
అయ్యో.. రొయ్య..!
పూండి: రొయ్యల సీజన్ మత్స్యకారునికి బోనస్ లాం టిది. చిన్నపాటి మత్స్యకారు డు సైతం రూ.50 వేలు వెనుకేసుకుంటాడు. ఈ ఏడాది రొయ్యల వేట మత్స్యకారుల ఆశలపై నీళ్లు చల్లింది. హుద్‌హుద్ తుపాను ప్రభావం, సముద్రం అంతర్భాగంలో చోటుచేసుకున్న మార్పులు మత్స్యకారులను దెబ్బతీశాయి. ఏటా కాస్తో కూస్తో అనుకూలించిన వేట ఈ ఏడాది పూర్తిగా మందగించింది. మత్స్యకారులకు నిరాశే ఎదురైంది. రొయ్యల వేట కోసం లక్షలాది రూపాయ లు ఖర్చు చేసి ప్రత్యేకంగా వలలు కొనుగోలు చేసినప్పటికీ ఆశించిన మేర చిక్కడంలేదు. దీంతో ఎగుమతులు పడిపోయాయి. వ్యాపారుల వద్ద చేసిన అప్పులు తీర్చలేక మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం నుంచి వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వరకు ఉన్న తీరప్రాంతం రొయ్య ల వేటకు అనుకూలం. భావనపాడులో అయితే అత్యధికంగా వేట సాగుతుంది. వందల కిలోల రొయలు వలలకు చిక్కేవి. టైగర్ రొయ్యలు చిక్కితే ఆ మత్స్యకారుల ఆనందానికి అంతే ఉండదు. ఎందుకంటే కిలో రూ.850 నుంచి 1000 ధర పలుకుతుంది కాబట్టి. టైగర్ రొయ్యలను విశాఖపట్నం, కేరళ, కోల్‌కత్తా, చెన్నై, బెంగుళూరు తదితర ప్రాంతాలకు తరలించి అత్యధికంగా లాభాలు ఆర్జించే వారు.
సంక్షోభమే...
గత మూడేళ్లగా రొయ్యల వేట ఎగుమతుల పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఈ ఏడాది తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయామని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ ఏడాది వ్యాపారం లేక వాహనాలకు కిరాయి కూడా చెల్లించుకోలేక పోయామని చెన్నై, కోల్‌కత్తా, కేరళకు చెందిన రొయ్యల వ్యాపారులు ముత్తు అళగర్, అరుణమణి వాపోయూరు. 2009 సంవత్సరంలో 14 టన్నులు, 2010లో 12 టన్నులు, 2011లో 15 టన్నులు, 2012లో 8 టన్నులు, 2013లో 5 టన్నుల రొయ్యలను కేరళకు ఎగుమతి చేశామని, అప్పట్లో మత్స్యకారులకు ఆశించిన మేర ధర కూడా లభించిందని వ్యాపారులు చెప్పారు.
నెల రోజుల కిందట నుంచి కనీసం 100 కిలోల రొయ్యలు కూడా వలలకు చిక్కలేదని, దీంతో మత్స్యకారులతో పాటు తమకు నష్టాలే ఎదురయ్యూయన్నారు. ఇటీవల అక్కుపల్లి, బావనపాడు, కొత్తపేట తీరంలో నెలంతా వేటకు వెళితే 50 కిలోల టైగర్, సాధారణ రొయ్యలు మాత్రమే వలకు చిక్కాయంటే మత్స్యకారులు వంక రాజు, కె. సింహాచలం, దానేసు, కొర్లయ్య తదితరులు ‘సాక్షి’ వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకృతి విపత్తులతో అన్ని విధాలా నష్టపోతున్నామంటూ ఆవేదన వెళ్లగక్కారు.