నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: వదలమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నచందంగా ఉంది ఉపాధి హామీ క్షేత్ర స్థాయి సిబ్బంది పరిస్థితి. అటు అధికారులతో చీవాట్లు తినలేక, ఇటు కూలీలకు సర్ది చెప్పుకోలేక హైరానాపడుతున్నారు. ఉపాధి హామీ పథకం అమల్లో సీఆర్‌డీ (కమిషనర్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్) నూతన నిబంధనలతో క్షేత్ర స్థాయి సిబ్బంది అవస్థలు పడుతున్నారు. రెండు నెలల నుంచి కూలీలకు పేమెంట్లు చెల్లించలేదు. సుమారు రూ.4 కోట్లకు పైగా పేమెంట్లు నిలిచిపోయాయి. పేమెంట్ల చెల్లింపుల్లో జాప్యం వల్ల కూలీలు బాగా తగ్గిపోయారు. రెండు నెలల కిందట రోజుకు 80 వేలకు పైగా కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యేవారు. ప్రస్తుతం రోజుకు 20 వేలకు మించడం లేదు. మంగళవారం 22 వేల మంది కూలీలు హాజరయ్యారు. కూలీలు ఉపాధి పనులకు హాజరు కాకపోవడంతో అధికారులు ఒత్తిడి చేస్తున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఆర్‌డీ నూతన నిబంధనలతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. కూలీల సంఖ్యను పెంచక పోతే వేతనాలు కట్ చేయడం లేదా ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. ఏపీఓలు, టీఏలపై అధికారుల ఒత్తిడి అధికంగా ఉంది. ఏపీఓలు ఎఫ్‌ఏలపై ఒత్తిడి చేస్తున్నారు. కూలీలను పెంచకపోతే చర్యలు తీసుకుంటామని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎఫ్‌ఏలకు నిర్దేశించిన పని దినాలు కల్పించలేకపోతే వారి ఉద్యోగం ఊడుతుంది. పనిదినాలు కల్పించలేని ఎఫ్‌ఏలను తొలగించి సీనియర్ మేట్లుగా నియమిస్తున్నారు. పేమెంట్ల చెల్లింపులో జాప్యం కారణంగా కూలీలు పనులకు హాజరుకావడం లేదని ఎఫ్‌ఏలు వాపోతున్నారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా తాము ఉపాధి కోల్పోయి ఇబ్బందులుపడాల్సి వస్తోందని ఎఫ్‌ఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పనిదినాలు కల్పించలేదనే కారణంగా 220 మంది ఎఫ్‌ఏలను సీనియర్ మేట్లగా నియమించారు. ప్రతి వారం ఎఫ్‌ఏలు డిమాండ్ క్యాప్చర్ అమలు చేయకపోతే వేతనాలు కట్ చేస్తున్నారు.
డిమాండ్ క్యాప్చర్ సిస్టమ్‌పై కూలీలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు చేసిన పనులను మూడు రోజుల్లో అప్‌లోడ్ చేయకపోతే ఏపీఓ, టీఏ, కంప్యూటర్ ఆపరేటర్లపై సీఆర్‌డీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్లాంటేషన్ పనులు అధికంగా జరుగుతున్నాయి. మొక్కలు నాటే ముందు రైతులకు దుక్కి, మొక్కల నగదు చెల్లించాల్సి ఉంది. పేమెంట్లు చెల్లించకపోవడంతో మొక్కలు నాటేందుకు రైతులు ముందుకు రావడం లేదు. గ్రామల్లో టేకు, నిమ్మ మొక్కలు సిద్ధం చేసినా రైతులు ముందుకు రావడం లేదు. కూలీలకు పనులు లభించడం లేదు.
ఉపాధి..ఎలాచేసేది!
Published Wed, Aug 28 2013 4:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement