
రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఎంతివ్వాలి?
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ఎంతెంత ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రణాళికా సంఘం గురువారం ఢిల్లీలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఆ సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం అధికారులు పలు కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, రాష్ట్రానికి చెందిన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.
ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ. రమేశ్ ఈ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం ఢిల్లీ వెళ్లారు. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పన్ను రాయితీలు ఏ ఏ రంగాల్లో ఏ రాష్ట్రానికి ఎంతెంత ఇవ్వాలి? రెండు రాష్ట్రాలకు అదనపు సాయంగా కేంద్రం ఎన్ని నిధులివ్వాలి? అలాగే ప్రణాళికా సంఘం ద్వారా ఇవ్వాల్సిన నిధులు ఎంత, వివిధ కేంద్రమంత్రిత్వ శాఖల ద్వారా చేయాల్సిన ఆర్థిక సహాయం.
14వ ఆర్థిక సంఘం ద్వారా అందించాల్సిన ఆర్థిక వనరులు ఎంతెంత? తదితర విషయాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్రలో ఏర్పాటు చేయాల్సిన ఇన్‌స్టిట్యూషన్స్‌కు నిధులు ఎంత అవసరం అవుతాయనే విషయాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా రెండు కొత్త రాష్ట్రాలు ఆర్థిక పరంగా ఏర్పడే ఆటుపోటులను తట్టుకునేందుకు వీలుగా రెండేళ్ల పాటు ఇరు రాష్ట్రాలకు బడ్జెట్ నిర్వహణ ద్రవ్య జవాబుదారీ చట్టం నిబంధనలను సడలించే అంశంపై కూడా కేంద్ర ప్రణాళిక సంఘం సమావేశంలో చర్చించనున్నారు.