సాక్షి, పత్తికొండ రూరల్ (కర్నూలు): అనారోగ్యంతో చనిపోయిన భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన ఉదంతమిది. ఈ హృదయ విదారక ఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ మురళీమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పత్తికొండలోని తేరు బజారులో మెడికల్ షాపు నిర్వహిస్తున్న హరికృష్ణప్రసాద్ (63)కు భార్య లలితమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కన్నబిడ్డలకు ఎలాంటి లోటులేకుండా పెంచిపెద్ద చేసి ఉన్నత చదువులు చదివించారు. ఇద్దరికీ పెళ్లిళ్లు కూడా చేశారు.
పెద్ద కుమారుడు దినేష్ ఎంబీబీఎస్ పూర్తి చేసి కర్నూలులోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తూ అక్కడే భార్యతో కాపురం ఉంటున్నారు. రెండో కుమారుడు ముఖేష్ కెనడాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. పదేళ్ల కిందట హరికృష్ణ ప్రసాద్‌కు పార్కిన్‌సస్ ప్లస్ వ్యాధి సోకింది. మరికొన్ని రోజులకు పక్షవాతంతో కాళ్లు చేతులు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమయ్యాడు. కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని దయనీయ స్థితిలో ఉన్న అతనికి భార్య లలితమ్మ సపర్యలు చేస్తూ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మూడేళ్ల నుంచి కర్నూలులో కుమారుడు దినేష్ వద్దే దంపతులిద్దరూ ఉన్నారు. రెండు వారాల క్రితం ఇద్దరూ పత్తికొండకు చేరుకున్నారు.
కాగితాలు.. చీరలు వేసి నిప్పు
కాగా, సోమవారం వేకువజామున భర్త హరికృష్ణప్రసాద్‌కు భార్య లలితమ్మ కాలకృత్యాలు తీర్చింది. ఆ తరువాత కొద్దిసేపటికి విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి గుండె పగిలేలా రోదించింది. ఆ తరువాత తేరుకుని టెంకాయ కొట్టి.. మృతదేహంపై ఇంట్లోని పుస్తకాలు చింపి కాగితాలు, చీరలు వేసి నిప్పు పెట్టింది. ఆ తరువాత పెద్దకుమారుడు దినేష్‌కు వీడియో కాల్ చేసి విషయం చెప్పింది.
ఆ ఇంట్లోంచి పొగలు రావడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. సీఐ మురళీమోహన్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకోగా.. అప్పటికే మృతదేహం పూర్తిగా కాలిపోయింది. లలితమ్మ మానసిక పరిస్థితి సరిగా లేదని సీఐ తెలిపారు. ఇంట్లోనే మృతదేహం కాల్చిన ఘటన దావానలంలా వ్యాపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కంటికిరెప్పలా కాపాడుకుంటూ ఇన్నేళ్లు సపర్యలు చేసిన ఆమె భర్త మృతదేహాన్ని ఇంట్లోనే కాలి్చవేసిందంటే నమ్మలేకపోయారు. లలితమ్మ నిత్యం దైవారాధనలో ఎక్కువగా గడిపేదని కాలనీవాసులు తెలిపారు.
నోట మాట రాలేదు
అమ్మ ఉదయం 9.30 గంటలకు ఫోన్ చేసింది. ‘నాన్న చనిపోయాడు. ఇంట్లోనే దహన సంస్కారాలన్నీ పూర్తి చేశాను. మీరేం రాకండి’ అని చెప్పింది. ఆ మాట విని షాక్‌కు గురయ్యాను. వెంటనే పోలీసులకు సమాచారం అందజేసి పత్తికొండ చేరుకున్నాను. ఇంట్లోకి వెళ్లగా కాలిన నాన్న మృతదేహం చూసి నా నోట మాట రాలేదు. అమ్మ పూర్తిగా డిప్రెషన్‌కు గురైంది. అమ్మ దగ్గరకు వెళ్లి ఓదార్చాను. కెనడాలో ఉన్న తమ్ముడు ముఖేష్‌కు ఫోన్ చేశాను. వెంటనే బయల్దేరి వస్తున్నానని చెప్పాడు.
– దినేష్, పెద్ద కుమారుడు
Comments
Please login to add a commentAdd a comment