సిద్దిపేట, న్యూస్‌లైన్: పేదలు మరీ ముఖ్యంగా బడుగూ, బలహీన వర్గాల్లో సొంత గూడంటూ లేని వారి కోసం ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ ద్వారా పక్కా ఇళ్లు కట్టిస్తోంది. గత సంవత్సరం వరకు ఒక్కో ఇల్లుకు రూ.42 వేలు చెల్లించింది. స్టీలు, సిమెంటు, ఇసుక వంటి ప్రధాన సామగ్రి ధరలకు రెక్కలు రావడంతో ఆ మొత్తాన్ని దాదా పు రెట్టింపు చేస్తూ సవరించింది. రాయితీ గృహాలకు పెంచిన ఆర్థిక సహాయాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తోంది. సిద్దిపేట నియోజవకర్గంలోని సిద్దిపేట అర్బన్, రూ రల్, చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో కలిపి ‘ఇందిరమ్మ ఇల్లు’ పేరిట మొత్తం రెండు వేల పక్కా గృహాలను సర్కారు ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మంజూరు చేసింది.
‘అదనం’లోనే అక్రమాలు!
గత ఏడాదిలో జీఓ నంబర్ 171 ద్వారా అదనపు ఇళ్లను గృహ నిర్మాణ శాఖ మంజూరు చేసింది. వాటిల్లో కొన్నిచోట్ల అక్రమాలు కూ డా ‘అదనం’గానే జరిగాయని తెలుస్తోంది. చి న్నకోడూరు మండలం రామంచలో ఓ వ్యక్తిని లబ్ధిదారుగా జాబితాలో పేర్కొన్నారు. నిజానికి అతడు ఆ ఊరిలోనే నివాసం ఉండడం లేదు. అక్కడాయనకు ఇల్లు కూడా లేదు. ఆ గ్రామానికి శనివారం వెళ్లి వాకబు చేసిన ‘న్యూస్‌లైన్’కు ఈ విషయం ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అలాంటి అక్రమ లబ్ధిదారుడికి విడతలవారీగా రూ.42 వేలు చెల్లించినట్లు తెలుస్తోంది. అలా...మూడు దఫాలుగా బిల్లులు ఇచ్చినట్లు సమాచారం. చివరి ఇన్‌స్టాల్‌మెంటు గత ఫిబ్రవరి 11న విడుదల చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
కొందరికి కల్పతరువు.
నియోజవకర్గంలోని కొన్ని గ్రామాల్లో పలుకుబడిగల కొందరు వ్యక్తులకు గృహ నిర్మాణ శాఖ కల్పతరువుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరు అధికారులతో చేతులు కలిపి...తమ విలాసవంతమైన జీవన వ్యయానికి వీలునుబట్టి బినామీ/బోగస్ పేర్లతో పక్కా గృహాలు నిర్మించినట్లు రికార్డులు సృష్టింపజేసి యథేచ్ఛగా డబ్బులు కాజేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది బహిరంగ రహస్యేమనని, సదరు అధికారులు, వ్యక్తులను ఎవరూ ఏమీ చేయలేరని కొందరు స్థానికులు ‘న్యూస్‌లైన్’తో పేర్కొనడం గమనార్హం. గృహ నిర్మాణాల్లో అక్రమాల బాగోతం ఆరోపణలపై చిన్నకోడూరు హౌసింగ్ ఏఈ మహేందర్ వివరణ కోసం ‘న్యూస్‌లైన్’ శని, ఆదివారాల్లో పలుమార్లు ప్రయత్నించింది. ఆయన సెల్‌ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది.
మా దృష్టికి రాలేదు...
పక్కా ఇళ్లల్లో అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి రాలేదు. అసలు అలా జరిగేందుకూ ఆస్కారమే లేదు. అలాంటివి ఎక్కడైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. చర్యలు తీసుకుంటాం. డబ్బులు రికవరీ చేస్తాం. అయినా...చిన్నకోడూరుకు సంబంధించి మీరు (న్యూస్‌లైన్‌ను ఉద్దేశిస్తూ) ఏఈని అడగాల్సింది.
-సత్యనారాయణ, డీఈఈ, హౌసింగ్, సిద్దిపేట
కొసమెరుపు..!
డీఈఈని వివరణ కోసం ఫోన్‌లో ‘న్యూస్‌లైన్’ శనివారం సాయంత్రం సంప్రదించిన కొద్దిసేపట్లోనే సదరు అక్రమ లబ్ధిదారుడికి తెలిసిపోయింది. ఆయన క్షణాల్లోనే తేరుకొని గ్రామంలోనూ, ఇతరత్రా ఆరా తీయడం గమనార్హం. అంటే దీన్నిబట్టి కొందరు అధికారుల పాత్రపైనా అనుమానాలు మొలకెత్తుతున్నాయి.
ఇల్లు రాసుకోండి.. పైసల్ తీసుకోండి!
Published Mon, Oct 7 2013 2:48 AM | Last Updated on Fri, Sep 1 2017 11:24 PM
Advertisement