతో సోమవారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో సేమ్ సీన్ శుక్రవారం రాజ్యసభలో కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. దీంతో చర్చలు సాగకుండానే రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. సభారంభం కాగానే విపక్షాల నిరసనతో మధ్యాహ్నంలోపు రెండు మార్లు వాయిదా పడింది. పార్లమెంట్ మర్యాద, ప్రతిష్ట దెబ్బతింటున్నాయని విపక్షాల తీరుపై సభాపతి వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న మంత్రుల ముందు విజిళ్లు వేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం మర్యాదకాదన్నారు. ప్రతిఒక్కరూ సభా మార్యాద పాటించాలని విజ్ఞప్తి చేశారు. కానీ విపక్ష సభ్యులు వినలేదు. అనంతరం ఆయన జీరో అవర్ ఆరంభించారు. కానీ విపక్షాలు సభను సాగనివ్వలేదు. తిరిగి మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కానీ తిరిగి ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి స్లోగన్లతో సభను అడ్డుకున్నారు. దీంతో తిరిగి సభ మరలా వాయిదా పడింది. లంచ్ తర్వా త సభలో ప్రభుత్వం మూడు బిల్లులు ప్రవేశపెట్టింది. వీటిలో ఒక బిల్లును ప్రతిపక్ష ఆందోళన మధ్యనే మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. తదనంతరం సభ సోమావారానికి వాయిదా పడింది. -
సభాపతి పైకి పేపర్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బుధవారం ఎలాంటి చర్చలు లేకుండా గురువారానికి వాయిదా పడింది. ఉభయసభల్లో ప్రతిపక్షాల సభ్యులు సభాకార్యక్రమాలు జరగకుండా ఆందోళన కొనసాగించారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్స్థానంపైకి విసరడం కలకలం సృష్టించింది. రెండు సభలు పలుమార్లు వాయిదా పడినా విపక్షాల నిరసన ఆగకపోవడంతో సభాధిపతులు మరుసటిరోజుకు సభలను వాయిదా వేశారు. పెగసస్, రైతు చట్టాలపై చర్చకు పట్టుపడుతూ విపక్ష సభ్యులు సమావేశాలు జరగకుండా ఆందోళన జరుపుతున్న సంగతి తెలిసిందే! బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. కానీ వెంటనే విపక్షాలు తమ ఆందోళనను ఆరంభించాయి. పలువురు సభ్యులు సభ వెల్‌లోకి చేరుకొని నినాదాలతో సభను అడ్డుకున్నారు. కానీ స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన హౌస్ప్రొసీజర్స్ పుస్తకాన్ని రిఫర్ చేస్తూ కనిపించారు. ఎట్టకేలకు వర్షాకాల సమావేశాలు ఆరంభమైన తర్వాత తొలిసారి లోక్‌సభలో క్వశ్చన్ అవర్ జరిగినట్లయింది. అనంతరం స్పీకర్ సభను వదిలివెళ్లగా డిçప్యూటీ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ సభా నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. ఈ సమయంలో సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. కొందరు కాంగ్రెస్ సభ్యులు పేపర్లు, ప్లకార్డులు చింపి లోక్‌సభ స్పీకర్స్థానం పైకి విసిరేశారు. కాంగ్రెస్‌కు చెందిన గుర్జీత్ ఔజాలా, ప్రతాపన్, హిబి ఈడెన్ తదితరులు పేపర్లు చింపి స్పీకర్ స్థానం మీదకు, ట్రెజరీ బెంచ్‌ల మీదకు విసిరారు. సాయంకాలానికీ సభలో నిరసనలు ఆగకపోవడంతో గురువారానికి సభను వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. రాజ్యసభలో కొనసాగిన నిరసనలు పెగసస్, రైతు చట్టాలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళన రాజ్యసభలో బుధవారం కొనసాగింది. అయితే ఆందోళనల నడుమ సభ జువెనైల్ జస్టిస్ సవరణ చట్టం 2021కు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. బుధవారం