‘మగబిడ్డతో వస్తేనే ఇంట్లోకి’ | husband does not allow the wife into home for a baby | Sakshi
Sakshi News home page

‘మగబిడ్డతో వస్తేనే ఇంట్లోకి’

Published Tue, Jul 25 2017 9:07 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

‘మగబిడ్డతో వస్తేనే ఇంట్లోకి’ - Sakshi

‘మగబిడ్డతో వస్తేనే ఇంట్లోకి’

► ఆడబిడ్డతో మెట్టినింటికి వచ్చిన మహిళను గెంటేసిన వైనం 
► చంటి బిడ్డతో గుమ్మం వద్దే అర్ధరాత్రి వరకు నిరీక్షణ
 
ఆలూరు: పుట్టింట్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి ఐదు నెలల తర్వాత సంతోషంగా అత్తారింటికి వచ్చిన ఓ మహిళకు అక్కడ చీత్కారం ఎదురైంది. మగబిడ్డపై ఆశతో ఉన్న అత్తారింటివారు ఆడ శిశువుతో వచ్చి న కోడలిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన హొళగుంద మండలం సులువాయి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఆలూరుకు చెందిన హోటల్‌ పరమేశప్ప మూడో కుమార్తె మమతను హొళగుంద మండలం సులువాయికి చెందిన కురుబ నరసప్ప రెండోకుమారుడు గాదిలింగప్పకు ఇచ్చి పెళ్లి చేశారు.  

పెళ్లి సమయంలో కట్నం కింద రూ. 60వేల నగదు, 6 తులాల బంగారం ఇచ్చారు. మమత గర్భం దాల్చడంతో డెలివరీ కోసం ఐదు నెలల క్రితం పుట్టినింటికి వచ్చింది. అక్కడే ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఐదు నెలలు పూర్తి కావడంతో తండ్రి పరమేశప్ప, అతని వదిన సుశీలమ్మతో కలసి కూతురు మమతను సోమవారం అత్తారింటికి తీసుకెళ్లాడు. సాయంత్రం 4 గంటల సమయంలో వెళ్లిన వారికి అత్తారింటి నుంచి వాదన మొదలైంది. మగబిడ్డను కని ఇంటికి వస్తావనుకుంటే ఆడబిడ్డతో వస్తావా అంటూ (భర్త గాదిలింగప్ప ఇంట్లో లేడు) బావ(భర్త అన్న) మంజునాథ్, అతని భార్య రాజేశ్వరి మమతను చంటిబిడ్డతో సహా గెంటేశారు.

అత్త విశాలాక్షి ఇంట్లోనే ఉండిపోయింది. ఎంత ప్రతిఘటించినా ఫలితం లేకపోవడంతో మమత బిడ్డతో సహా గుమ్మం వద్దే ఉండిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో తండ్రి పరమేశప్ప హొళగుంద పోలీసులను ఆశ్రయించాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ బీరప్ప, కానిస్టేబుల్‌ జనార్ధన్‌ గ్రామానికి చేరుకుని విచారించారు. అయితే ఎంత పిలిచినా వారు తలుపు తీయకపోవడంతోపాటు మమతను ఇంట్లోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత పరమేశప్ప, ఆయన కుమారుడు మమతను తీసుకుని పోలీసుల సహాయంతో ఆలూరు చేరుకున్నారు. బాధితురాలి ∙ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement