అనంతపురం కల్చరల్: ‘మహిళ ఒక శక్తి స్వరూపిణి. ఆమె అనుకుంటే సాధించలేనిదేదీ లేదు. మహిళతోనే జగతికి వెలుగు వస్తుంద’ని వక్తలు అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అడిషనల్ జాయింట్ కలెక్టర్ (ఏజేసీ) ఖాజా మొహిద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నగర మేయర్ స్వరూప, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖరబాబు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తోందన్నారు. మహిళలలో మరింత చైతన్యం రావాలన్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగని, మహిళా అక్షరాస్యత పెరగాలని ఆకాంక్షించారు.
మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లను 33 నుంచి 50 శాతానికి పెంచాల్సిన అవసరముందన్నారు. కలెక్టర్ శశిధర్ మాట్లాడుతూ ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందన్నారు. ఏ రంగంలో చూసినా మహిళలు పురుషులకు తీసిపోరన్నారు. దేశాభివృద్ధిలో వారి పాత్ర కీలకమని ప్రశంసించారు.
మహిళల ప్రతిభకు తగిన గుర్తింపు లభించేలా ప్రతి ఒక్కరూ చూడాలన్నారు. దేశంలో 65 శాతం, రాష్ట్రంలో 59 శాతం మాత్రమే మహిళా అక్షరాస్యత ఉందని తెలిపారు. మహిళలు వంద శాతం అక్షరాస్యులుగా మారినప్పుడే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ ప్రాం తాలలో మహిళలు ఆత్మగౌరవం చంపుకుని బహిర్భూమికి వెళుతుండడం మనమంతా సిగ్గుపడాల్సిన విషయమన్నారు. కావున ప్రతిఇంట్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు.
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే మహిళలకు ఎటువంటి ఛీత్కారాలు, అగౌరవం లేకుండా ప్రవర్తించాలని ఉద్యోగులకు సూచించారు. ఎస్పీ రాజశేఖరబాబు మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం తాము ముందుంటామన్నారు. మహిళా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేసి డీఎస్పీలను నియమించామని, ఎటువంటి సమస్యలొచ్చినా కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సమాజంలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతుండడం విచారకరమన్నారు.
జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ అభివృద్ధికి మూలం విద్య అని, అందరూ చదువుకోవాలని సూచించారు. నవసమాజ నిర్మాణంలో స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా నేపాల్‌లో మాత్రమే అత్యధికంగా మహిళా ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. మన దేశంలో 27 శాతం మాత్రమే ఉండడం విచారకరమన్నారు. మహిళా సాధికారత, స్వావలంబన ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతున్నారన్నారు. అనంతరం వివిధ రంగాలలో కృషి చేసిన సామాజిక కార్యకర్తలకు జ్ఞాపికలందించారు. కాంతమ్మ, డాక్టర్ ప్రసూన, పుష్పవతి, డాక్టర్ షంషాద్‌బేగం తదితరులు జ్ఞాపికలు అందుకున్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ విజయకృష్ణన్, సిరికల్చర్ జేడీ అరుణకుమారి, లీగల్ సెక్రటరీ సుబ్బారావు, డీఎంహెచ్‌వో ప్రభుదాస్, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశం, అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ నాగవేణి, ఐసీడీఎస్ ఏపీడీ సుగుణ తదితరులు పాల్గొన్నారు.
మహిళే జగతికి వెలుగు
Published Mon, Mar 9 2015 3:22 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement