కడప అర్బన్ : రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కేవీ రమణ వైద్య సిబ్బందికి సూచించారు. కడప నగర శివార్లలోని రిమ్స్‌ను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐపీ విభాగంలోని నవజాత శిశువుల చికిత్సా విభాగం, కాన్పుల అనంతరం మహిళలకు అందుతున్న వైద్య సేవలు, మెడికల్, సర్జికల్ ఐసీయూ, డయాలసిస్ యూనిట్లను, చిన్న పిల్లల విభాగం, వార్డులను పరిశీలించారు. అంతకుముందు డీఆర్‌డీఏ సౌజన్యంతో నిర్వహిస్తున్న జనరిక్ మందుల విభాగం జీవధారను పరిశీలించారు. మందుల ధరలను,రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు.
అనంతరం డెరైక్టర్ చాంబర్‌లో రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్, ఏపీఎంహెచ్ ఎస్‌ఐడీసీ ఈఈ మధుమల్లేశ్వరరెడ్డి, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణమోహన్, ఆర్‌ఎంఓ డాక్టర్ వెంకటరత్నంలతో సమావేశమయ్యారు. రిమ్స్‌కు రోజువారి అవసరాల కోసం ఐపీ, ఓపీ, కళాశాల, హాస్టళ్లు, నర్సింగ్ కళాశాల, క్వార్టర్స్‌కు జరిగే నీటి సరఫరాపై ఆరా తీశారు. అందుకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తాగునీటి సౌకర్యం ఏ విధంగా ఉంది? అవసరాలకు ఎలాంటి నీరు అందుతోంది? అనే అంశాలపై అధికారులతో చర్చించారు.
ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. జీవధార మందుల షాపులో మందులను మరింత తక్కువ ధరకు రోగులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రిమ్స్‌లో పారిశుద్ధాన్ని మెరుగు పరుచుకోవాలన్నారు. రోగుల భద్రతకు సంబంధించి సెక్యూరిటీ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఈ అంశాలపై రిమ్స్ డెరైక్టర్ మాట్లాడుతూ పారిశుద్ద్యం, తగు సెక్యూరిటీ సిబ్బంది కోసం ఏపీఎంహెచ్ ఎస్‌ఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వారికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
ఈ సందర్భంగా కొంతమంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది తమను విధుల్లో కొనసాగించాలని కలెక్టర్‌ను, రిమ్స్ డెరైక్టర్‌ను కోరారు. అందుకు కలెక్టర్ స్పందిస్తూ హాస్పిటల్ యాజమాన్యం వ్యక్తులను నియమించుకోదని, ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి మాత్రమే కాంట్రాక్టు ఇస్తుందని తెలిపారు. కొత్తగా వచ్చే ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ఇప్పుడున్న సిబ్బందిని పరిశీలించి వారిసేవలు బాగుంటాయని భావిస్తే వారిని ఆ ఏజెన్సీ నియమించుకుంటే ఆస్పత్రి యాజమాన్యానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. రోగులకు చికిత్స చేయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించడమనేది ప్రథమ కర్తవ్యమన్నారు. పరిసరాలు శుభ్రంగా ఉంచడంతోపాటు మానసిక ఒత్తిడి లేకుండా ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు రోగులకు మంచి వైద్య సేవలను అందించడమే ఆస్పత్రి అభివృద్ధి కమిటీ బాధ్యతన్నారు.
బాగా చూసుకుంటున్నారా..
Published Sat, Aug 2 2014 3:15 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement