వర్షం.. హర్షం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెండురోజుల పాటు కురిసిన వర్షం వేలాది ఎకరాల్లో సాగవుతున్న పంటలకు ఊపిరిపోసింది. రైతులకు ఆనందాన్నిచ్చింది. అయితే మూడు మండలాల పరిధిలోని నారుమళ్లు, వరి నాట్లు మునకకు గురయ్యాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు సాగు చేద్దామా? వద్దా? అనే అనుమానంతో ఉన్న రైతులు కాడిని కదిలించారు. పంటలు వేసేందుకు దుక్కులు చేయటంలో నిమగ్నమయ్యారు. కనిగిరి రిజర్వాయర్‌కు ఒక టీఎంసీ నీరు చేరింది.
సోమశిల జలాశయం ఆయకట్టు రైతులు ఇప్పటికే పంటలు సాగుచేసి ఉన్నారు. రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులకు నీరు చేరుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేస్తారు. అయితే వర్షాభావ పరిస్థితుల కారణంగా లక్షల ఎకరాల్లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం కురిసిన వర్షంతో వరి నారుమళ్లు సిద్ధం చేసుకున్న రైతులు నాట్లు వేసుకునేందుకు దుక్కులు చేయటంలో నిమగ్నమయ్యారు. ఉదయగిరి నియోజకవర్గం మినహా వర్షాధారంపై ఆధారపడ్డ ప్రాంతాల్లో సాగవుతున్న ఆరుతడి పంటలకు ఊపిరొచ్చింది.
ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో సుమారు 12వేల హెక్టార్లలో మినుము సాగుచేశారు. వర్షం లేకపోవటంతో వరికి బదులు ఈ పంటను సాగుచేశారు. పంట చేతికి రాదని భావించే సమయంలో ఈ వర్షం ఆ ప్రాంత రైతులకు ఊరటనిచ్చింది. కోట్ల రూపాయల పెట్టుబడి చేతికొస్తుందన్న నమ్మకం వచ్చింది. అదేవిధంగా సర్వేపల్లి పరిధిలోని ఆక్వా రైతులు, గూడూరు పరిధిలోని నిమ్మ రైతులకు ఈ వర్షం ఉపయోగపడింది. కావలి పరిధిలో 50 శాతం పంటలు సాగు చేస్తుండగా.. మిగిలిన వారు ఈ వర్షంతో వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆత్మకూరు పరిధిలో పొగాకు, వరి పంటకు మేలుచేసింది. ఈ వర్షంతో గ్రామాల్లో రైతులంతా కాడికి పనిచెప్పారు. పొలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు.
నీట మునిగిన పంట
బుచ్చిరెడ్డిపాళెం, విడవలూరు, కొడవలూరు, దగదర్తి, సంగం మండలాల పరిధిలో సుమారు 12వేల ఎకరాల్లో సాగవుతున్న వరి పంట ముంపునకు గురైంది. కొడవలూరులో 5 వేలు, బుచ్చిరెడ్డి పాళెం 3వేలు, విడవలూరులో 2 వేలు, సంగం మండల పరిధిలో వెయ్యి ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు.