Husband Kills Wife With Help Of Brother And Sister In Law Over Marital Affair In Nizamabad - Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. అన్నావదినల సాయంతో

Published Wed, Dec 28 2022 1:46 PM | Last Updated on Wed, Dec 28 2022 5:57 PM

Husband Kills Wife With Help Of Brother And Sister In law Over Affair - Sakshi

ఫైల్‌ఫోటో

సాక్షి, నిజామాబాద్‌/సంగారెడ్డి:  వివాహేతన సంబంధానికి భార్య అడ్డుగా ఉందన్న నెపంతో అన్నావదినల సహకారంతో భార్యను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు ఓ భర్త. మంగళవారం పటాన్‌చెరు పీఎస్‌లో సీఐ వేణు గోపాల్‌ రెడ్డి వివరాలను వెల్లడించారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారే గాం గ్రామానికి చెందిన బేగరి లక్ష్మణ్‌కు మేనమామ కూతురు యశోద(34)తో వివాహం జరిగింది. కాగా ఐదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం లక్ష్మణ్‌ భార్యతో కలసి పటాన్‌చెరు మండల ఇస్నాపూర్‌ వచ్చాడు. భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు.

లక్ష్మణ్‌ అన్న సాయిలు, వదిన నాగమణి కూడా ఇస్నాపూర్‌లోనే ఉంటారు. లక్ష్మణ్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో భార్యతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నవంబర్‌ 3వ తేదీ అర్ధరాత్రి భార్య యశోద గొంతు నులిమి హత్యచేశాడు. అన్న సాయిలు, వదిన నాగమణి సహకారంతో ఆత్మహత్యగా చిత్రీకరించి పటాన్‌చెరు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే స్వగ్రామానికి యశోద మృతదేహాన్ని తరలించాడు.

కాగా మృతురాలి తండ్రి యమన్, కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పరిశీలించగా, గొంతుపై గాట్లు ఉండటంతో అనుమానంతో పిట్లం పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పిట్లం పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. నవంబర్‌ 5వ తేదీన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌కు కేసు బదలాయించారు. రెండు రోజుల క్రితం వచ్చిన పోస్టుమార్టం నివేదికలో యశోద  మృతి హత్య అని తేలడంతో పోలీసులు సోమవారం మధ్యాహ్నం కారేగాంలో ఉన్న భర్త లక్ష్మణ్, అతడి సోదరుడు సాయిలు, వదిన నాగమణిని అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చేసినట్లుగా నిందితులు తెలిపారు. హత్య చేసి ఆధారాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినందుకు పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో క్రైం సీఐ బీసన్న, ఎస్సైలు రామానాయుడు, ప్రసాద్‌ రావు, ఏఎస్‌ఐ సురేందర్‌ రెడ్డి తదితరులున్నారు.
చదవండి: పెళ్లయి రెండేళ్లయినా సంతానం కలగలేదని.. భార్యపై..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement