
చినగంజాం: భార్యను కొట్టి చంపి అనారోగ్యంతో చనిపోయిందని బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడో భర్త. పోలీసులందించిన సమాచారం ప్రకారం.. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ రాంచంద్రనగర్ గ్రామానికి చెందిన కొక్కిలగడ్డ శ్రావణి అలియాస్ లక్ష్మి అలియాస్ భారతి (25)ని ఆమె భర్త శివకృష్ణ దారుణంగా కొట్టి చంపి అనారోగ్యంతో చనిపోయిందని బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు. రాంచంద్రనగర్‌కు చెందిన కొక్కిలగడ్డ ఏసురత్నం కుమారుడు శివకృష్ణకు ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన రాసాని శ్రీను, మస్తానమ్మల మొదటి సంతానం శ్రావణితో ఐదేళ్ల క్రితం వివాహమైంది.
వారికి నాలుగేళ్ల పాప కూడా ఉంది. శివకృష్ణ వృత్తిరీత్యా బేల్దారీ కాగా హైదరాబాద్‌లోని సిద్ధిపేట ఎర్రచెరువు ఎల్లమ్మ గుడి వద్ద తన తండ్రి ఏసురత్నం, లక్ష్మిలతో కలిసి అక్కడే బేల్దారి పనులు చేసుకుంటూ ఏడాదిగా నివాసముంటున్నాడు. శనివారం అకస్మాత్తుగా భార్య శవాన్ని తీసుకొని రాంచంద్రనగర్ వచ్చాడు. తన భార్య అనారోగ్యం కారణంగా చనిపోయిందని బంధువులకు సమాచారం ఇచ్చాడు. మృతురాలి శరీరంపై అనుమానాస్పదంగా గాయాలు ఉండటంతో ఆమె తరపు బంధువులు శివకృష్ణను నిలదీసి నాలుగు తగిలించారు.
నిజం ఒప్పుకున్న శివకృష్ణ తానే చంపినట్లు అంగీకరించాడు. అతడి కథనం ప్రకారం.. శుక్రవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య కణతపై గట్టిగా కొట్టడం, ఆ సమయంలో ఆమె స్పృహ తప్పి పడిపోవడం, అనంతరం చీరతో ఉరేసి చంపాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చినట్లు వివరించాడు. అనంతరం మృతురాలి బంధువులు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మృతదేహాన్ని పరిశీలించిన సీఐ
మృతురాలి తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఆవుల వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని ఇంకొల్లు సీఐ ఎం. శేషగిరిరావు పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదికను సిద్ధిపేట పరిధిలోని పోలీసుస్టేషన్‌కు బదిలీ చేయనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment