మనమే ఎలా అడ్డుపడతాం?
-
అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో సీఎం
-
తెలంగాణలో ఉన్నదీ మన పార్టీయే కదా?
-
.. వారి ఆశలను మనం ఎలా కాదనగలం?
-
సభలో బిల్లుపై అభిప్రాయాలు చెప్పుకోవాలి
-
బిల్లును వ్యతిరేకిస్తే విభజన ఆగిపోతుంది!
సాక్షి, హైదరాబాద్: ‘‘కేంద్రంలో మన పార్టీయే తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తోంది. రాష్ట్రంలో మన పార్టీయే అధికారంలో ఉంటూ రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును మనమే ఎలా అడ్డుకుంటాం? తెలంగాణలో ఉన్నది కూడా మన పార్టీ నేతలే కదా? వాళ్లు కూడా ఆశతో ఎదురుచూస్తున్నారు. వారి ఆశల్ని మనం ఎలా కాదనగలం. ఇలాంటి చిన్నచిన్న విషయాల గురించి పెద్దగా పట్టించుకోవద్దు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పండి చాలు. సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా వ్యతిరేకిస్తే విభజన ఆగిపోతుంది’’ అని తెలంగాణ బిల్లుపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నట్లు తెలిసింది. తద్వారా ఆయన తన వైఖరిని తేటతెల్లంచేశారు. మంగళవారం తన నివాసంలో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశాన్ని నిర్వహించారు. బుధవారం అసెంబ్లీలో అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీరు, చర్చను హడావుడిగా ప్రారంభించిన వైఖరిపై నేతలు తీవ్ర నిరసన తెలిపారు. బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో సభా నాయకుడిగా కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరు కాకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు ఉన్నాయని, కేంద్రంతో కుమ్మక్కై విభజన సాఫీగా ముందుకు తీసుకువెళ్లేందుకు సీఎం సహకరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయని చెప్పారు.
సీఎం స్పందిస్తూ.. తెలంగాణ బిల్లు రాష్ట్రపతి నుంచి వచ్చిందని, దాన్ని సోమవారం ప్రవేశపెట్టకున్నా ఏదో ఒకరోజు సభలో పెట్టక తప్పదని చెప్పారు. బిల్లు వచ్చాక కూడా ప్రవేశపెట్టకుండా ఆలస్యం చేయడం వల్ల ఆ ప్రాంతంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడతారని, వారి ఆశల్ని కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. బిల్లుపై చర్చలో సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా పాల్గొనడంతో పాటు సమస్యలను సమగ్రంగా విశ్లేషించి చెప్పాలని సూచించారు.
వాదనను అఫిడవిట్ల రూపంలో ఇవ్వండి..: అసెంబ్లీలో బిల్లును ఇప్పుడు ప్రవేశపెట్టడానికి వీల్లేకుండా శీతాకాల అసెంబ్లీ సమావేశాలను ముందుగానే ముగించి ఉంటే బాగుండేదని, ఇప్పుడు బిల్లు వచ్చాక ఏమీ చేయలేని పరిస్థితిని తీసుకువచ్చారని కొందరు నేతలు సీఎం వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు బిల్లుపై అభిప్రాయాలు చెప్పినంత మాత్రాన విభజన ఎలా ఆగుతుందని ప్రశ్నించారు. ప్రతి సభ్యుడు బిల్లును వ్యతిరేకించి మాట్లాడ్డంతోపాటు ఆ విషయాన్ని అఫిడవిట్ల రూపంలో స్పీకర్‌కు అందించాలని సీఎం సూచించారు. కేం్రద్రానికి, సుప్రీంకోర్టుకు కూడా వీటిని పంపిస్తామని, తద్వారా విభజన ఆగుతుందని భరోసా ఇచ్చారు.
మధ్యలోనే ముగించేస్తే ఎలా..: విభజన బిల్లును కాంగ్రెస్ సీమాంధ్ర నేతలే కాకుండా ఇతర పార్టీల సీమాంధ్ర ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించాల్సి ఉంటుందని, ఇందుకు ఆయా పార్టీలతోనూ సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు ముగ్గురు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలతో కూడిన కమిటీకి బాధ్యతలు అప్పగించారు. 371-డితో పాటు అనేక అంశాల్లో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయన్నారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఇంకా 22 రోజులు ఉందని, ఇంత ముందుగా చర్చను ప్రారంభించడం వల్ల అన్ని రోజులు ఎలా సాగదీయగలమని కొందరు ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. చివరకు బిల్లుపై చర్చ ముగిసిందని మధ్యలోనే ముగించేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మొదటి విడత శుక్రవారం వరకు సమావేశమై సభ వాయిదా పడుతుందని, ఇలా క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి వరుసగా సెలవులు వస్తాయి కనుక చివరి వరకు మాట్లాడ్డానికి ఇబ్బందిరాదని సీఎం సర్దిచెప్పారు. మధ్యలో తుఫాన్ల వల్ల నష్టాలు, కృష్ణా జలాలు వంటి అంశాలపైనా చర్చ ఉంటుందన్నారు. సమావేశంలో 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సీఎం కేంద్రంతో కుమ్మక్కు కాలేదు: విభజన అంశంలో కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రం, అధిష్టానంతో కుమ్మక్కయినట్టు విమర్శలు వెల్లువెత్తడంతో అది సరికాదని సీఎం సమైక్యవాదిగానే ఉన్నారని ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా వివరించారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన సమైక్యవాదాన్ని ఇసుమంత కూడా సడలించలేదని చెప్పారు. ఎమ్మెల్యేలందరం అఫిడవిట్లు సమర్పిస్తామని ఆనం వివేకానందరెడ్డి తెలిపారు. విభజన వల్ల తలెత్తే సమస్యలపై మాట్లాడతామని ఎమ్మెల్యే వంగా గీత చెప్పారు.