రాజ్యసభ సభాధిపతి వెంకయ్య జీరోఅవర్‌ను ఆరంభించారు. కాంగ్రెస్, టీఎంసీ, ఇతర విపక్ష సభ్యులు నినదిస్తూ సభను అడ్డుకున్నారు. కొందరు ప్లకార్డులతో వెల్‌లోకి వెళ్లేందుకు యత్నించగా వెంకయ్య అడ్డుకున్నారు. అనంతరం సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే వెంకయ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. కానీ విపక్ష సభ్యులు స్లోగన్లు ఉధృతం చేసి సభను అడ్డుకున్నారు. ఈ సమయంలో సభ్యులు ముందే అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. అనంతరం తిరిగి సభ వాయిదా పడింది. అదనపు వ్యయానికి సభామోదం ప్రభుత్వం అదనంగా రూ.23వేల కోట్ల వ్యయం చేసుకునేందుకు పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. రూ. 17వేల కోట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖకు కేటాయించారు. దీన్ని కోవిడ్ సంబంధిత వ్యయాలకు ఉపయోగిస్తారు. రూ. 2050 కోట్లు పౌరవిమానయాన శాఖకు వెళ్తాయి. -
విపక్షం లేక సభ వెలవెల
వైఎస్సార్సీపీ సభ్యుల గైర్హాజరీతో కళతప్పిన అసెంబ్లీ విపక్ష నేత జగన్‌పై విమర్శలే లక్ష్యంగా ప్రసంగాలు సాక్షి, హైదరాబాద్: శాసనసభలో పోటీ లేని ఆట సాగింది. సభ్యుల హడావుడి లేదు. విపక్షాల వాయిదా తీర్మానాలు లేవు. సభలో లేని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలే లక్ష్యంగా అధికార పక్ష సభ్యుల ప్రసంగాలు... అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం కనిపించిన పరిస్థితిదీ.సభలో విపక్ష నేత, ప్రతిపక్ష సభ్యులు లేకపోవడంతో కొందరు అధికార పార్టీ సభ్యులు తమ ప్రభుభక్తిని ఘనంగా చాటుకున్నారు. సీఎం చంద్రబాబును పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రశ్నోత్తరాలు ముగిసే సమయానికి మంత్రులు కాక పట్టుమని పాతికమంది కూడా లేకుండాపోయారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమయ్యే సమయానికైతే శాసనసభ సిబ్బంది, కెమెరామెన్లు, సహాయక సిబ్బంది మినహా 24 మందే సభలో ఉన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డితోపాటు ఆ పార్టీ సభ్యులను మాట్లాడకుండా గొంతు నొక్కినందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ శుక్రవారం బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరైంది. ప్రశ్నోత్తరాల సమయంలో జవాబులు చెప్పాల్సిన మంత్రులు తప్ప మరెవ్వరూ సభలో కనిపించలేదు. విపక్షం లేకపోవడమే మంచిది: రావెల చెంచులకు ఎస్టీ హోదాపై మాట్లాడిన మంత్రి రావెల కిషోర్‌బాబు విపక్ష నేత జగన్‌పై అక్కసు వెళ్లబోసుకున్నారు. అరాచక ప్రతిపక్షం లేకపోవడం వల్ల సభ సజావుగా సాగుతోందని, సభ్యులు చర్చలో పాల్గొంటూ చక్కని ఆలోచనలు, విశ్లేషణలు చేశారని చెప్పుకొచ్చారు. అర్థవంతమైన ప్రతిపక్షం అవసరమే: స్పీకర్ మంత్రి రావెల కిషోర్‌బాబు వ్యాఖ్యల అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు జోక్యం చేసుకుంటూ ప్రతిపక్షం లేకపోవడం అదృష్టమంటున్నారుగానీ తాను మాత్రం అర్థవంతమైన, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నానన్నారు. జగన్ సభకు రావాలి: బీజేపీ సభలో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం లోటుగా ఉందని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు.ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచైనా దయచేసి సభకు రావాలని విజ్ఞప్తి చేశారు.