మీ పని తీరులో ‘మార్పు’ రావాలి
అనంతపురం మెడికల్: ‘ఒక మంచి ప్రయోజనాన్ని ఆశించి చేపట్టే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి సత్ఫలితాన్ని సాధించాలంటే అందుకు తగ్గట్టుగా మన పనితీరు ఉండాలి. మాతా శిశు మరణాల శాతం తగ్గించేందుకు చేపట్టిన ‘మార్పు’ కార్యక్రమం విషయంలో ఇది కనిపిం చడం లేదు. ముందుగా మన పనితీరు మారితేనే ‘మార్పు’ ఉద్దేశం ఫలిస్తుంది.’ అని అధికారులకు, సిబ్బందికి కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్ ఉద్బోధ చేశారు. ‘మార్పు’ కార్యక్రమంపై రెవెన్యూ భవన్‌లో ఆదివారం ఐకేపీ పీడీ నీలకంఠారెడ్డి, అదనపు జిల్లా ఆరోగ్య వైద్యాధికారి వెంకటరమణ, డీఆర్‌డీఏ పీడీ నీలకంఠారెడ్డి, డీసీహెచ్‌ఎస్ రామకృష్ణారావుతో కలిసి సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో మాతా శిశు మరణాల వివరాల సేకరణలో విఫలం చెందారని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాతాశిశు మరణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నది ‘మార్పు’ ప్రధాన ఉద్దేశమన్నారు. దీనిని ప్రజల్లో తీసుకెళ్లడంలో విఫలమయ్యారన్నారు. గత ఏడాది జిల్లా వ్యా ప్తంగా 72 వేల జననాలు జరిగితే.. తల్లులు 117 మంది, శిశువులు 552 మంది చనిపోయినట్లు ఇచ్చిన సంఖ్య వాస్తవం కాదనేది స్పష్టమవుతోందన్నారు. ఏదో ఒక సంఖ్య ఇస్తే సరిపోతుందనే విధంగా మీ నివేదిక కనిపిస్తోందన్నారు. ఎంత మంది చనిపోయారనే వివరాలు మీ వద్ద ఉన్నాయా..? మీరిచ్చిన గణాంకాలు కరెక్టేనని ఎవరైనా చెప్పగలరా? అని కలెక్టర్ అడిగిన ప్రశ్నకు ఎవ్వరి నుంచి సమాధానం రాలేదు. ఇకపై అలా జరగకూడదని చెప్పారు. అంకిత భావంతో పనిచే సి మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించాలని, నిర్దేశించుకున్న లక్ష్యం సాధించాలని సూచించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో జననాలు సంఖ్య తక్కువగా ఉంది..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు 30 శాతం మించి లేదనేది స్పష్టమవుతోందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సాధారణ కాన్పునకు కూడా సిజేరియన్ చేసి రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఫీజు వసూలు చేసే పరిస్థితి ఉందన్నారు.
దీనివల్ల పేదవారు ఆర్థిక ఇబ్బందులకు గురవుతారన్నారు. ఇకపై అందరూ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా కృషి చేయాలన్నారు. ప్రతి కేంద్రంలో ప్రతి నెలా 20 కాన్పులు తప్పకుండా జరిగేలా చూడాలన్నారు.
నెలలో 3వ శుక్రవారం సమావేశం నిర్వహించుకోండి
మార్పు కార్యక్రమంపై ప్రతి నెలా 3వ శనివారం ‘మార్పు’ కార్యక్రమంపై సమావేశం నిర్వహించుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మీ సమావేశం తరువాత ఒకటి రెండు రోజుల్లో జిల్లా స్థాయిలో తాను సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఈ దఫా సమావేశానికి వచ్చేప్పుడు కచ్చితమైన వివరాలతో రావాలన్నారు. ఒక తల్లి లేదా బిడ్డ చనిపోతే అందుకుగల కారణాలు తప్పక నమోదు చేయాలన్నారు. ‘మార్పు’ కింద సేకరించాల్సిన సమాచారానికి సంబంధించి ఒక ఫార్మెట్‌ను డీఆర్‌డీఏ అధికారులు ఇస్తారని, ఆ ప్రకారం పూర్తి సమాచారం సేకరించాలని చెప్పారు. నివేదికలు తప్పుగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్యులు, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.