గృహం.. ఏదీ అనుగ్రహం..! | Housing Scheme Delayed In West Godavari | Sakshi
Sakshi News home page

గృహం.. ఏదీ అనుగ్రహం..!

Published Fri, Apr 27 2018 1:56 PM | Last Updated on Fri, Apr 27 2018 1:56 PM

Housing Scheme Delayed In West Godavari - Sakshi

తాడేపల్లిగూడెంలో నిర్మాణంలో ఉన్న పీఎంఏవై గృహాలు

తాడేపల్లిగూడెం: ‘అందరికీ ఇళ్లు’ ఇది ప్రభుత్వ నినాదం అయితే కొందరికి కూడా దక్కని పరిస్థితి. క్షేత్రస్థాయిలో ఇటుక వేయడానికి నెలలు, కాగితాల మీద ఆర్డర్లు కార్యరూపం దాల్చడానికి మరికొన్ని నెలలు గడిచిపోయాయి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లు గడుస్తున్నా జిల్లాలో ఒక్క గృహప్రవేశం కూడా జరగలేదు. జిల్లాలో ఇళ్ల నిర్మాణం వ్యవహారం చూస్తుంటే హౌసెస్‌ ఫర్‌ హాఫ్‌ అన్నచందంగా కనిపిస్తోంది. సంగంతో మమ అనిపించేలా ఈ వ్యవహారం నడుస్తోంది. 2018 జనవరిలో గృహప్రవేశాలు చేయిస్తామన్న నేతలు అంకెను మార్చి 2019 జనవరిలో చేయించడానికి కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. 

సగంతోనే మమ
జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు పట్టణాలకు 34,211 ఇళ్లను అందరికీ ఇళ్లు పథకంలో కేటాయించారు. ఏలూరుకు 12,176, పాలకొల్లుకు 7,159, తాడేపల్లిగూడెంకు 5,376, భీమవరంకు 9,500 ఇళ్లకు అనుమతులు ఇచ్చారు.

♦ ఏలూరులో ఇంతవరకు ఈ ప్రక్రియకు అంకురార్పణ జరగలేదు.
తాడేపల్లిగూడెంలో 5,376 ఇళ్ల కోసం 4,500 డీడీలను అర్హులుగా చెప్పిన వారు సమర్పించారు. పలు వడపోతల అనంతరం ఇక్కడ డీడీలు చెల్లించిన వారిలో 2,927 మందిని మాత్రమే అర్హులుగా  తేల్చారు. వీరికి సరిపడా ఎల్‌.అగ్రహారం వద్ద ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదు. కేవలం 600 ఫ్లాట్లు మాత్రమే ఇప్పటివరకు పూర్తయ్యాయి.
భీమవరంలో 9,500 ఇళ్లకు గాను 8,352 మంది డీడీలు చెల్లించారు. వీరిలో 5,900 మందిని అర్హులుగా గుర్తించారు.
పాలకొల్లులో 7,159 ఇళ్లకు గాను 6,784 మంది డీడీలు సమర్పించారు. వీరిలో 4,400 మందిని అర్హులుగా గుర్తించారు.

గూడెంలో భారీ కోత
జిల్లాలో ఈ పథకం అమలుచేస్తున్న ఏ పట్టణంలో లేనివిధంగా తాడేపల్లిగూడెంలో లబ్ధిదారుల జాబితాలో కొర్రీ పడింది. 5,376 ఇళ్లు మంజూరు కాగా, 4,500 మంది డీడీలు చెల్లించారు. వీరిలో 1,573 మందిని అనర్హులుగా తేల్చారు. కేవలం 2,927 మందినే అర్హులుగా గుర్తించారు.

కోత ఎలా పడిందంటే...
సామాజిక సర్వే పేరుతో ఉన్న వివరాలను సరిపోల్చుకుని జాబితాలోని కొన్ని పేర్లు ఎత్తేశారు. పాన్‌ కార్డు వివరాల ఆధారంగా కొన్ని పేర్లు తీసేశారు. ఐటీ అసెస్సీ జాబితా పేరుతో మరికొందరికి నామం పెట్టారు. భార్య పేరిట లేదంటే కుటుంబ సభ్యుల పేరిట ఇళ్లు ఉన్నాయనే సాకుతో మరి కొందరిని బ్లాక్‌ లిస్టులో పెట్టేశారు. ఆధార్‌ మిస్‌ మ్యాచింగ్‌ పేరుతో ఒక్కో పట్టణంలో 500 మంది వంతున పక్కకు లాగేశారు. గతంలో హౌసింగ్‌ స్కీమ్‌లను ఉపయోగించుకున్నారనే సాకుతో ఒక్క తాడేపల్లిగూడెంలోనే 680 మందిని అనర్హులుగా తేల్చారు. ఇళ్ల కోసం తొలి విడత సొమ్ము నిమిత్తం చెల్లించిన డీడీలు కాలం చెల్లిపోతున్నాయి. వీటిని రెన్యువల్‌ చేయించుకోవాలంటే ఎంతోకొంత చేతి చమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి.

యూఎల్‌బీల పురోగతి అంతంత మాత్రమే
జిల్లాలో అందరికీ ఇళ్లు పథకం కాకుండా అర్బన్‌ లోకల్‌ బాడీలకు ఇళ్ల కేటాయింపులు (యూఎల్‌బీ) చేశారు. జంగారెడ్డిగూడెంకు 2,883, కొవ్వూరుకు 2,450, నరసాపురానికి 2,467, నిడదవోలుకు 2,571, తణుకులో 3,539 ఇళ్లను జిల్లా మొత్తంగా 13,910 ఇళ్లు కేటాయించారు. వీటి నిర్మాణాలు ఇదే రీతిలో ఉన్నాయి.

రెండో జాబితా ఉంటుంది
తాడేపల్లిగూడెంలో అందరికి ఇళ్లకోసం డీడీలు కట్టిన వారు ఆందోళన చెందనక్కరలేదు. అర్హులైన వారు ఇంకా మిగిలి ఉంటే రెండో జాబితాలో చేరుస్తారు. సాంకేతిక కారణాలు, సర్వేలో వెల్లడైన వివరాల ఆధారంగా జాబితాలో ఉన్న కొందరు అనర్హులుగా తేలారు. డీడీలు ల్యాప్స్‌ కావు. ఆధార్‌ మిస్‌ మ్యాచింగ్‌ పెద్ద విషయం కాదు. వేగంగా ప్రక్రియ సాగేందుకు ప్రయత్నిస్తున్నాం.
– బి.బాలస్వామి, కమిషనర్, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement