తాగునీరే.. సాగుకు లేదు! | iab meeting in anantapur | Sakshi
Sakshi News home page

తాగునీరే.. సాగుకు లేదు!

Published Wed, Aug 30 2017 10:57 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

తాగునీరే.. సాగుకు లేదు! - Sakshi

తాగునీరే.. సాగుకు లేదు!

ఐఏబీ సమావేశంలో స్పష్టం చేసిన మంత్రులు, అధికారులు
– టీబీ డ్యాంలో ప్రస్తుత నీటి నిల్వ 64 టీఎంసీలు
- హెచ్చెల్సీ కోటా 9.8 టీఎంసీలు
– అనంత, కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల తాగునీటి అవసరాలకు 10టీఎంసీలు
– ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉండటంతో డ్యాంలో నీటిలభ్యత పెరిగే అవకాశం
– అదే జరిగితే 12 టీఎంసీల వరకూ అందే అవకాశం
– ఆయా ప్రాంతాల తాగు, సాగునీటి అవసరాలను ప్రస్తావించిన మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు


సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘తుంగభద్రడ్యాంలో ప్రస్తుతం 64 టీఎంసీల నీరు ఉంది. ఏపీకి దామాషా ప్రకారం 9.8 టీఎంసీలు కేటాయించారు. ఆ నీటిని పూర్తిగా తాగునీటికే వినియోగిస్తాం. ప్రస్తుతం డ్యాంలో ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉంది. మంచి వర్షాలు కురిసి, డ్యాంలో నీటి లభ్యత పెరిగితే సాగునీటి గురించి తర్వాత ఆలోచిస్తాం’ అని జిల్లా ఇన్‌చార్జ్‌మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో బుధవారం ఐఏబీ (నీటిపారుదల సలహా మండలి) సమావేశం నిర్వహించారు. మంత్రులు దేవినేని, కాలవ శ్రీనివాసులుతో పాటు అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో నీరు : ఎస్‌ఈ
టీబీడ్యాంలో నీటిలభ్యత, హెచ్చెల్సీ కోటా, తాగు, సాగునీటి అవసరాలు, ప్రాధాన్యతలను హెచ్చెల్సీ ఎస్‌ఈ శేషగిరిరావు వివరించారు. ఏటా తుంగభద్ర నుంచి వచ్చే నీటిని ఎగువ ప్రాంతంలోని ఆయకట్టుకు ఇస్తూ దిగువన ఉన్న పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్‌లకు కూడా ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. అయితే ఈ ఏడాది డ్యాంలో నీటిలభ్యత తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం డ్యాంలో 64 టీఎంసీలు ఉన్నాయని, ఇందులో హెచ్చెల్సీ వాటాను 9.8 టీఎంసీలుగా టీబీ బోర్డు నిర్ణయించిందన్నారు. అయితే హెచ్చెల్సీ పరిధిలో తాగునీటి అవసరాలకే 10 టీఎంసీల నీరు అవసరమన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన సమీక్షలో హెచ్చెల్సీకి ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిలో నీరిస్తామని టీబీబోర్డు స్పష్టం చేసిందన్నారు.

20 రోజులు ఆన్, 10 రోజులు ఆఫ్‌ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామన్నారని వివరించారు. టీబీడ్యాం నుంచి ఎంపీఆర్‌కు నీరు చేరాలంటే కనీసం 30 రోజులు పడుతుందన్నారు. 20 రోజులు విడుదల చేసి పదిరోజులు నీటి విడుదల ఆగిపోతే నీరు చేరదన్నారు. అందుకే మొదటి 30 రోజులు నీటిని విడుదల చేసి, ఆపై 10 రోజులు కావాలంటే ‘ఆఫ్‌ పద్ధతి’లో కర్ణాటకకు వినియోగించుకోవాలని తెలిపామన్నారు. ఇలా కాకుండా దామాషా ప్రకారం నిరాటకంగా నీరు విడుదల చేస్తే 1100 క్యూసెక్కులు ఇచ్చినా సరిపోతుందన్నారు. ఈ నీటిని 85 రోజుల వరకూ తీసుకోవచ్చన్నారు. టీబీడ్యాంలో నీటినిల్వ సామర్థ్యం 16 టీఎంసీలకు తగ్గితే హెచ్చెల్సీ ద్వారా చుక్కనీరు కూడా తీసుకునే అవకాశం ఉండదని, అందుకే నీటి సామర్థ్యం 16 టీఎంసీలకు చేరకముందే కోటా మేర నీటిని తీసుకోవాలన్నారు. తర్వాత ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంత అవసరాలను ప్రస్తావించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమస్యలు, సూచనల తర్వాత కలెక్టర్‌ వీరపాండియన్‌ మాట్లాడారు.

12 టీఎంసీలు తీసుకునే అవకాశం : కలెక్టర్‌
డ్యాంలో ప్రస్తుతం 64 టీఎంసీలు ఉన్నాయని, ప్రస్తుతం 26 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. డ్యాంలో 75–80 టీఎంసీల నీటి లభ్యత ఉండే అవకాశం ఉందన్నారు. కాబట్టి 11.5 నుంచి 12 టీఎంసీలు హెచ్చెల్సీ ద్వారా తీసుకునే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ప్రతినీటి చుక్కును తాగునీటి అవసరాలకే వినియోగిస్తామన్నారు. భవిష్యత్తులో మంచి వర్షాలు కురిసి, డ్యాంలో నీటి లభ్యత పెరిగితే సాగునీరు, రక్షకతడుల గురించి ఆలోచిస్తామన్నారు. హంద్రీ–నీవా ద్వారా నీరు వచ్చే అవకాశం ఉందని, అన్ని ప్రాంతాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రజాప్రతినిధులు సహకరించాలని విన్నవించారు.

నీటి లభ్యత బాగా తగ్గింది : మంత్రి కాలవ
మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ టీబీడ్యాం చరిత్రలో ఎన్నడూలేని విధంగా నీటిలభ్యత తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లోకాస్త మాత్రం ఆశాజనకంగా ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాగునీటికే ప్రాధాన్యత ఇస్తామని, ఆ దిశగానే అధికారులు ప్రణాళికలు రూపొందించారన్నారు. శ్రీశైలం నుంచి కూడా నీరు వచ్చే అవకాశం ఉందని, దీన్ని కూడా తాగునీటి అవసరాలకు వినియోగించాలన్నారు.

కణేకల్‌ చెరువుకు మొదట నీళ్లిస్తాం : మంత్రి దేవినేని
అందరి అభిప్రాయాలు ఆలకించిన తర్వాత చివరగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ప్రజాప్రతినిధులు సూచించిన మేరకు ఆయా ప్రాంత అవసరాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఆయకట్టు రైతులు కూడా కలిసి సమస్యలను విన్నవించారన్నారు. అయితే డ్యాంలో నీరు తక్కువగా ఉండటంతో ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిన తీసుకుంటున్నామన్నారు. టీబీడ్యాం నుంచి మొదట కణేకల్‌ చెరువును నింపుతామన్నారు. తర్వాత పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్‌ నింపుతామన్నారు. ముచ్చుమర్రి ద్వారా సెప్టెంబర్‌ రెండోవారంలో ఎత్తిపోతల ప్రారంభిస్తామన్నారు. గండికోటతో పాటు హంద్రీ–నీవా ద్వారా వచ్చేనీటితో మూడు జిల్లాలలో తాగునీటి సమస్యను నివారిస్తామన్నారు.

ఎవరివాదన వారిది...
సీబీఆర్‌ పూర్తిగా అడుగంటిపోవడం, ఎంపీఆర్‌లో నీరు లేకపోవడం, పీఏబీఆర్‌ ప్రమాదకరస్థాయిలో ఉండటంతో ప్రజాప్రతినిధులు ఎవరికివారు తమ ప్రాంత అవసరాల గురించి మాట్లాడారు. 4 దశాబ్దాలుగా ఐఏబీ సమావేశంలో పాల్గొంటున్నానని, ఇప్పటికీ తాడిపత్రికి సాగునీరు అందించలేకపోతున్నానని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ‘ఇన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. సాగునీళ్లు ఇప్పించలేకపోతే నువ్వేం నేతవని మా ప్రాంత ప్రజలు నిలదీసే అవకాశం ఉందని, ఆ పరిస్థితి రానివ్వొద్దన్నారు. వచ్చేనీటిలో తొలిప్రాధాన్యతగా తాడిపత్రికి తాగునీరు అందించాలని కోరారు. శింగనమలలో 26 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయని, నీళ్లు రాగానే మొదట టైఎల్‌అండ్‌ అంటూ పులివెందులకు తీసుకెళ్తున్నారని, శింగనమలకే మొదట నీళ్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ శమంతకమణి కోరారు. సీబీఆర్‌ పరిస్థితి దారుణంగా ఉందని, యుద్ధప్రాతిపదికను నీళ్లు వదలకపోతే పులివెందుల, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాలలోని 850 గ్రామాలకు తాగునీరు ఆగిపోతుందని ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, చాంద్‌బాషా తెలిపారు.

చిత్రావతికి ఎప్పుడూ అన్యాయమే
‘టీబీడ్యాంలో 64 టీఎంసీలు ఉన్నాయి. ఇన్‌ఫ్లోబాగానే ఉంది. గతంతో పోలిస్తే నీటి లభ్యత తగ్గింది. పీఏబీఆర్, సీబీఆర్‌లు తాగునీటికి నిర్ధేశించినవి. సీబీఆర్‌లో 0.1 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పులివెందులలో తాగునీటి పథకాలు పనిచేయడం లేదు. చిత్రావతికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. ఎంపీఆర్‌ నుంచి వెంటనే సీబీఆర్‌కు నీటిని విడుదల చేయాలి. అలాగే పులివెందుల పరిధిలోని చీనీచెట్లను కాపాడాలి.
– అవినాశ్‌రెడ్డి, ఎంపీ, కడప

ఆలూరు కెనాల్‌కు నీళ్లివ్వండి
ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఖాజాపూర్‌ రిజర్వాయర్‌ ఎండిపోయింది. మాకు 15 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీరు లేకపోయినా ఫర్వాలేదు. మొదట తాగునీరు విడుదల చేయండి. హంద్రీ–నీవా ద్వారా నీరు వస్తే ఆ నీటిని ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌కు విడుదల చేయాలి.
– గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే, ఆలూరు

‘ప్రాంతాలతో పనిలేదు. జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలి. పశువులకు నీరు లేక కబేళాలకు తరలుతున్నాయి. నీరు అనేది ప్రాణాధారం. మాకంటే మాకివ్వండని ఎమ్మెల్యేలు అడగటం కరెక్ట్‌ కాదు. అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలి. సాగుకు వినియోగించే నీటిని అరికట్టాలి. ఎస్‌పీని కూడా సమావేశానికి పిలిపించాలి. అవసరమైతే ఒక చెరువు నుంచి మరో చెరువుకు కాలువలు నిర్మించి అన్నింటినీ నీటితో నింపాలి.’’
– వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ

‘నీటి వినియోగంపై ప్రభుత్వానికి ప్రణాళిక లేదు. గతేడాది హంద్రీనీవా ద్వారా 26 టీఎంసీలు వచ్చాయి. భవిష్యత్‌ అవసరాలు పట్టించుకోకుండా ఎవరికి బలం ఉంటే వారు చెరువులకు తీసుకెళ్లారు. నీటి విడుదలలో మంత్రులు, ఎమ్మెల్యేలు మినహా అధికారుల ప్రమేయం ఉండటం లేదు. ఈ ఏడాది టీబీ డ్యాంలోకి నీరు రాకపోయి ఉంటే తాగునీటి పరిస్థితి ఏంటి? ఉరవకొండకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రాజకీయంగా చూస్తున్నారు. కర్ణాటక అన్యాయంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం స్పందించడంలో వైఫల్యం చెందింది.
– విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement