
సాక్షి, అమరావతి/శాఖమూరు (తుళ్లూరు రూరల్): రాష్ట్రం విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా తన పుట్టిన రోజైన ఈ నెల 20న నిరాహార దీక్ష చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలం శాఖమూరులో బాబాసాహెబ్ అంబేడ్కర్ 127వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పామని, ఇప్పుడూ తిప్పుతామని చెప్పారు. నమ్మక ద్రోహం, కుట్రల నుంచి కాపాడుకుందాం అనే నినాదంతో ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి లేదని అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందన్నారు.