వెంకయ్య ముందు ప్లకార్డులతో సభ్యుల నిరసన దృశ్యం
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్యే లోక్‌సభలో బుధవారం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదించారు. పెగసస్ స్పైవేర్, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళన కొనసాగించారు. శాంతించాలంటూ సభాపతి పదేపదే చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా నినాదాలతో హోరెత్తించారు. దీంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల మరణించిన 8 మంది లోక్‌సభ మాజీ సభ్యులకు బుధవారం సభలో నివాళులర్పించారు.
తర్వాత పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్‌జాయినింగ్ ఏరియాస్ బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలియజేసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత వ్యవసాయ మంత్రి తోమర్ ‘కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు(అమెండ్‌మెంట్) బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు.
ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే కొబ్బరి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తోమర్ చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందింది. కొబ్బరి బోర్డులో ఇకపై ఆరుగురు సభ్యులను నియమిస్తారు. నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎక్స్–అఫీషియో జాయింట్ సెక్రటరీని నియమిస్తారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఎగువ సభలో..
పార్లమెంట్ ఎగువ సభలో ప్రతిపక్షాల ఆందోళనల పర్వం కొనసాగుతోంది. పెగసస్ నిఘా, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగుదలపై విపక్ష సభ్యుల వెల్‌లోకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభలో ‘ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(అమెండ్‌మెంట్) బిల్లు–2021’ను ఆమోదించారు. అంతకు ముందు దీనిపై స్వల్పంగా చర్చ జరిగింది.
ఈ బిల్లు లోక్‌సభలో జూలై 29న ఆమోదం పొందింది. రాజ్యసభలో బుధవారం లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ (అమెండ్‌మెంట్) బిల్లు–2021, డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(అమెండ్‌మెంట్) బిల్లు–2021ను కూడా ఆమోదించారు. రాజ్యసభ వ్యవహారాలను కొందరు సభ్యులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరిస్తుండడాన్ని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తప్పుపట్టారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ప్రతిపక్షాలు ఆందోళనను ఎంతకీ ఆపకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు.
ఆరుగురు టీఎంసీ ఎంపీల సస్పెన్షన్
సభలో అనుచిత ప్రవర్తనకు గాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య బుధవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి(టీఎంసీ) చెందిన ఆరుగురు ఎంపీలను సభ నుంచి బహిష్కరించారు. తమను రోజంతా బహిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు రాజ్యసభ లాబీ ఎదుట ఆందోళనకు దిగారు. రాజ్యసభ చాంబర్‌లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఘటనపై రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నివేదిక అందజేస్తామని అధికారులు చెప్పారు. డోలా సేన్, మహమ్మద్ నదీముల్ హక్, అబీర్ రంజన్ బిశ్వాస్, శాంతా ఛెత్రీ, అర్పితా ఘోస్, మౌసమ్ నూర్‌ను రాజ్యసభ నుంచి రూల్ 255 కింద సస్పెండ్ చేసినట్లు పార్లమెంటరీ బులెటిన్‌లో పేర్కొన్నారు. సస్పెండ్‌కు నిరసనగా సమావేశాల్లో మిగిలిన రోజుల్లో సభకు హాజరు కాబోమని ఆ ఎంపీలు పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో ప్రతిష్టంభనకు కేంద్రమే కారణం
14 విపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటన
పార్లమెంట్‌లో వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు కేంద్ర ప్రభుత్వమే కారణమని 14 ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు. పెగసస్ స్పైవేర్, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర కీలక అంశాలపై పార్లమెంట్‌లో చర్చించాలన్న తమ డిమాండ్‌ను ఆమోదించాలని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేంద్రానికి హితవు పలికారు. ఈ మేరకు 14 విపక్ష పార్టీలకు చెందిన 18 మంది నేతలు బుధవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్‌లో విపక్షాలు కలిసికట్టుగా వ్యవహరిస్తుండడంపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు.
విపక్షాల డిమాండ్‌ను అంగీకరించేందుకు సర్కారు అంగీకరించకపోవడం దారుణమన్నారు. పెగసస్ అనేది జాతి భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలని ఉద్ఘాటించారు. కొత్త సాగు చట్టాలతోపాటు రైతు సమస్యలపైనా చర్చించాలని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోపాటు కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్‌ఎస్పీ, ఎల్‌జేడీ తదితర పార్టీల నాయకులు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment