మృతి చెందిన శ్రీరామ్ రెడ్డి
మైదుకూరు రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యకు వైద్యం చేయించలేని నిస్సహాయ స్థితిలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మైదుకూరు మండలం పోతిరెడ్డిపల్లె గ్రామంలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మూలె శ్రీరామ్‌రెడ్డి (59) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలో అతని భార్య రాములమ్మకు క్యాన్సర్ వ్యాధి రావడంతో నాలుగేళ్ల క్రితం రూ.4 లక్షలు అప్పు చేసి వైద్యం చేయించాడు. అయినా వ్యాధి తగ్గకపోవడంతో గురువారం చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సి ఉండింది. మళ్లీ లక్షలు అప్పు చేసి వైద్యం చేయించే స్థోమత లేక.. ముందు చేసిన అప్పులే తీర్చలేక తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఈ పరిస్థితిలో మంగళవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లి నీటిలో విషపు గుళికలు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి భార్య కన్నీరు మున్నీరవుతుంటే ప్రతి ఒక్కరూ కంట తడిపెట్టారు. మృతుడికి భార్యతో పాటు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉండగా, వీరిలో ఇద్దరు కుమారులు, కూతురికి వివాహమైంది. మూడో కుమారుడు రామమోహన్‌రెడ్డి వ్యవసాయంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు.
Comments
Please login to add a commentAdd a comment