
విజయవాడలోనూ భారీ వినాయకుడు
వినాయక చవితి వస్తుందంటే చాలు మనకు హైదరాబాద్‌లోని గణేష్ నిమజ్జనం సందడి గుర్తుకొస్తుంది.
ఖైరతాబాద్ తరహాలో 63 అడుగుల విగ్రహం
6,300 కిలోల తాపేశ్వరం లడ్డూ
ఖైరతాబాద్ విగ్రహ శిల్పుల ఆధ్వర్యంలోనే నిర్మాణ పనులు
విజయవాడ బ్యూరో : వినాయక చవితి వస్తుందంటే చాలు మనకు హైదరాబాద్‌లోని గణేష్ నిమజ్జనం సందడి గుర్తుకొస్తుంది. అందులోను ఖైరతాబాద్ వినాయకుడిది ప్రత్యేక స్థానం. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో ఖైరతాబాద్ తరహా రికార్డు స్థాయి వినాయకుడు ఉండేలా విజయవాడలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మూడేళ్లుగా విశాఖలోని గాజువాక సెంటర్‌లో భారీ వినాయకుడిని ఏర్పాటు చేసి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
అయితే రాజధాని ప్రాంతమైన విజయవాడలో అచ్చంగా ఖైరతాబాద్ వినాయకుడి తరహాలోనే భారీ పందిరి వేస్తున్నారు. విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల ఆవరణలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జూలై 12న చేపట్టిన వినాయకుడి విగ్రహ ప్రతిష్ట పనులు ఈ నెల 15న నాటికి పూర్తి అవుతాయని గణేష్ ఉత్సవ కమిటీ ఉపాధ్యాక్షుడు ఫణిరాజు తెలిపారు. ఈ విగ్రహాన్ని కూడా ఖైరతాబాద్ విగ్రహాన్ని తయారు చేస్తున్న చెన్నై శిల్పులే రూపొందిస్తుండటం విశేషం. నాట్య గణపతి భారీ విగ్రహం చుట్టూ అష్టలక్ష్మిదేవి విగ్రహాలను తీర్చిదిద్దనున్నారు.
విగ్రహాల తయారీకే సుమారు రూ.55 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఖైరతాబాద్ వినాయక విగ్రహానికి లడ్డూ అందిస్తున్న తాపేశ్వరం సురుచి స్వీట్స్ వారే విజయవాడ విఘ్నేశ్వరుడికి 6,300కిలోల లడ్డూ ప్రసాదం తయారు చేయనున్నారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న గణపతి విగ్రహం 63 అడుగులు ఎత్తు ఉంటుంది, అయితే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం మాదిరిగా ఇక్కడ విఘ్నేశ్వరుడిని ఊరేగించకుండా ప్రతిష్టించిన చోటనే నిమజ్జనం చేయనున్నారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించి ఈ నెల 27వ తేదీన ఉన్న చోటనే నీటి యంత్రాలతో నిమజ్జనం చేయనున్నారు.