సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కానీ నేడు వర్గవిభేదాలు, అసమ్మతులు, అసంతృప్తులకు పెట్టనికోట. నియోజకవర్గ స్థాయి నాయకులు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ సవాళ్లు విసురుకుంటుంటే.. ఉన్న కొద్దిమంది కార్యకర్తలూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు సైతం అండగా లేకపోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ద్వితీయ శ్రేణి నాయకులంతా సమావేశమయ్యారు. ఇది సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అయింది. దీంతో పల్లె వారిని బుజ్జగించాల్సి వచ్చింది. ఇప్పుడు పరిటాల శ్రీరాం వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ధర్మవరంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా మరో పార్టీలోకి వెళ్లారు. దీంతో పరిటాల శ్రీరాంను ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్‌గా నియమించారు. అయితే.. వరదాపురం సూరి తిరిగి పార్టీలోకి వస్తున్నారనే సంకేతాలు రావడంతో శ్రీరాం ఫైరయ్యారు. ‘పార్టీలోకి ఎవరొచ్చినా కండువా నేనే వేయాలి. పదవులూ నేనే ఇవ్వాలి. అయినా చెంచాలకు సీట్లొస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీడీపీలోని పరిటాల వ్యతిరేకులు దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక హిందూపురంలో నెగ్గిన బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యారు. ఆయన పేరు చెప్పి మరో వ్యక్తి పెత్తనం చెలాయిస్తుండటంతో కిందిస్థాయి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు.
చదవండి: (పారిశ్రామిక విప్లవం)
కాలవకు సెగ..
రాయదుర్గం నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు సొంత పార్టీ శ్రేణుల నుంచే సెగ తగులుతోంది. మంత్రి ఉన్నప్పుడు చేసిందేమీ లేదంటూ కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అనంతపురంలో నివాసముంటున్న ఆయన నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారని వారు వాపోతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రస్తుత ఇన్‌చార్జ్ ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వర్గీయుల మధ్య పోరు నడుస్తోంది. ఏవర్గంలో ఉండాలో తెలియక కార్యకర్తలు సతమతమవుతున్నారు. అనంతపురం అర్బన్‌లో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభాకర్ చౌదరిపై అసమ్మతులు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. పెనుకొండ నగర పంచాయతీలో భారీ ఓటమి తర్వాత బీకే పార్థసారథి పరిస్థితి దయనీయంగా మారింది. ఆయన్ను స్వయాన చంద్రబాబు పిలిపించుకుని గట్టిగా మందలించిన విషయం తెలిసిందే. శింగనమల, మడకశిర నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఏమాత్రమూ బాగోలేదని టీడీపీ నేతలే చెబుతున్నారు.
చదవండి: (సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయాలకు ప్రత్యేక వ్యవస్థ)
గౌరవ సభలా? విందు భోజనాలా?
గౌరవ సభల పేరిట టీడీపీ నిర్వహిస్తోన్న కార్యక్రమాలు అభాసుపాలవుతున్నాయి. శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి మాంసాహారం వడ్డిస్తున్న తీరు విందు భోజనాలను తలపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో జనం రాకపోవడంతో డబ్బులిచ్చి మరీ తీసుకెళుతున్నారు. ఈ సభలు ఎందుకు పెడుతున్నారో వాటికి వచ్చే వారికి కూడా తెలియడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment