
ఇలాగైతే ఎలా?
బత్తలపల్లి : బత్తలపల్లి మండలం పోట్లమర్రి గ్రామంలో ఓ మహిళా రైతు తమ వేరుశనగ పొలంలోనే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందింది. ఎండుతున్న పంటను చూసి ఆమె గుండె పగిలింది. మరో పది రోజుల్లోనే కుమారుడి వివాహం జరగాల్సిన ఆ ఇంట.. మరణ మృదంగం మోగింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన కురబ బీరన్న, లక్ష్మమ్మ(59) దంపతులు తమకున్న నాలుగెకరాల పొలంలో రూ.30 వేలు పెట్టుబడి పెట్టి ఖరీఫ్ వేరుశనగ పంట సాగు చేశారు.
త్వరలో తమ కుమారుడు ఆంజనేయులు వివాహం ఉండడంతో.. పెళ్లి పనుల్లో మునిగిపోతే పొలంలో కలుపు తీయడం ఆలస్యమవుతుందని, గురువారం ఉదయం నలుగురు కూలీలను లక్ష్మమ్మ తనతో పాటు తీసుకుని పొలానికి వెళ్లింది. అక్కడికెళ్లాక పంట వాడు పట్టి ఉండటాన్ని చూసి తీవ్ర ఆందోళనకు గురైంది. ఈసారి కూడా పెట్టుబడి దక్కేలా లేదని, ఇది వరకే రూ.లక్ష రూపాయల అప్పు ఉందని బాధ పడింది. పంట ఇలా ఎండిపోయిందేంటే అంటూ కూలీలతో ఆవేదన వ్యక్తం చేసింది. ‘అక్కా పెండ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతాండాయి.. బంధువులందర్నీ పిలుస్తున్నారా..’ అని అడుగుతున్న తోటి కూలీలకు సమాధానం చెబుతూ.. గుండెలో నొప్పిగా ఉందంటూ కుప్ప కూలిపోయింది. వెంటనే మంచినీరు తెచ్చి తాపించే ప్రయత్నం చేసేలోపే మృత్యువాత పడింది.
కొడుకు పెళ్లిలో బంధువుల సందడితో కళకళలాడాల్సిన ఆ ఇంట విషాదం నెలకొంది. గ్రామస్తులు పొలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. గ్రామ పెద్దలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.