
అవమానించారు
కడప ఎడ్యుకేషన్: ఎంపీడీవో బదిలీలను నిలిపివేయాలంటూ వచ్చిన జీవో విషయంపై సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రమణను కలిసి మాట్లాడేందుకు వెళ్లగా కనీస మర్యాద కూడా ఇవ్వలేదని జెడ్పీ చైర్మన్ గూడురు రవి ఆవేదన వ్యక్తం చేశారు. తాను దళితుడిని కావడం వల్లే అవమానించారని ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా ప్రథమ పౌరుడిగా, జెడ్పీ చెర్మైన్ హోదాలో తాను కలెక్టర్‌ను కలిసేందుకు బంగ్లాకు వెళితే కనీసం కూర్చోమని కూడా అనలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలచేత ఎన్నికైన తనకే కలెక్టర్ మర్యాద ఇవ్వకుంటే సామాన్య ప్రజలకు ఏం మర్యాద ఇస్తారన్నారు. బదిలీల విషయంలో సీపీఆర్ నుంచి వచ్చిన కాపీని కలెక్టర్‌కు చూపించేందుకు వెళితే దానిని చూడాల్సిన అవసరం లేదులే.. అనినిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలిపారు.
ప్రభుత్వం నుంచి ఆర్డ్‌ర్ కాపీ సోమవారం సాయంత్రం 3 గంటలకు వస్తే కలెక్టర్ మాత్రం జిల్లాలోని ఎంపీడీవోలకు విధుల్లో చేరవద్దని సోమవారం ఉదయం 6 గంటలకే మెసేజ్ పెట్టారన్నారు. ప్రభుత్వం నుంచి ఆర్డర్ వచ్చే విషయం ఆయనకు ముందే తెలుసేమోనని అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే కలెక్టర్ టీడీపీకి అండగా ఉంటున్నాడనే విషయం అర్థమవుతోందన్నారు.
ఆ జీవో వైఎస్సార్ జిల్లాకే వర్తిస్తుందా:
రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే ఒక్క వైఎస్సార్ జిల్లాలోనే నేటివ్ డివిజన్ బదిలీలు నిర్వహించామా ఇతర ఏ జిల్లాల్లో నిర్వహించలేదా అని జెడ్పీ చెర్మైన్ గూడూరు రవి, వైస్ చెర్మైన్ ఇరగంరెడి ్డసుబ్బారెడ్డి ప్రశ్నించారు. వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 26 ఎంపీడీవోలకు సంబంధించి బదిలీలు నిర్వహిస్తే అందులో 17 మందివి అధికార పార్టీకి అనుకూలంగానే జరిగాయన్నారు.
మిగతా తొమ్మిది కూడా తమకు అనుకూలంగా జరపలేదని రాజంపేటకు చెందిన ఓ ప్రముఖ టీడీపీ నాయకుడు మరో నాయకుడితో కలిసి ఈపనికి ఒడిగట్టారన్నారు. బదిలీల విషయంలో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే తాము దేనికైనా సిద్ధమని వారు సవాల్ విసిరారు.
ఆగిన ఎంపీడీవోల బదిలీలు:
జిల్లాలో ఎంపీడీవోల బదిలీలు ఆగిపోయాయి. ఈనెల 12వ తేదీన ఎంపీడీవోలకు సంబంధించిన బదిలీలు జెడ్పీ చెర్మైన్ ఛాంబర్‌లో నిర్వహించారు. ఈనెల 22వ తేదీ రాత్రి పొద్దుపోయాక ఎంపీడీవోలను బదిలీ చేస్తూ జాబితా ప్రకటించారు. వారు 24వతేదీన విధుల్లో చేరాల్సి ఉంది.
ఇంతలోనే ఐదుగురు ఎంపీడీవోలకు సొంత డివిజన్‌లో పోస్టింగులు ఇచ్చారని ఇది నిబంధనలకు విరుద్ధమని ఈ బదిలీలను ఆపాలని సీపీఆర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. జెడ్పీ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి డబ్బులు, వస్తువులను స్వీకరించారంటూ ఫిర్యాదు అందటంతో బదిలీలను నిలిపివేస్తూ ఉత్తర్వులను ఇచ్చారు. దీంతో కథ మొదటికి వచ్చింది.