'విశ్వ' రూపం | IAB meeting in Anantapur | Sakshi
Sakshi News home page

'విశ్వ' రూపం

Published Sun, Aug 5 2018 7:21 AM | Last Updated on Tue, Oct 30 2018 5:12 PM

IAB meeting in Anantapur - Sakshi

సాక్షి ప్రతినిధి, అనంతపురం: మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదంతో ఐఏబీ(సాగునీటి సలహా మండలి సమావేశం) సమావేశం రసాభాసగా మారింది. ఏడాదికి ఒక్కసారి నిర్వహించే సమావేశానికి సగం మంది ఎమ్మెల్యేలు కూడా హాజరుకాని పరిస్థితి. వచ్చిన వారి అభిప్రాయాలను కూడా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓపిగ్గా వినకపోవడం గమనార్హం. పక్ష ఎమ్మెల్యేలతో పాటు స్వపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు చెబుతుండగా మంత్రి జోక్యం చేసుకుని ‘ఓకే.. ఓకే.. అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం. వీలైనంత త్వరలో నీళ్లిస్తాం’ అని అడ్డుపడ్డారు. స్వపక్షపార్టీ నేత కావడంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఏమనలేక మౌనంగా ఉండిపోయారు. అప్పటికీ ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, జితేంద్రగౌడ్, ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడేది పూర్తిగా వినాలని మంత్రికి చెప్పారు. ఇంత తతంగం జరుగుతున్నా ఐఏబీ చైర్మన్‌ జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌ కనీసం పెదవి విప్పలేదు. ప్రేక్షకపాత్ర వహించారు. చివరకు నీటి కేటాయింపుల గురించి కూడా మాట్లాడలేకపోవడం గమనార్హం.

ఈ ఏడాది హెచ్చెల్సీ కోటా 25.142 టీఎంసీలు
తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది నీటి లభ్యత 164 టీఎంసీలుగా టీబీ బోర్డు నిర్ధారించింది. ఇందులో దామాషా ప్రకారం 25.142 టీఎంసీలు హెచ్చెల్సీకి కేటాయించారు. ఇందులో తొలి ప్రాధాన్యతగా 10టీఎంసీలు తాగునీటికి కేటాయించారు. తక్కిన 15.142 టీఎంసీలు సాగునీటికి కేటాయించారు. తుంగభద్ర మెయిన్‌ కెనాల్, జీబీసీ(గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌), ఎంపీఆర్‌ దక్షిణ, ఉత్తర కాలువలు, తాడిపత్రి బ్రాంచ్‌ కెనాల్‌కు కలిపి 6.808 టీఎంసీలు కేటాయించారు. కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌కు 0.742 టీఎంసీలు, వైఎస్సార్‌జిల్లా మైలవరం బ్రాంచ్‌ కెనాల్‌కు 1.253, పులివెందుల బ్రాంచ్‌ కెనాల్‌కు 1.378 టీఎంసీలు కేటాయించారు. మొదట పీఏబీఆర్, ఎంపీఆర్‌లో నీటిని నిల్వ చేసుకుని తర్వాత కోటా మేర కాలవలకు నీటి విడుదల ప్రారంభిస్తామన్నారు. హెచ్చెల్సీ మెయిన్‌ కెనాల్, జీబీసీకి ఈ నెల 6న నీటిని విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. సమావేశంలో మంత్రి పరిటాల సునీత, మండలి చీఫ్‌ విప్‌ పయ్యావుల కేశవ్, విప్‌ యామినీబాల, జెడ్పీ చైర్మన్‌ పూల నాగరాజు, జాయింట్‌ కలెక్టర్‌ ఢిల్లీరావు, హెచ్చెల్సీ ఎస్‌ఈ మక్బూల్‌ సాహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

జీబీసీకి రేపు నీటి విడుదల అసాధ్యం:
జీబీసీకి రేపు నీటి విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. అయితే కాలవ ఉన్న పరిస్థితుల్లో వెంటనే నీటి విడుదల సాధ్యం కాదని పనులు చూస్తే స్పష్టమవుతుంది. ఈ పనులను ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ చేస్తోంది. వీరికి నీటి విడుదల తేదీ 23 అని ప్రభుత్వం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాలవలో మట్టి ఉంది. దీన్ని తొలగించాలంటే కనీసం 15–20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ మంత్రి దేవినేని మాత్రం రేపు జీబీసీకి నీళ్లస్తామని ప్రకటించడం గమనార్హం.

ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి: ‘‘జిల్లాలో కరువు తీవ్రంగా ఉంది. కరువు మండలాలను ఏమైనా గుర్తించారా?’’ అని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు.
మంత్రి కాలవ: మీరు కరువు మండలాల గురించి మాట్లాడకూడదు.

ఎమ్మెల్యే విశ్వ: ఏడాదికి ఒకసారి సమావేశం జరుగుతుంది. విపక్షపార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఉంటే కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే ఎలా?

కాలవ: వైఎస్‌ రాజశేఖరరెడ్డి బతికుంటే అనంతపురానికి, రాయలసీమకు నీళ్లు వచ్చేవి కావు. చంద్రబాబే నీళ్లు తీసుకొచ్చారు.

విశ్వ: చనిపోయిన వ్యక్తి పేరును ప్రస్తావించకూడదనే సంస్కారం కూడా లేదా. వైఎస్‌ హయాంలో హంద్రీనీవా 75శాతం పూర్తయితే ఇప్పటి వరకూ మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. 2012లోనే జీడిపల్లికి నీళ్లొచ్చాయి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందా? హంద్రీనీవా సామర్థ్యాన్ని 5టీఎంసీలకు తగ్గించి తాగునీటి ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చారు. 40టీఎంసీలతో వైఎస్‌ పనులు చేసి నీళ్లు తెచ్చారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 54వేల క్యూసెక్కులకు వైఎస్‌ పెంచారు. అనంతపురం కరువు జిల్లా అని సొంత జిల్లా కేసీ కెనాల్‌కు వెళ్లే నీటిలో 10 టీఎంసీలను హెచ్చెల్సీ ద్వారా అనంతకు కేటాయిస్తూ వైఎస్‌ జీఓ ఇచ్చారు. ఆ నీళ్లే ఇప్పటికీ ‘అనంత’కు అందుతున్నాయి. పోలవరానికి రూ.5వేల కోట్లు వైఎస్‌ హయాంలోనే ఖర్చు చేశారు. కుడి కాలవను కూడా ఆయన హయాంలోనే పూర్తి చేశారు. నాలుగేళ్లుగా టీడీపీ అధికారంలో ఉన్నా హంద్రీ–నీవా నీళ్లు జిల్లాకు వస్తుంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేక, ఒక్క ఎకరానూ తడపలేకపోయారు. ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వాములైనా మీరు వైఎస్‌ గురించి మాట్లాడుతారా?

.. విశ్వేశ్వరరెడ్డి నేరుగా సంధిం చిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాలవ సహనం కోల్పోయి సంబంధం లేని విషయాలను మాట్లాడారు. ఇంతలో మంత్రి దేవినేని ఉమాతో పాటు ఇతర ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement