హుదూద్ నష్టం రూ.437.5 కోట్లు | Hudood loss of Rs .437.5 crore | Sakshi
Sakshi News home page

హుదూద్ నష్టం రూ.437.5 కోట్లు

Published Wed, Oct 22 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

హుదూద్ నష్టం రూ.437.5 కోట్లు

హుదూద్ నష్టం రూ.437.5 కోట్లు

 విజయనగరం కంటోన్మెంట్ :  హుదూద్ తుపాను పెను విధ్వంసమే కాదు పెను నష్టాన్నీ మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా అధికారులు ప్రాథమికంగా దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదించిన లెక్కల ప్రకారం నష్టపోయిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విలువ రూ.437.50 కోట్లుగా తేలింది. జిల్లాలోని పార్వతీపురం, విజయనగరం డివిజన్లలో విజయనగరం డివిజన్‌లోనే నష్టం ఎక్కువగా ఉంది. అందులోనూ విజయనగరం మున్సిపాలిటీలోనూ, తీర ప్రాంత మండలాల్లోనూ నష్టం అంచనాలు దాటిపోయింది. హుదూద్ తుపాను వర్షాలకు, ప్రచండ గాలులకు జిల్లా వ్యాప్తంగా 14 మంది మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 మండలాల్లో 12 తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. 22 మండలాల్లో పాక్షిక నష్టాలు కలిగాయి. జిల్లాలోని 928 పంచాయతీల్లో 411 గ్రామాలు పూర్తిగా నష్టపోగా, 1,140 పాక్షికంగా దెబ్బతిన్నాయి.
 
 రైతన్న కుదేలు...
 అన్నింటికన్నా ఎక్కువగా అన్నదాత నష్టపోయాడు. ఒకపక్క ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ కోసం ఎదురుచూస్తూ.. మరోపక్క అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టి రైతులు పంటల సాగు చేపట్టారు. తుపాను ప్రభావంతో జిల్లాలోని 28,297 హెక్టార్లలో పంట నష్టం కలిగిందని వ్యవసాయాధికారులు ధృవీకరించారు. మరో 20 హెక్టార్లలో ఇసుక మేటలు వేశాయి. ఉద్యాన పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 12,341.48 హెక్టార్లలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇందులో 5,405 హెక్టార్లలో అరటి, 3,256 హెక్టార్లలో కూరగాయలు, 157 హెక్టార్లలో బొప్పాయి, 963 హెక్టార్లలో జీడి, 55.48 హెక్టార్లలో మామిడి, 2,505 హెక్టార్లలో కొబ్బరి పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. మల్బరీ తదితర హెరీకల్చర్ పంటల నష్టం రూ.50 లక్షల మేర నష్టం వాటిల్లింది.
 
 భారీ సంఖ్యలో దెబ్బతిన్న ఇళ్లు...
 జిల్లా వ్యాప్తంగా 14,458 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో పక్కా, మిద్దె ఇళ్లు కూడా ఉన్నాయి. పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లతో ప్రజలు తీవ్ర అసౌకర్యాలను అనుభవిస్తున్నారు. 108 పశువులు మృత్యువాత పడగా 394 చిన్న దూడలు తుపాను ధాటికి మరణించాయి. 26 పశువైద్య కేంద్రాలకు నష్టం కలిగింది. రూ.7.95 కోట్ల విలువైన ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగింది. 484 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయి. 17 చోట్ల రహదారులకు గండ్లు ఏర్పడ్డాయి. ఆర్‌అండ్‌బీకి చెందిన 2,226 చెట్లు కూలిపోయాయి. ఆర్‌అండ్‌బీకి రూ.78.51 కోట్ల నష్టం వాటిల్లింది. 585  పంచాయతీరాజ్ రహదారులు దెబ్బతినగా, 943 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. 34 భవనాలు దెబ్బతిన్నాయి. మున్సిపాలిటీల్లో 36 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. ప్రాజెక్టులకూ తీవ్ర నష్టం జరిగింది. మైనర్ ఇరిగేషన్‌కు చెందిన 478, మీడియం ఇరిగేషన్‌కు చెందిన 291 సాగునీటి వనరులు దెబ్బతిన్నాయి.
 
 మత్స్యకారుల ఆస్తులు కూడా బాగా దెబ్బతిన్నాయి. 357 బోట్లు, వలలు సముద్రంలో కొట్టుకుపోయాయి. 352 వలలు, 118 బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 4 టన్నుల ఉప్పు కరిగిపోగా, 2 చేపలు ఎండబెట్టుకునే ప్లాట్‌ఫారాలు పాడయ్యాయి. 173 తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. చెరువుల్లో నిల్వ ఉంచిన 160 టన్నుల చేపలు కొట్టుకుపోయాయి. 74 పీహెచ్‌సీలు, ఏడు జిల్లా స్థాయి ఆస్పత్రులకు ఆర్థిక నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖకు చెందిన ఆస్తులు భారీగా దెబ్బతిన్నాయి. 9,516 విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. 506 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు శాఖల రిపోర్టులు ఇంకా ఇవ్వాల్సి ఉంది. అన్ని శాఖలకూ కలెక్టరేట్‌లోని అధికారులు ఒక ఫార్మాట్‌ను ఇస్తున్నారు. వాటి ఆధారంగా నష్టాలను అంచనా వేస్తున్నారు. ఇంకా పలు శాఖలకు చెందిన ఆస్తుల నష్టం వివరాలు రావాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement