సాక్షి, రంగారెడ్డి జిల్లా : వరుసగా కురుస్తున్న వర్షాలు జిల్లా రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు కొంత ఆలస్యం కావడంతో సాగు పనులు సైతం జాప్యమయ్యాయి. దీంతో జిల్లాలో సీజన్ ముగిసిన తర్వాత దిగుబడులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో చాలాచోట్ల పంటలు చేతికొచ్చే స్థితిలో ఉండగా.. మంగళవారం నుంచి కురుస్తున్న వ ర్షాలు దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపాయి. మరో వారం రోజుల్లో కోతకు రానున్న వరి పంట తాజా వర్షాల ధాటికి నీటమునిగింది.
ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో ఓ రైతు వరి పొలంలో పైరుపైనే మొలకలు వచ్చాయి. శంషాబాద్ మండలంలో మొక్కజొన్న దిగుబడులను పొలాల వద్ద ఆరబెట్టగా.. ఎడతెరిపిలేని వర్షాలతో ఆరబెట్టిన చోటే మొలకలు రావడంతో రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు పత్తి రైతు పరిస్థితి దీనంగా మారింది. వర్షాలకు పత్తి తడిసి ముద్ద కావడంతో దిగుబడులపై ఆశలు వదులుకుంటున్నారు.
మురిపించి.. ముంచెత్తి..
ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగానైనా ఆశించిన మేరకు కురిసిన వర్షాలు రైతుల్ని మురిపించాయి. దీంతో రైతులు ఉత్సాహంగా సాగు పనులు చేపట్టారు. సాధారణ స్థాయి కంటే ఎక్కువ విస్తీర్ణంలో వివిధ పంటలు సాగయ్యాయి. 21,055 హెక్టార్లలో వరి సాగవ్వగా, 46,313 హెక్టార్లలో మొక్కజొన్న, 55,035 హెక్టార్లలో పత్తి పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం వీటిలో చాలావరకు చేతికొచ్చే దశలో ఉన్నాయి. అయితే ప్రస్తుత వర్షాలు దిగుబడిపై పెను ప్రభావాన్నే చూపిస్తున్నాయి. అయితే గురువారం సాయంత్రం నాటికి ఎలాంటి నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయ్‌కుమార్ పేర్కొనడం గమనార్హం.
4.2 సెంటీమీటర్ల వర్షం..
తుపాను ప్రభావంతో మూడు రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం జిల్లాలో 4.2సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇందులో అధికంగా చేవెళ్ల మండలంలో 9.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అత్యల్పంగా గండేడ్ మండలంలో 0.6 సెం. మీ వర్షం కురిసింది. అయితే గురువారం కలెక్టర్ బి.శ్రీధర్‌కు సమర్పించిన నివేదికలో జిల్లా ప్రణాళిక శాఖ అధికారి బాలకృష్ణ అసలు వర్షమే లేనట్లుగా జిల్లా సగటు వర్షపాతం ‘0.0’గా వివరాలు ఇవ్వడం కొసమెరుపు.